రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

ఉపరితల  ఆవర్తనం ప్రభావంతో  రాష్ట్రంలో  భారీ  వర్షాలు  కురుస్తున్నాయి. దీనికితోడు  బంగాళాఖాతంలో అల్పపీడనం  ఏర్పడే అవకాశం  ఉండడంతో… మరో రెండు రోజులపాటు  రాష్ట్రంలో మోస్తరు  నుంచి భారీ  వర్షాలు  కురిసే  అవకాశం ఉందని  చెబుతోంది వాతావరణశాఖ. ఉత్తర,  తూర్పు తెలంగాణ  జిల్లాల్లోని  కొన్ని ప్రాంతాల్లో  అతిభారీ వర్షాలు  కురుస్తాయని  చెబుతోంది.

రాష్ట్రంలో మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లా సర్వాపూర్ లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా.. గాంధారిలో 15.3 సెంటీమీటర్లు.. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లాలో 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

నిన్న హైదరాబాద్ లోనూ పలు ప్రాంతాల్లో  మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్ గిరి, చర్లపల్లి, నేరేడ్ మెట్, నాచారం, సికింద్రాబాద్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. దీంతో మాన్ సూన్ బృందాలను అలర్ట్ చేసింది బల్దియా. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో చెరువులు పొంగి పొర్లుతున్నాయి. పరకాల శివారులోని దామెర చెరువు, గుర్రాలపి చెరువులు అలుగు పోస్తున్నాయి. దీంతో.. పరకాల-హుజూరాబాద్, పరకాల-మొగుళ్లపల్లి ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా కొండాయి గ్రామంలో ఓఇంటిపై పిడుగుపడి ఒకరు చనిపోగా ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్ నగరంలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్టీఆర్ నగర్, మధురానగర్, లక్ష్మీగణపతి కాలనీల్లో మోకాళ్లలోతు నీరు నిలవటంతో… స్థానికులు అవస్థలు పడుతున్నారు. నర్సంపేటలో పలు కాలనీలు నీటమునిగాయి.

జయశంకర్ భూపాలపల్లి జిలాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిట్యాల మండలంలో వరదనీరు పోటెత్తడంతో కొన్ని చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం పుల్గర్ చర్ల దగ్గర్లోని బీమా కాలువ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కు గండి పండడంతో.. దాదాపు 80 ఎకరాల వరి పంట నీటమునిగింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షంతో… బాసర దగ్గర గోదావరి ఉదృతంగా ప్రవహిస్తోంది. గంటగంటకు నీటిమట్టం పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాల జనాన్ని అప్రమత్తం చేశారు అధికారులు. కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ కు వరద ఉధృతి కొనసాగుతుండడంతో ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో.. మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది భారత వాతావరణశాఖ. ఇప్పటికే దాదాపు 75శాతానికి పైగా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని.. రెండు రోజుల్లో ఈశాన్య తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలకు అవకాశం ఉందని చెబుతోంది.

Latest Updates