జపాన్ లో భారీగా కురిసిన మంచులో చిక్కుకున్న వెయ్యి వెహికిల్స్

భూకంపాలకు నిలయమైన జపాన్ లో భారీ స్థాయిలో హిమపాతం సంభవించింది. ఎడతెరిపిలేకుండా కురిసిన మంచుకు టోక్యో- నైగటా ఎక్స్ ప్రెస్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 1000 వాహనాలు రోడ్డుపైనే మంచులో కూరుకుపోయాయి.  దీంతో ఏకంగా 40 గంటల పాటు వాహనదారులు నరకం అనుభవించారు.

మంచు ఏకధాటిగా కురుస్తూనే ఉండడంతో రోడ్డుపై వాహనాలు ముందుకు కదిలే వీల్లేకపోవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒకటిన్నర రోజుకు పైగా తమ వాహనాల్లోనే ఆకలిదప్పులతో అలమటించారు. దాహం వేయడంతో నీళ్లు దొరక్కపోగా… మంచు ముక్కలను బాటిళ్లలో వేసుకుని అవి కరిగిన తర్వాత ఆ నీటిని తాగారు. ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.

చివరికి ప్రభుత్వ సిబ్బంది రహదారులపై మంచును అతికష్టం మీద తొలగించడంతో వాహనాలు ముందుకు కదిలాయి. కొన్ని అడుగుల వరకు పేరుకుపోయిన మంచును తొలగించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. భారీ బుల్డోజర్లను రంగంలోకి దింపి మంచును తొలగించి రోడ్లను క్లీన్ చేశారు.

Latest Updates