రానున్న మూడు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు

హైద‌రాబాద్ : రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైద‌రాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.

అంతేకాకుండా 5.8 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతున్న షేర్ జోన్ వల్ల శ‌నివారం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సిద్దిపేట, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు.

ఆది, సోమ‌వారాల్లో ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ,భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.

Latest Updates