తల్లి పాలు డొనేట్ చేస్తున్న ‘అమ్మ’

తల్లిపాలు బిడ్డలకు అమృతం. కానీ, ఆ అమృతం దొరక్క చాలామంది పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. అలాంటి వాళ్లకోసం తల్లిగా మారింది ముంబైకి చెందిన నిధి పర్మార్ హిరానందని. పాలు దొరక్క అల్లాడుతున్న ఎంతో మంది పిల్లలకు తన పాలను డొనేట్ చేస్తోంది ఈమె.

42 ఏళ్ల హిరానందని ఫిల్మ్ మేకర్. ఈ జనవరిలో  ఈమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తన  బాబు కడుపునిండా పాలు తాగిన తర్వాత కూడా ఇంకా పాలు మిగిలేవి ఆమెకి.  అలా పాలు వేస్ట్ అవ్వడాన్ని తట్టుకోలేకపోయింది హిరానందని. దాంతో ఆ పాలను డొనేట్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఆరోజు నుంచి ఇప్పటివరకూ పాలను డొనేట్ చేస్తూనే ఉంది.

ఇంటర్నెట్ ద్వారా..

పాలు డొనేట్ చేయాలని డిసైడ్​ అయ్యాక  ఎలా డొనేట్ చేయాలోనన్న వివరాల కోసం చాలామందిని అడిగింది హిరానందని. కానీ, ఎవరి నుంచీ సరైన సమాధానం రాలేదు. దాంతో ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి దగ్గర్లోని డొనేషన్ సెంటర్ల వివరాలు తెలుసుకుంది. చివరకు ముంబైలోని సూర్య హాస్పిటల్ లో ఎమర్జెన్సీ వార్డ్ లోని చిన్నారుల కోసం పాలను డొనేట్ చేయడం మొదలుపెట్టింది.

40 లీటర్లు పైనే..

మార్చి నెల నుంచి ఇప్పటివరకు హిరానందిని నలభై లీటర్లకు పైనే తన పాలను డొనేట్ చేసింది. తన పాలు అందించిన పిల్లల్లో ప్రీమెచ్యూర్ బేబీస్, బరువు తక్కువగా పుట్టిన చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. ఓ సారి స్వయంగా తన పాలు తాగే చిన్నారులను చూడడం కోసం హాస్పిటల్​కి వెళ్లిందంట. అక్కడ ఆ చిన్నారులను చూసిన తర్వాత తనపాలను మరో ఏడాది పాటు డొనేట్​ చేయాలని నిర్ణయం తీసుకుంది.

Latest Updates