
హెల్మెట్ లేని వాహనదారులకు హెల్మెట్ కొనుగోలు చేయించారు సీపీ సజ్జనార్. శుక్రవారం సైబరాబాద్, రామచంద్రపురం ఇక్రిశాట్ దగ్గర వాహనదారులకు హెల్మెట్ పై అవేర్ నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీపీ సజ్జనార్.. సైబరాబాద్ పరిధిలో శుక్రవారం 7 రోడ్డు భద్రత తనిఖీ కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఈ కేంద్రాలు 24 గంటలు పని చేస్తాయని.. మీరు, మీ కుటుంబ సభ్యులు గుర్తు పెట్టుకొని తప్పకుండా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. మందు తాగి రోడ్డు మీదకు రాకూడదని ..ఒకవేళ రావాల్సి వస్తే, ఆటోలోనో, క్యాబ్ లోనో వెళ్లాలని చెప్పారు.
పోయిన సంవత్సరం ఈ రోడ్డుపై 500 వరకు మరణాలు జరిగితే, 1000 మంది గాయాలపాలయ్యారని తెలిపారు. తెలంగాణ పోలీసు శాఖ మీ భద్రత కొరకు పని చేస్తుందని, మీ భద్రతతోపాటు.. మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని, ట్రాఫిక్ రూల్స్ పాటిచాలని సూచించారు. టూ వీలర్ అయితే హెల్మెంట్, ఫోర్ వీలర్ అయితే సీటు బెల్టు పెట్టుకోవాలని.. ఎట్టి పరిస్థితిలో త్రిబుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదన్నారు. ఇవన్నీ పోలీసుల కోసం కాకుండా మీ కోసమే మీరు అన్నట్టుగా జాగ్రత్తలు పాటిస్తే మంచిదని సూచించారు. ఈ సందర్భంగా ఓ వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పై పాడిన పాట ఎంతగానో అవగాహన కల్పించింది. పాట పాడిన వ్యక్తిని అభినందించారు సీపీ సజ్జనార్.