కరోనాపై సాయం చేస్తం : జిన్​పింగ్​కు ప్రధాని మోడీ లేఖ

మాస్కులు, గ్లోవ్స్​ల ఎగుమతిపై చైనా వరకు నిషేధం ఎత్తివేత
మిగతా దేశాలకు యథావిధిగా నిషేధం
811కు పెరిగిన కరోనా మృతులు
 కరోనాపై జిన్​పింగ్​కు లెటర్‌ రాసిన మోడీ 

న్యూఢిల్లీకరోనా వైరస్​పై పోరాటంలో అవసరమైతే సాయం చేస్తామని చైనాకు కేంద్రం ఆఫర్​ ఇచ్చింది. ఆదివారం చైనా ప్రెసిడెంట్​ షి జిన్​పింగ్​కు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాసినట్టు అధికారులు తెలిపారు. కరోనాతో అతలాకుతలమవుతున్న జనానికి సానుభూతి ప్రకటించారన్నారు. హుబెయ్​ ప్రావిన్స్​ నుంచి 650 మంది ఇండియన్లను తరలించడంలో సహకరించినందుకు జిన్‌పింగ్‌కు మోడీ కృతజ్ఞతలు తెలిపారన్నారు. కాగా, కరోనాతో ఫైట్​లో భాగంగా సర్జికల్​ మాస్కులు, డిస్పోజబుల్​ మాస్కుల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తేసింది. నిషేధం ఎత్తివేతపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నా, చైనాకు సాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నైట్రైల్​ బ్యుటాడయీన్​ రబ్బర్​ గ్లోవ్స్​ తప్ప ఇతర గ్లోవ్స్​, సర్జికల్​ మాస్కులను చైనాకు ఎగుమతి చేసుకునే అవకాశం కల్పించింది. శనివారం డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ ఫారిన్​ ట్రేడ్​ ఉత్తర్వులిచ్చింది. చైనాకు తప్ప మిగతా దేశాలకు మాస్కులు, గ్లోవ్​ల ఎగుమతిపై మాత్రం నిషేధం ఉంటుందని తెలిపింది. చైనాలో ఫస్ట్​ కరోనా వైరస్​ కేసు నమోదైన నేపథ్యంలో జనవరి చివరి వారంలో వాటిపై నిషేధం విధించింది. దాని తీవ్రత పెరిగిపోతున్న క్రమంలో ఆ నిషేధాన్ని చైనా వరకు ఎత్తేసింది.

మృతులు 811

కరోనా వైరస్​కు బలైన వారి సంఖ్య 811కి పెరి గింది. బాధితుల సంఖ్య 37,198కి చేరింది. శనివారం ఒక్కరోజే 89 మంది వైరస్​ వల్ల చనిపోయారని, హుబెయ్​ ప్రావిన్స్​లోనే 81 మంది మరణించారని చైనా నేషనల్​ హెల్త్​ కమిషన్​ ప్రకటించింది. కొత్తగా 2,656 కేసులు నమోదయ్యాయని తెలిపింది. చైనా సాయం కోరిన నేపథ్యంలో ఇంటర్నేషనల్​ టీమ్​ను పంపుతామని ఐక్యరాజ్యసమితి డైరెక్టర్​ జనరల్​ టెడ్రోస్​ అధనోమ్​ ఘెబ్రియేసస్​ తెలిపారు. ముందుగా టీమ్​ లీడర్​ వెళతారని, ఆ తర్వాత మిగతా సభ్యులూ అక్కడకు చేరుకుంటారని చెప్పారు. కాగా, కరోనా వైరస్​ గురించి ముందే హెచ్చరించిన డాక్టర్​ లి వెన్లియాంగ్​ నోరు మూయించడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైందని అక్కడి జనం మండిపడుతున్న సంగతి తెలిసిందే. అతడు చనిపోయాక చైనా ప్రభుత్వాన్ని జనం విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్​ ప్రభావం గురించి నిజాలను జనానికి చేరవేస్తున్న షెన్​ ఖాయిషీ అనే జర్నలిస్టు నోరునూ చైనా ప్రభుత్వం మూసేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనవరి 24న వుహాన్​కు వెళ్లిన షెన్​ను అక్కడి అధికారులు క్వారెంటైన్​ పేరుతో బంధించారని అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆరోపించారు. కరోనా ఎఫెక్ట్​తో చైనా రాజధాని బీజింగ్​, షాంఘైలు జనాలు లేక ఖాళీగా కనిపించాయి.

ఇండియాకు ముప్పే

కరోనా వైరస్​తో ఇండియాకు పెద్ద ముప్పే పొంచి ఉందని జర్మనీకి చెందిన హంబోల్డ్​ యూనివర్సిటీ, రాబర్ట్​ కోచ్​ ఇనిస్టిట్యూట్​లు చేసిన స్టడీలో తేలింది. వైరస్​ బాగా వ్యాపించే 20 దేశాల లిస్టులో ఇండియా 17వ స్థానంలో ఉందని చెప్పింది. ప్రపంచంలోని 4 వేల ఎయిర్​పోర్టుల ఎయిర్​ట్రాఫిక్​ ప్యాటర్న్​లను అంచనా వేసిన సైంటిస్టుల టీం, ఆయా రూట్లలో చైనా నుంచి 25 వేల డైరెక్ట్​ రాకపోకలు జరిగాయని తేల్చింది. ఇండియాకు ఉన్న రిలేటివ్​ ఇంపోర్ట్​ రిస్క్​ (వైరస్​కు ఎఫెక్ట్​ అయిన ప్రాంతం నుంచి ఆ వైరస్​ సోకిన జనాల ప్రయాణం) 0.219 శాతమని
పేర్కొంది.

గాంధీకి మరో 2 కరోనా సస్పెక్టెడ్ కేసులు

హైదరాబాద్​, వెలుగు: కరోనా లక్షణాలతో గాంధీ హాస్పిటల్​లో ఆదివారం మరో ఇద్దరు అడ్మిట్ అయ్యారు. వాళ్లిద్దరినీ అబ్జర్వేషన్​ కోసం ఐసోలేషన్​ వార్డులో పెట్టామని నోడల్​ ఆఫీసర్​, డాక్టర్​ విజయ్​ కుమార్​ తెలిపారు. వాళ్ల శాంపిళ్లు తీసుకుని టెస్టుల కోసం పంపామన్నారు. శనివారం వచ్చిన తొమ్మిది మందికి టెస్టులు నెగెటివ్​ వచ్చాయన్నారు. ఇప్పటిదాకా 70 మందికి టెస్టులు చేశామని, వాళ్లెవరికీ వైరస్​ లేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ఒక ప్రకటనలో వెల్లడించారు.

కరోనాను జయించిండు

కరోనా వైరస్​ సోకిన గర్భిణీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆ బుడ్డోడు మాత్రం మస్తు లక్కీ ఫెలో. ఎందుకంటే, అమ్మ ఒంట్లో ఉన్న వైరస్​, ఆ బుడ్డోడికి సోకలేదు. ఈ ఘటన చైనా ఝెజియాంగ్​ ప్రావిన్స్​లో శనివారం జరిగింది. హాంగ్జూలోని చిల్డ్రెన్స్​ హాస్పిటల్​ ఆఫ్​ ఝెజియాంగ్​ యూనివర్సిటీ స్కూల్​ ఆఫ్​ మెడిసిన్​లో ఆ చిన్నారికి డీఎన్​ఏ టెస్టులు చేయగా రిపోర్టులు నెగెటివ్​ వచ్చాయి. అయితే, కొన్ని రోజుల పాటు అబ్జర్వేషన్​లో పెట్టి, మళ్లీ టెస్టులు చేసి నిర్ధారిస్తామని డాక్టర్లు చెబుతున్నారు.

see also: పిల్లి కాదు.. పులి

మరిన్ని వార్తల కోసం

Latest Updates