హేమంత్ హత్య కేసు: రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ మరిన్ని విషయాలు

హదరాబాద్: పరువు హత్యకు గురైన హేమంత్ అంత్యక్రియలు హైదరాబాద్ చందానగర్ హిందూ శ్మశాన వాటికలో జరిగాయి. లండన్ నుంచి వచ్చిన హేమంత్ సోదరుడు సుమంత్.. అన్నయ్యను చూసి బోరున విలపించాడు. వర్షంలోనూ కడసారి చూపు కోసం బంధుమిత్రులతో పాటు కాలనీ ప్రజలు భారీగా తరలివచ్చారు. హేమంత్ ను చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని అతని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పక్కా ప్లాన్ వేసి.. చంపారని.. హంతకుల్లో ఆడవాళ్లు కూడా ఉన్నారన్నాడు సుమంత్. హేమంత్ ను చిత్ర హింసలు పెట్టిన ఎవ్వరినీ వదలొద్దన్నాడు. సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసు.. రిమాండ్ రిపోర్టులో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. నెల రోజుల ముందే హేమంత్ ను చంపేందుకు లక్ష్మారెడ్డి, యుగేందర్ రెడ్డి ప్లాన్ చేసినట్లు రిమాండ్ డైరీలో ప్రస్తావించారు పోలీసులు. గచ్చిబౌలి TNGO కాలనీలో నివాసముంటున్న హేమంత్ ను చంపేందుకు.. నెలముందే యుగేందర్ సోదరులు రెక్కీ చేసినట్లు చెప్పారు.

హేమంత్ ను ఎలా చంపాలి, ఎలా కిడ్నాప్ చేయాలన్నదానిపై స్కెచ్ వేశాడు యుగేందర్. లింగంపల్లిలోని లక్ష్మారెడ్డి ఇంట్లో మీటింగ్ పెట్టారు. కిరాయి హంతకులు కృష్ణ,  రాజు, పాషాలతో ఇదే విషయంపై చాలాసార్లు డిస్కషన్ చేశాడు యుగేందర్. మాయమాటలు చెప్పి అవంతిని తమ వైపు తిప్పుకోవాలని ప్లాన్ వేశాడు లక్ష్మారెడ్డి. నెల రోజులుగా అవంతిని తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. హత్య ప్లాన్ అమలు చేశారు. 24న మధ్యాహ్నం రెండున్నరకు ఇంట్లోకి బలవంతంగా 12 మంది చొరబడ్డారు. హేమంత్, అవంతిపై దాడిచేస్తూ.. కార్లోకి ఎక్కించారు బంధువులు. లింగంపల్లిలో మాట్లాడుదామని గోపన్ పల్లి వైపు తీసుకెళ్లారు. ఈ సమయంలో గోపన్ పల్లిలో అవంతి, హేమంత్ తప్పించుకున్నారు. అవంతి పారిపోయినా.. హేమంత్  దొరికాడు. రాత్రి ఏడున్నరకు కారులోనే హేమంత్ ను చంపారు నిందితులు. సీన్ లో లేకుండా అవంతి పేరెంట్స్ లక్ష్మారెడ్డి, అర్చన జాగ్రత్తపడ్డారు. కేసులో మొత్తం 13 మంది బంధువులు ఇన్వాల్వ్ అయ్యారని రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారు పోలీసులు.

జూన్ 10న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అవంతి, జూన్ 11న హేమంత్ ను ప్రేమ వివాహం చేసుకుంది. అవంతి, హేమంత్  వివాహాన్ని అవమానంగా భావించారు లక్ష్మారెడ్డి అతని భార్య అర్చన. కూతురి వివాహంపై.. తన అన్న యుగేందర్ తో గోడు వెళ్లబోసుకుంది అర్చన. కూతురు ప్రేమ వివాహం తర్వాత.. 4నెలల పాటు ఇంట్లోనే ఉన్నారు లక్ష్మారెడ్డి, అర్చన దంపతులు. దీంతో అవంతిని హేమంత్ నుంచి విడదీయాలని నిర్ణయించుకున్నాడు యుగేందర్. లక్ష్మారెడ్డి ఇంట్లో కుటుంబ సభ్యులు సమావేశమై చర్చించారు. యుగేందర్ రెడ్డి తన అన్న విజయేందర్ రెడ్డి గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో అవంతి ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఇంటి నుంచి బలవంతంగా హేమంత్, అవంతిలను తీసుకెళ్లారు. అవంతి పారిపోవడంతో.. హేమంత్ ను హత్య చేశారు. అర్చన బాధ చూడలేకే హత్య చేయించానని యుగేందర్ చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో రాశారు పోలీసులు. కేసులో 13మంది ఫ్యామిలీ మెంబర్స్, డ్రైవర్ తో కలిపి ఐదుగురు కిరాయి గూండాలున్నారని చెబుతున్నారు పోలీసులు. డ్రైవర్ సహా.. 14మంది ఫ్యామిలీ మెంబర్స్ ను నిన్న రిమాండ్ చేశారు. ఇవాళ ఏ5 కృష్ణ, ఏ6 పాషాను పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారంటున్నారు పోలీసులు.

Latest Updates