తెలంగాణలోని ఆ గ్రామంలో కోడి కూర తినరు

కోడి కోయని ఊరు కూడా ఉంటదా?

ఉంటదా ఏంది.. ఉంది!
ఎక్కడో కాదు మన తెలంగాణల్నే…!

మన తెలంగాణల ఇంటికి సుట్టాలచ్చిండ్రంటే…
కోడి కొయ్యాల్సిందే!

కనీసం గుడ్డు కూరైనా వండి పెడ్తం!

అసుంటిది మన తెలంగాణల కోడి కోయని ఊరుందా? ఉంది..! అదే కదా విషయం!!

తెలంగాణల కొత్తగ  ఏర్పాటైన వనపర్తి జిల్లాలోని, పెబ్బేరు మండలం, కంచిరావుపల్లి తాండకు ఓ ప్రత్యేకత ఉన్నది. అదేంటంటే ఈ ఊర్ల అసలు కోడి కూర తినరు. కోడిని కొయ్యరు. కోళ్లను పెంచరు కూడా..!  ఈ తండా మొత్తం తిరిగినా కనీసం కోడి ఈక కూడా కనిపించదు. అంతేకాదు.. ఈ తండాల  పెరిగినోళ్లకు చేపల రుచి కూడా తెల్వదు. కోడి కూరకు,  చేపల కూరకు ఈ తాండ దూరమై పిడీ(తరాలు)లు  గడుస్తున్నయట. మరైతే ఈ ఊరు మొత్తం శాకహారులేనా?

 

యాట తెగాల్సిందే..
అట్లేం లేదు.. కోడి కూర, గుడ్లు, చేపలు.. తినరు కదా అని ఈ ఊరు మొత్తం శాకాహారులే అనుకోవడానికి కూడా లేదు. ఇంటికి సుట్టాలస్తే యాట తెగాల్సిందే. ఏ పండగొచ్చిన, పబ్బమొచ్చిన మేక మాంసంతోనే దావత్ చేసుకుంటరు. అంతేతప్ప కోడి జోలికి, చేపల జోలికి పోరు. అసలు కోడి పేరు చెప్తనే ఈ ఊర్ల ఆడోళ్లు, పిల్లలు వాంతులు చేసుకుంటరట.
గురూజీ చెప్పిండని…
ఈ ఆచారం నిన్నమొన్న వచ్చింది కాదు.. పిడీల నుంచి ఈ తాండల కోడి కూర తిన్నోళ్లే లేరట. ఒకవేళ తింటే.. రక్తం కక్కుకొని సచ్చిపోతరని వీళ్ల గురువు చెప్పిండట. అప్పటి నుంచి గురువుకిచ్చిన మాట ప్రకారం ఈ ఊరంతా కోడికి, గుడ్డుకు, చేపలకు దూరంగా ఉంటుందట.
కోడళ్లు కూడా..
ఈ ఊరి నుంచి పెళ్లి చేసుకొని వేరే ఊరికి వెళ్లిన ఆడ పిల్లలంతా అత్తగారింట్ల కోడి కూర తింటరు. కానీ.. ఈ ఊరికి కోడళ్లుగా వచ్చెటోళ్లు మాత్రం ఇక కోడిని, గుడ్డును, చేపలను మర్చిపోవాల్నట. సంబంధం కలుపుకొనేటప్పుడే ఈ ముచ్చట చెప్పి, ఖాయం చేసుకుంటరట.

 

ఓ రోజు మా గురువు సోమ్​సాథ్​ భావోజీ ఉమ్మితే.. ఓ కోడి వచ్చి దాన్ని తిన్నదట. చెర్వుల మొఖం కడిగేటప్పుడు చేపలు కూడా అట్లనే తిన్నయట. దాంతోఈ ఊర్ల కోడిని, చేపలను ఎవ్వరూ తినొద్దని గురూజీ చెప్పిండట. అప్పటి నుంచి మా తాతముత్తాల కాడినుంచి ఎవ్వరం కూడా కోడి జోలికి పోతలేం. ఈ ఊర్ల మొత్తం తిరిగినా కోడి ఎంటిక కూడా కన్పియ్యది. కోడి వాసన కూడా మాకు పడది. ఎప్పుడన్న పెద్ద తాండకెళ్తె  కోడి కూర వండుతున్న వాసనొస్తే సాలు  కడుపులో తిప్పుతది. వాంతులైతై.

– లాలు నాయక్

 

తినద్దని మాకు శాపమున్నది. తింటే.. పాపం తల్గుతదని మా పెద్దోళ్లు చెప్పిన్రు. మూడు పిడీల్గ తింటలేమని మా తాత చెప్పెడోడు. అంటే మాది ఐదో పిడి. మా పిల్లలు గూడ తింటలేరు. ఆళ్లది ఆరో పిడి. ఆళ్ల పిల్లలు కూడా తినరు. ఉగాది.. ఉగాదికి తాండూర్ల ఉన్న మా దేవుడి దగ్గర్కు పోతం. తెల్వక మా పిల్లలెవరన్న తప్పుజేస్తె మాకు శాపం తల్గకుండ సూడుమని మొక్కుతం.

– గోపమ్మ

 

మా తాండల చిన్న పిల్లగాడి దగ్గర్నుంచి ముసలోళ్ల వరకు ఎవ్వరు కూడా కోడిగానీ.. గుడ్డుగానీ.. చేపలుగానీ.. తినరు. మా ఊరికి  కోడల్గ వచ్చేటోళ్లు కూడా తినకూడదు. వేరే ఊరికి పోయినప్పుడు మేం కూడా ముట్టం. ఇది ఎప్పట్నుంచో వస్తున్న ఆచారం. పెద్దల ఆచారాన్ని మేం కూడా పాటిస్తున్నం. హాస్టళ్ల ఉంటున్న పిల్లలు కూడా తింటలేరు. హాస్టళ్ల చేర్పించినప్పుడే చెప్తం. కోడి, గుడ్డు పెట్టద్దని.

– యాదగిరి

 

మాది అప్పరాల తాండ. సంబంధం మాట్లాడినప్పుడే చెప్పిండ్రు.. కోడి, గుడ్డు తినద్దని. ఆరేండ్ల నుంచి తింటలేను. పెండ్లికి ముందు తిన్న. ఇప్పుడు నాక్కూడ తినాలనిపిస్తలేదు. వాసనొస్తనే ఎట్లనో అనిపిస్తది.  అందుకే అమ్మగారింటికి పోయినప్పుడు కూడా తింటలేను.- చిట్టి

Latest Updates