పుట్టిన‌రోజు వేడుకలొద్దు.. పెళ్లి వాయిదా

హీరో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లుగా ప్రకటించాడు. అంతేకాదు మార్చి 30న తన బర్త్‌డే సందర్భంగా అభిమానులెవరు వేడుకలు నిర్వహించవద్దని సూచిస్తూ ఆయన ఓ లెటర్‌ను విడుదల చేశాడు.

‘‘నా అభిమానుల‌కు, తెలుగు ప్ర‌జ‌ల‌కు న‌మ‌స్కారం. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాలతో స‌హా దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డివున్నాయో మీకు తెలుసు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో త‌ప్ప ఎవ‌రూ బ‌య‌ట‌కు రాకూడ‌దని, లాక్‌డౌన్ కాలంలో మార్చి 30వ తేదీ నా పుట్టిన‌రోజును జ‌రుపుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాను. అందువ‌ల్ల ఎక్క‌డా కూడా నా పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రుప‌వ‌ద్ద‌ని మిమ్మ‌ల్ని ప్రార్థిస్తున్నాను. అంతే కాదు, లాక్‌డౌన్ క్ర‌మంలో  ఏప్రిల్ 16వ తేదీ జ‌ర‌గాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మ‌నమంద‌రం క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి క‌లిసిక‌ట్టుగా పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ సంక్షోభ స‌మ‌యంలో మ‌న ఇళ్ల‌ల్లో మ‌నం కాలు మీద కాలేసుకొని కూర్చొని, మ‌న కుటుంబంతో గ‌డుపుతూ బ‌య‌ట‌కు రాకుండా ఉండ‌ట‌మే దేశానికి సేవ చేసిన‌ట్లు. ఎల్ల‌వేళ‌లా మీ అభిమానంతో పాటు మీ ఆరోగ్యాన్నీ ఆశించే మీ.. నితిన్‌’ అని నితిన్ తన లెటర్‌లో తెలిపాడు.

కరోనా వైరస్ మహమ్మారిగా మారి ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ అంతా లాక్‌డౌన్ అయి ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజలు గుమిగూడదని, ఎటువంటి వేడుకలు ఉన్నా వాయిదా వేసుకోమని ప్రభుత్వాలు ప్రకటిస్తున్న క్ర‌మంలో నితిన్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం స‌రైన‌దంటున్నారు అత‌ని ఫ్యాన్స్.

Latest Updates