పార్లమెంటు సెక్యూరిటీ హై అలర్ట్.. దూసుకొచ్చిన కారు

న్యూఢిల్లీ: ఈ ఉదయం పార్లమెంట్ సెక్యూరిటీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మొత్తం సిబ్బంది అంతా క్షణాల్లో అలర్ట్ అయ్యారు. పరుగు పరుగున ఓ కారును చుట్టుముట్టారు.

భద్రతా సిబ్బందిని ఇంత టెన్షన్ పెట్టిన ఆ కారు మణిపూర్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ తోక్ చోమ్ మైన్యాది. పార్లమెంటు గేటు వద్ద బారికేడ్లపైకి ఉన్నట్టుండి కారు దూసుకొచ్చింది. ఒక్క క్షణం సెక్యూరిటీ సిబ్బందికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. గేటు వద్ద ఉన్న స్పైక్స్ గుచ్చుకుని కారు ఆగిపోయింది. దాని దగ్గరకు వెళ్లి పరిశీలించగా.. అది ఎంపీ కారని తెలిసింది. అయితే ఆ సమయంలో అందులో ఎంపీ లేరు. కారు ఇలా దూసుకుని రావడానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అటాక్ అనుకున్న సెక్యూరిటీ

కారు ఇలా దూసుకుని పార్లమెంట్ బారికేడ్ల పైకి దూసుకురావడంతో సెక్యూరిటీ సిబ్బంది క్షణాల్లో అప్రమత్తమయ్యారు. వారికి 2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడి గుర్తొచ్చింది. ఇప్పుడు కూడా ఏదైనా అటాక్ కావచ్చేమో అనుకుని దాడిని తిప్పి కొట్టేందుకు కొందరు పొజిషన్ తీసుకున్నారు. పోలీసుల ఉలికిపాటు చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్లు కూడా ఆందోళనకు గురయ్యారు. అయితే అది ఎంపీ కారు అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. 2018లోనూ ఇలా ఓ కారు పార్లమెంటు గేటును ఢీకొట్టడంతో పోలీసులు టెన్షన్ అయ్యారు.

2001 డిసెంబరు 13న ఐదుగురు టెర్రరిస్టులు పార్లమెంటుపై దాడి చేశారు. ఆ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏకే-47 గన్స్, గ్రనేడ్లతో వచ్చి ఒక్కసారిగా కాల్పులకు దిగారు. అప్పటి వరకు ఇటువంటి దాడులకు ఊహించని పార్లమెంటు సెక్యూరిటీ వద్ద పెద్దగా అడ్వాన్స్డ్ వెపన్స్ లేవు. ఉన్న ఆయుధాలతోనే రంగంలోకి దిగిన పోలీసులు ఉగ్రవాదులను అడ్డుకున్నారు. ప్రాణాలకు తెగించి 20 నిమిషాల పాటు పోరాడారు. నలుగురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. మరో టెర్రరిస్ట్ పార్లమెంటు మెట్ల వద్ద తనను తాను పేల్చుకుని చనిపోయాడు.

ఈ ఘటన తర్వాత పార్లమెంటు సెక్యూరిటీ హై అలర్ట్ అయింది. వారికి అడ్వాన్స్డ్ వెపన్స్ అందించారు.

Latest Updates