కరోనా కంట్రోల్​కు దేశంలో హై అలర్ట్​

కరోనా కంట్రోల్​కు దేశంలో హై అలర్ట్​
అత్యవసర జాగ్రత్తలు చేపట్టాలంటూ కేంద్రం అడ్వైజరీ
అందాల తాజ్ మహల్​ కూడా బంద్​
దేశంలో మిగతా టూరిస్ట్​ ప్రదేశాలు సైతం మూసివేత
18 వ తేదీ నుంచి..యూరప్​ విమానాలకు మన దేశంలో నో ఎంట్రీ
దుబాయ్​, ఖతార్​, ఒమన్​, కువైట్​ నుంచి వచ్చే
ప్యాసింజర్లకు కూడా 14 రోజులు క్వారంటైన్​

న్యూఢిల్లీ: కరోనా వైరస్​ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హైఅలర్ట్​ ప్రకటించింది. పలు దేశాల నుంచి విమానాల రాకపోకలను పూర్తిగా నిషేధించింది. మరో 14 దేశాల నుంచి వచ్చే వారిని రెండు వారాల పాటు క్వారంటైన్​ చేయాలని నిర్ణయించింది. వారికి కరోనా లక్షణాలు ఉన్నా, లేకున్నా కూడా నేరుగా ఎయిర్​పోర్టు నుంచే క్వారంటైన్​ సెంటర్లకు తరలించాలని అధికారులకు సూచించింది. ఇక దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు సహా విద్యాసంస్థలన్నీ మూసివేయాలని సూచించింది. వీలైతే పరీక్షలను కూడా వాయిదా వేయాలని పేర్కొంది. జనం ప్రయాణాలు చేయడం మానుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని హెచ్చరించింది. వైరస్​ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర చర్యలు అవసరమంటూ కేంద్ర ఆరోగ్య శాఖ పలు ప్రతిపాదనలు చేసింది. కరోనా మహమ్మారిపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల గ్రూప్​ ఆ ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది.

రెండో దశకు రావడంతో..

ఇండియాలో ప్రస్తుతం విదేశాలకు వెళ్లి వచ్చినవారికే కరోనా వైరస్​ సోకింది. ఒకరి నుంచి మరొకరికి సోకే రెండో దశ ఇప్పుడిప్పుడే మొదలైంది. అయితే వైరస్​ నియంత్రణ కోసం కేంద్రం ముందు జాగ్రత్తల్లో భాగంగా పలు చర్యలు చేపట్టింది. కొన్ని దేశాల నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్​ టెస్టులు, క్వారంటైన్​ చేయడం, బాధితులకు ట్రీట్​మెంట్, పరీక్షలకు ల్యాబ్​ల​ ఏర్పాట్లు వంటివి చేపట్టింది. అయినా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర వైద్యారోగ్య శాఖ పలు ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్​ ఆధ్వర్యంలోని కేంద్ర మంత్రుల గ్రూప్​ సోమవారం సమావేశంలో చర్చించింది. ఈ సందర్భంగా వైరస్​వ్యాప్తి నివారణ కోసం ఆరోగ్య శాఖ ప్రతిపాదించిన ‘సోషల్​ డిస్టెన్సింగ్​ మెజర్స్’ను మంత్రుల గ్రూప్​ ఆమోదించింది. కేంద్ర మంత్రులతోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు, పారామిలటరీ దళాల చీఫ్​లు ఈ భేటీలో పాల్గొన్నారు. కేంద్ర హెల్త్​ డిపార్ట్​మెంట్​ జాయింట్​ సెక్రెటరీ లవ్​ అగర్వాల్​ ఈ వివరాలను వెల్లడించారు.

ఆ దేశాల నుంచి విమానాలు బంద్..

యూరోపియన్​ యూనియన్, బ్రిటన్, టర్కీ తదితర దేశాల నుంచి ఇండియాకు విమానాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. 18వ తేదీ నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఆయా దేశాల్లో ఉంటున్న ఇండియన్లు కూడా ఇక్కడికి వచ్చేందుకు కుదరదు. ఇక 14 దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్లను కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్​లో ఉంచాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. యూఏఈ, ఖతార్, ఒమన్, కువైట్, చైనా, ఇటలీ, ఇరాన్​, కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, బ్రిటన్ తోపాటు మరో రెండు దేశాల నుంచి వచ్చే వారిని ఎయిర్​పోర్టుల నుంచే నేరుగా క్వారంటైన్​ సెంటర్లకు తరలించాలని, ఈ నెల 18వ తేదీ నుంచే అమలు చేయాలని పేర్కొంది.

స్కూళ్లు, కాలేజీలు మూసేయండి

కరోనా వైరస్​ కేసులు పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా పలు చర్యలు చేపట్టాలని కేంద్రం సూచనలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ అడ్వైజరీని జారీ చేసింది. దేశవ్యాప్తంగా జనం ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలను ఈ నెల 31వ తేదీ వరకు మూసివేయాలని సూచించింది. అప్పటికి పరిస్థితిని మరోసారి సమీక్షిస్తామని, అవసరమైతే మూసివేతను పొడిగించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర వ్యక్తుల నుంచి దూరంగా ఉండటం మేలని సూచించింది. అందులో భాగంగా పలు సూచనలు చేస్తున్నట్టు తెలిపింది.

కేంద్రం చేసిన సూచనలివీ..

దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు సహా అన్ని విద్యా సంస్థలు, జిమ్​లు, కల్చరల్, సోషల్​ సెంటర్లు, స్విమ్మింగ్​పూల్స్, సినిమా థియేటర్లను ఈ నెల 31 వరకు మూసివేయాలి. స్టూడెంట్లకు పరీక్షలు వాయిదా వేయాలి. ఇప్పటికే మొదలైన పరీక్షలను కొనసాగించినా స్టూడెంట్ల మధ్య కనీసం ఒక మీటరు కన్నా ఎక్కువ దూరం ఉండేలా కూర్చోబెట్టాలి. స్టూడెంట్లు కూడా ఇండ్లలోనే ఉండాలి, వీలైనంత వరకు ఆన్​లైన్​ ఎడ్యుకేషన్​ అందేలా చూడాలి. ప్రైవేటు సెక్టర్​ కంపెనీలు, సంస్థలు వీలైనంత మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేలా (వర్క్​ ఫ్రం హోమ్) అవకాశం కల్పించాలి. మీటింగ్​ల వంటి వాటిని వీడియో కాన్ఫరెన్సుల ద్వారా నిర్వహించుకోవాలి.

అందాల తాజ్ మహల్​ కూడా బంద్​

తాజ్​మహల్ సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ టూరిస్టు ప్లేసులు, మ్యూజియంలను మూసివేయాలి. ప్రజలు అత్యవసరం కాని ప్రయాణాలన్నింటినీ మానుకోవాలి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు జాగ్రత్త వహించాలి. అధికారులు బస్సులు, ట్రెయిన్లు, విమానాలను ప్రతి ప్రయాణం తర్వాత డిసిన్​ఫెక్షన్​ చేయాలి. పెద్ద సంఖ్యలో జనం వచ్చే కార్యక్రమాలు, సభలు, సమావేశాలు, మీటింగ్​లను వాయిదా వేసుకోవడం గానీ, రద్దు చేసుకోవడం గానీ చేయాలి. అత్యవసరమైతే మాత్రం అతి తక్కువ మందితోనే కార్యక్రమాలు నిర్వహించుకోవాలి.

రెస్టారెంట్లలో కచ్చితంగా హ్యాండ్​ వాషింగ్​ ప్రొటోకాల్​ పాటించాలి. అందరూ తాకే డోర్లు, టేబుళ్లు, ఇతర ప్రాంతాలను తరచూ శుభ్రం చేయాలి. సిబ్బంది, కస్టమర్లు చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. టేబుళ్ల మధ్య కనీసం ఒక మీటరు దూరం ఉండాలి. వీలైనంత వరకు ఓపెన్​ ఎయిర్​ సీటింగ్​ ఏర్పాటు చేయాలి. పట్టణాల్లో జనం గుమిగూడే స్పోర్ట్స్​ ఈవెంట్లు, ఇతర కాంపిటీషన్లను వాయిదా వేసేలా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలి. జనం గుమిగూడే మత పరమైన, ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలను చేపట్టకుండా ఒపీనియన్​ లీడర్లు, రెలీజియస్​ లీడర్లతో మాట్లాడాలి. స్థానిక అధికారులు ఆయా పట్టణాలు, నగరాల్లోని వ్యాపారుల అసోసియేషన్లు, ఇతరులతో సమావేశమై.. పనివేళలు, జాగ్రత్తలపై సూచనలు చేయాలి. మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పోస్టాఫీసులు, బ్యాంకులు తదితర ప్రాంతాల్లో కరోనాకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. జనానికి అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి.

డ్రంకెన్​ డ్రైవ్​ కాదు.. కరోనా డ్రైవ్​​

కరోనా వైరస్​ను నిలువరించే ప్రయత్నాల్లో భాగంగా మనీలాలో పోలీసులు ఇలా రోడ్డు మీదే స్క్రీనింగ్​ చేస్తున్నారు. ఫిలిప్పీన్స్​లోని క్వెంజన్​ సిటీ శివార్లలో చెక్​పాయింట్​ ఏర్పాటు చేశారు. వెహికల్స్ తో పాటు కాలినడకన వెళ్లే వాళ్లనూ ఆపి, టెంపరేచర్​ చెక్​చేసి అనుమానితులను పరీక్షలకు, మిగతావారిని ఇంటికి పంపించారు.

Latest Updates