హైకోర్టు భవనానికి వందేళ్లు

తెలంగాణ హైకోర్టు భవనానికి వందేళ్లు పూర్తి అవుతున్నాయి. రేపటి (శనివారం,ఏప్రిల్-20)తో.. హైకోర్ట్ భవనం వందో వసంతంలోకి అడుగుపెట్టనుంది. దీంతో.. హైకోర్టు శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి హాజరుకానున్నారు. వందేళ్ల ఉత్సవాల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్  చౌహాన్.

మూసీనది ఒడ్డున 1920 ఏప్రిల్ 20న హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్  ఆలీఖాన్… 1915లో హైకోర్టు భవన నిర్మాణాన్ని ప్రారంభించి.. 1920 ఏప్రిల్ 20కి పూర్తి చేశారు. జైపూర్ కు చెందిన ఇంజినీర్, ఆర్కిటెక్ట్ శంకర్ లాల్ హైకోర్టు నమూనాను తయారు చేశారు. హైదరాబాద్ కు చెందిన ఇంజినీర్ మెహర్  అలీ ఫజల్ నిర్వహణ బాధ్యతలు చూశారు. మొత్తం 18 లక్షల 22 వేల అంచనా వ్యయంతో హైకోర్టు భవన నిర్మాణ కాంట్రాక్ట్ ను నవరతన్ దాస్ దక్కించుకుని… ఇండో ఇస్లామిక్ సాంప్రదాయ రీతిలో హైకోర్టు భవనాన్ని నిర్మించారు.

నిజాం కాలంలో రాయల్ చార్టర్ కింద కొనసాగిన న్యాయస్థానంలో.. 1928లో హైకోర్టు యాక్ట్ కింద బెంచ్ లు ఏర్పాటు చేసి కేసుల విచారణ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ విలీనం తర్వాత హైకోర్టు ఆఫ్ హైదరాబాద్ పేరుతో కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా అవతరించింది. 1956 నవంబర్ 5న 11 మంది న్యాయమూర్తులతో ఉమ్మడి హైకోర్టు ప్రారంభమైంది. హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కోకా సుబ్బారావు పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా నాలుగున్నరేళ్లు ఉమ్మడి హైకోర్ట్ గా కొనసాగింది. 2019 జనవరి 1న రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు కావడంతో.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న హైకోర్ట్ భవనం.. తెలంగాణ హైకోర్టుగా కొనసాగుతోంది.

రాష్ట్ర హైకోర్టు భవనానికి వందేళ్లు పూర్తి కావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. తెలంగాణ న్యాయవాదులు. రాష్ట్రానికి చెందిన అరుదైన భవనాల్లో హైకోర్టు ఒకటంటున్నారు. శతాబ్ది ఘనంగా జరపాలని కోరుతున్నారు.

వందేళ్లు పూర్తవుతున్నా… ఇంకా చెక్కు చెదరకుండా ఉంది హైకోర్ట్ భవన సముదాయం. నిజాం కాలంలో అద్భుత భవనాన్ని నిర్మించారంటున్నారు లాయర్లు.

Latest Updates