బయోడైవర్సిటీ ప్రమాదంపై హైకోర్టు కీలక ఆదేశాలు

గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ప్లైఓవర్‌ కారు ప్రమాదం కేసులో రాయదుర్గం పోలీసులకు మరోసారి ఎదురు దెబ్బతగిలింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణ మిలన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ(గురువారం) హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. నిందితుడి తరపు న్యాయవాది రోడ్డు ప్రమాదంపై హైకోర్టుకు వివరణ ఇచ్చారు. ప్రమాదకర మలుపు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, అంతేకాకుండా ఇంతకుముందు కూడా ఈ ఫ్లైఓవర్‌పై ఇద్దరు మృతి చెందారని, ఈ ప్రమాదాలకు కారణం వంతెన మలుపేనని ఆయన స్పష్టం చేశారు. దీంతో కృష్ణ మిలన్‌రావును జనవరి 3వ తేదీ వరకు అరెస్ట్‌ చేయొద్దని  కోర్టు పోలీసులను ఆదేశించింది. కారు యాక్సిడెంట్‌ చేసిన వ్యక్తిపై 304(2) సెక్షన్‌ ఎలా పెడతారని పోలీసులను ప్రశ్నించింది. తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు అతన్ని అరెస్ట్‌ చేయడానికి వీలులేదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే కృష్ణ మిలన్‌రావు నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిందితుడు అధిక వేగంతో దూసుకెళ్లినందునే ఈ ప్రమాదం జరిగినట్లు ఆధారాలు సేకరించామన్నారు. అంతకుముందు నిందితుడిని డిసెంబర్‌ 12వ తేదీ వరకు అరెస్ట్‌ చేయరాదని కోర్టు స్టే ఇచ్చింది.

Latest Updates