హైకోర్టు ఆర్డర్లు ఉంటే..ఎలా ఖాళీ చేయిస్తారు?

  • అనంతగిరి రిజర్వాయర్ నిర్వాసితుల పిటిషన్‌పై విచారణ
  • రిపోర్ట్‌ ఇవ్వాలని సిద్దిపేట కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కొచ్చగుట్ట గ్రామాన్ని ఎందుకు ఖాళీ చేయించారో తెలియజేయాలని ఆ జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. అర్ధరాత్రి టైమ్‌లో ఇండ్లను ఖాళీ చేయించడంపై పూర్తి వివరాలు అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆర్డర్‌ ఉన్నా అర్ధంతరంగా ఖాళీ చేయించడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అంశంగా కామెంట్‌ చేసింది. ఆఫీసర్ల చర్య వల్ల నిరాశ్రయులైన వారికి తగిన సౌలత్‌లు కల్పించాలని చీఫ్ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం ఆదేశాలిచ్చింది. ముంపునకు గురయ్యే గ్రామాలకు చట్ట ప్రకారం పునరావాసం, పునర్‌ నిర్మాణ చర్యలు అమలు చేసే వరకూ రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేయొద్దని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ 19వ తేదీ అర్ధరాత్రి టైమ్‌లో 400 మంది ఒక్కసారిగా వచ్చి తమ ఇళ్లను కూల్చేశారంటూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కొచ్చగుట్ట గ్రామానికి చెందిన ఈ.టి.రెడ్డి, మంగవ్వ మరో 37 మంది దాఖలు చేసిన మెమోను హైకోర్టు మంగళవారం విచారించింది. మెమో కాపీ అందలేదని ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పడంపై హైకోర్టు స్పందిస్తూ, సమస్యను జఠిలం చేయవద్దని హితవు చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

Latest Updates