ప్రైవేట్​కు పర్మిషన్ ఇవ్వండి..కరోనా టెస్టులపై రాష్ట్ర సర్కార్ కు హైకోర్టు ఆదేశం

  • తమకు నచ్చిన చోట టెస్ట్​లు, ట్రీట్​మెంట్​ చేసుకునే హక్కు ప్రజలకుంది
  • ప్రైవేటు మీద నమ్మకం లేకుంటే ఆరోగ్యశ్రీ ఎట్లా ఇస్తున్నరు
  • ఐసీఎంఆర్​ గైడ్​లైన్స్​ ప్రకారం వ్యవహరించాలన్న కోర్టు

హైదరాబాద్, వెలుగుకేవలం గాంధీ, నిమ్స్‌‌ హాస్పిటళ్లలోనే కరోనా టెస్టులు చేయడం సరికాదని.. ప్రభుత్వం చెప్పినచోటే టెస్టులు, ట్రీట్​మెంట్​అంటే స్వేచ్ఛా హక్కును హరించడమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేటు హాస్పిటళ్ల మీద నమ్మకం లేకపోతే ఆరోగ్యశ్రీలో సేవలకు ఎలా అనుమతి ఇచ్చారని నిలదీసింది. ప్రైవేట్‌‌ హాస్పిటళ్లు, ల్యాబ్స్‌‌లో కరోనా టెస్టులు, ట్రీట్​మెంట్​కు పర్మిషన్​ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఐసీఎంఆర్‌‌  గైడ్​లైన్స్​కు అనుగుణంగా వాటిని ఎంపిక చేయాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్‌‌ ఎమ్మెస్‌‌ రామచందర్‌‌రావు, జస్టిస్‌‌  కె.లక్ష్మణ్‌‌లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం 38 పేజీల తీర్పు వెలువరించింది.

నచ్చిన చోట ట్రీట్ మెంట్​ చేయించుకోవచ్చు

రాష్ట్రంలోని ప్రైవేటు హాస్పిటళ్లలో కరోనా టెస్టులు, ట్రీట్​మెంట్​చేయరాదంటూ సర్కారు ఆదేశించడం సరికాదని.. ఐసీఎంఆర్‌‌ అనుమతులున్న హాస్పిటళ్లకు పర్మిషన్​ ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌‌కు చెందిన గంటా జయకుమార్‌‌  హైకోర్టులో పిల్​ వేశారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా ట్రీట్​మెంట్ కూడా ఇవ్వొచ్చని మార్చి 21న హైదరాబాద్​ డీఎంహెచ్ వో అనుమతి ఇచ్చారని.. కానీ ఈ నెల 11న అన్ని ట్రీట్​మెంట్లను ఆపేసి, కరోనా ట్రీట్​మెంట్​ మాత్రమే చేయాలని ఆదేశించారని కోర్టుకు వివరించారు. మళ్లీ ఇదే రోజున కరోనా ట్రీట్​మెంట్​ చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. డబ్బులున్న వాళ్లు ప్రైవేట్‌ హాస్పిటళ్లలో ట్రీట్​మెంట్​చేయించుకుంటే తప్పేం ఉందని సర్కారును ప్రశ్నించింది. తమకు నచ్చిన చోట, ఇష్టమైన చోట ట్రీట్​మెంట్​ చేయించుకునే హక్కు పౌరులకు ఉందని స్పష్టం చేసింది. ‘‘ప్రభుత్వ హాస్పిటళ్లలోనే ట్రీట్​మెంట్​ చేయించుకోవాలనడం రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు కూడా విరుద్ధం. జీవించే హక్కు, ఆరోగ్యం రెండూ కూడా ప్రాథమిక హక్కులే అవుతాయి. ప్రైవేట్‌  హాస్పిటళ్లలో కరోనా టెస్టులు, ట్రీట్​మెంట్  చేయరాదని చెప్పడానికి ప్రభుత్వం సరైన కారణాలు చూపలేకపోయింది.

కరోనా టెస్టులు, ట్రీట్​మెంట్, ఐసోలేషన్‌ సర్కారీ ఆస్పత్రుల్లోనే చేయించుకోవాలనడం చెల్లదు. ఖర్చు చేసుకునే స్తోమత ఉన్నవాళ్లకు ప్రైవేటు హాస్పిటళ్లలో ట్రీట్​మెంట్​ చేయించుకునే హక్కుంది. ఐసీఎంఆర్‌ నిబంధనలకు అనుగుణంగా ప్రైవేటు హాస్పిటళ్లు, ల్యాబ్​లకు అనుమతి ఇవ్వాలి. వాటి పనితీరును పర్యవేక్షించాలి. ఇందుకోసం గైడ్‌లైన్స్‌ జారీ చేయాలి. కేంద్ర, రాష్ట్ర, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు అమలు జరిగేలా చూడాలి. ట్రీట్​మెంట్​ చేయించుకునే వారి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. కరోనాను అంతం చేయాలంటే ప్రభుత్వ వైద్య సేవలతోపాటు ప్రైవేట్‌ హాస్పిటళ్ల సహకారం కూడా అవసరమనే విషయాన్ని మర్చిపోకూడదు’’ అని బెంచ్​ పేర్కొంది. సర్కార్‌ నియంత్రణ పరిమితంగా, హేతుబద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. ప్రైవేట్‌ హాస్పిటళ్లు, ల్యాబ్స్‌పై ప్రభుత్వానికి నమ్మకం లేకపోతే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదల వైద్య సేవలకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించింది. కరోనా ట్రీట్​మెంట్​ కోసం ప్రైవేటు హాస్పిటళ్లు, ల్యాబ్​లు ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేసుకోవాలని, అక్కడి నుంచి ఆమోదం వచ్చిన వాటికి సర్కారు పర్మిషన్లు ఇవ్వాలని స్పష్టం చేసింది.

50 లక్షలు దాటిన కరోనా కేసులు

Latest Updates