అమరావతిలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ విధింపుపై హైకోర్టు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నాలుగు వారాలుగా ప్రతీ రోజు అక్కడ ఆందోళనలు చేపడుతున్నారు. రాజధాని తరలింపుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కోసం తాము భూములిచ్చి త్యాగం చేస్తే …అది వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమపై పోలీసులు దాడులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు రాజధాని రైతులు, మహిళలు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్లు దాఖలు చేశారు.

రైతులు దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన హై కోర్టు తాజా పరిస్థితులపై స్పందించింది. అమరావతిలో పలు ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 చట్టం విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధానిలో పోలీసు చట్టాలు అమలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజధానిలో పరిస్థితులకు సంబంధించి పిటిషనర్లు ఇచ్చిన విజువల్స్ ను జడ్జి పరిశీలించారు. వచ్చే సోమవారం (జనవరి -20) వరకు విచారణ వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కోరారు. అయినా అందుకు నిరాకరించిన జడ్జి పూర్తి వివరాలతో శుక్రవారం ( జనవరి-17) ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

Latest Updates