చట్టం మీ చుట్టం అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్

ప్లాన్ డీవియేట్ అయిన ఇండ్ల కూల్చివేత కేసులో విచారణ
నోటీసు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించిన బెంచ్

హైదరాబాద్‌‌, వెలుగు: నోటీసు ఇవ్వకుండా ప్లాన్ డీవియేట్ అయిన ఇండ్లను కూల్చివేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్లకు కట్టబెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 178 (2) ప్రకారం  ప్లాన్ డీవియేట్ అయి కట్టిన ఇండ్లను కూల్చివేసే అధికారాన్ని మున్సిపల్ కమిషనర్లకు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ పై సోమవారం చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డిలతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. “చట్టం మీ చుట్టం అనుకుంటున్నారా? అధికారంలో ఉన్నామని చెప్పి ఇష్టానుసార నిర్ణయాలు తీసుకుంటారా? చట్టాలు కూడా రాజ్యాంగానికి లోబడే ఉండాలని తెలియదా? అప్రూవల్ చేసుకున్న ప్లాన్‌‌కు అటూ ఇటూ మార్చి ఇండ్లు కట్టేస్తే నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చేస్తారా? మున్సిపల్‌‌ యాక్ట్‌‌లోని సెక్షన్‌‌ 178 (2)ను విడిగా చూసి చట్టాన్ని అమలు చేస్తే ఎలా? ఉరి,యావజ్జీవ శిక్షల కేసుల్లో సైతం నిందితుల వాదనలు వినడం జరుగుతోందని అధికారులు మర్చిపోతున్నారా? అక్రమ నిర్మాణదారుడికి నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చుడు నిర్ణయం ఏమిటి” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

పొక్లెయిన్ తెచ్చి ఇల్లు కూల్చేస్తామంటే ఎలా?

మున్సిపల్ యాక్ట్ లోని సెక్షన్‌‌ 178(2), సెక్షన్‌‌ 174(4)లను విడివిడిగా అమలు చేయరాదని, రెండింటినీ కలిపి చట్టాన్ని అన్వయించి అమలు చేయాలని బెంచ్‌‌ పేర్కొంది. అక్రమ నిర్మాణాలపై గతంలో హైకోర్టు మండిపడిన వైనాన్ని అడ్వకేట్ జనరల్ బీఎస్‌‌ ప్రసాద్‌‌ గుర్తు చేయగా.. డివిజన్‌‌ బెంచ్‌‌ కల్పించుకుని రోడ్ల పక్కన, కాలువల పక్కన అక్రమంగా నిర్మించిన ఇళ్లకు కూడా నోటీసులు ఇచ్చాకే తొలగించాలని సుప్రీంకోర్టు రూలింగ్‌‌ ఇచ్చినట్లు చెప్పింది. పర్మిషన్‌‌ పొందిన ప్లాన్‌‌ డీవియేట్‌‌ అయినప్పుడు కూల్చితే తప్పులేదని ప్రభుత్వ లాయర్ వాదించారు. దీనిపై బెంచ్‌‌ స్పందిస్తూ.. కమిషనర్‌‌కు తెలియకుండా టౌన్‌‌ప్లానింగ్‌‌ ఆఫీసర్‌‌ మార్పులతో నిర్మాణానికి పర్మిషన్‌‌ ఇచ్చి ఉంటే కూల్చివేతకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. నోటీసు ఇవ్వకుండా ఇళ్ల ముందు పొక్లెయిన్, బుల్డోజర్లు తెచ్చిఇప్పుడే కూల్చేస్తామంటే.. ఆ ఇల్లు కట్టుకున్నవాడి మానసిక, ఆర్థిక పరిస్థితి ఏం కావాలని బెంచ్‌‌ నిలదీసింది. విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.

For More News..

ఆంధ్రాలో తెలంగాణ లిక్కర్.. కోట్లు దండుకుంటున్న బోర్డర్ వైన్ షాపులు

సోషల్‌‌ మీడియాకు మోడీ గుడ్‌‌బై!

Latest Updates