డెంగీతో జనం చస్తున్నా పట్టించుకోరా?

  • సర్కారుపై హైకోర్టు మండిపాటు
  • ఓ మహిళా జడ్జి కూడా చనిపోయారు
  • ఎన్నిసార్లు చెప్పినా వినరా..పరిస్థితి విషమిస్తే ఏమీ చేయలేం
  • ఓ పెద్దాఫీసర్​ ఇంట్లో అలాంటి విషాదం జరిగితేనే కదలిక వస్తదా?
  • హైకోర్టు కళ్లు మూసుకుంటదని అనుకోవద్దు
  • సీఎస్, హెల్త్​ ఉన్నతాధికారులు  కోర్టుకు రావాలి, వివరణ ఇవ్వాలి

రాష్ట్రంలో జనం డెంగీ బారినపడి చనిపోతున్నా పట్టించుకోరా? ఓ మహిళా జడ్జి కూడా డెంగీతో మరణించారు. అధికారుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పరిస్థితి విషమిస్తే ఎట్లా? ఓ ఉన్నతాధికారి ఇంట్లో ఇలాంటి విషాద ఘటన జరిగితేనే కదలిక వస్తుందా?

– హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: పరిస్థితి మన చేతిలో ఉన్నప్పుడే ఏదైనా చేయొచ్చని, మీనమేషాలు లెక్కిస్తుంటే బతుకులు తెల్లారిపోతుంటాయని.. ప్రభుత్వ సీఎస్, మెడికల్‌‌ అండ్‌‌ హెల్త్‌‌ ప్రిన్సిపల్‌‌ సెక్రెటరీ, డైరెక్టర్, ఎపిడమికల్‌‌ సెల్‌‌ జాయింట్‌‌ డైరెక్టర్, అంటు రోగాల నివారణ సంస్థ డైరెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌‌లు గురువారం స్వయంగా కోర్టుకు వచ్చి సంజాయిషీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

స్వైన్‌ఫ్లూ, డెంగీ, మలేరియా వంటి జ్వరాలతో జనం బాధపడుతున్నారని, వారికి వైద్యం అందించేలా సర్కారును ఆదేశించేలా డాక్టర్​ ఎం.కరుణ, లాయర్‌  చిక్కుడు ప్రభాకర్‌  వేర్వేరుగా పిల్స్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు చీఫ్​ జస్టిస్‌ ఆర్ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిలతో కూడిన బెంచ్​ బుధవారం మరోసారి విచారణ జరిపింది. డెంగీతో వేలాది మంది బాధపడుతుంటే ఏం చేస్తున్నారని సర్కారును ప్రశ్నించింది. తగిన చర్యలు తీసుకోవాలంటూ ఎన్నోసార్లు సలహాలు, సూచనలు ఇచ్చినా సర్కారు చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆక్షేపించింది. డెంగీతో చాలా మంది మరణించారని ప్రభుత్వ నివేదికలు, పత్రికల్లో వార్తలు చెప్తున్నాయని పేర్కొంది. హైకోర్టు పట్టించుకోదని, కళ్లుమూసుకుంటుందన్న ఊహల్లో ఉండొద్దని హెచ్చరించింది. కళ్లెదుట విష జ్వరాలు ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఎలా ఉంటామని పేర్కొంది. పరిస్థితి కార్చిచ్చులా మారేలా ఉదాసీనత వద్దని, చేతులు కాలాక ఏం చేసినా లాభం ఉండదని స్పష్టం చేసింది.

ప్లేగులా విజృంభిస్తే ఎట్లా?

బెంచ్​ అడిగిన ప్రశ్నలపై సర్కారు తరఫున అడ్వొకేట్‌  జనరల్‌  బీఎస్‌  ప్రసాద్‌  వివరణ ఇచ్చారు. రోగాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బోర్డులు పెట్టి ప్రచారం చేస్తున్నామన్నారు. గతంలో హైకోర్టు చెప్పినట్టు డ్రోన్ల ద్వారా రసాయనాలు చల్లుతున్నామని వివరించారు. దోమల కౌంటింగ్‌  మిషన్ల ద్వారా పరిశీలించామని, దోమల తీవ్రత తగ్గిందని తెలిపారు. డెంగ్యూ కేసుల సంఖ్య కూడా 1,808 నుంచి 1,302కు తగ్గిందన్నారు. ఈ వివరణపై డివిజన్‌ బెంచ్‌  ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘యూరప్‌లో 1300 సంవత్సరంలో ప్లేగు విజృంభించి లక్షలాది మందిని బలితీసుకుంది. ఇద్దరు పోప్‌లు చనిపోయారు. అలాంటివి విజృంభిస్తే ఎవరూ ఏమీ చేయలేరని ఆ ఘటన హెచ్చరిస్తోంది. ప్లేగు తరహాలో ఇక్కడ జరిగితే ఏం చేస్తారు?” అని బెంచ్​ నిలదీసింది. శుక్రవారం దోమల డ్రై డే నిర్వహించడం ఏమిటని, గాంధీ జయంతిరోజున మద్యం అమ్మొద్దన్నట్టుగా ఈ డ్రై డే ఏమిటని ప్రశ్నించింది.

బోర్డులు ఎక్కడ పెట్టిండ్రు?

జనంలో అవగాహన కల్పించేలా బోర్డులు పెట్టామని ఏజీ చెప్పారని, కానీ తమకు హైదరాబాద్‌లో ఎక్కడా బోర్డులు కనబడలేదని పేర్కొంది. ‘‘చిన్న బోర్డులు కాదు పెద్ద బోర్డులు పెట్టి చూడగానే అర్థమయ్యేలా చేయాలి. పలుసార్లు చెప్పాం. అయినా అధికారుల్లో చలనం లేదు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ జడ్జి డెంగీతో చనిపోయారు. ఇదే పరిస్థితి ఒక ఉన్నతాధికారి ఇంట్లో ఎదురైతేనే చలనం వస్తుందా?  (ఈమాట అనకూడదు.. కానీ అనాల్సి వస్తోంది.). కదలండి. అన్ని శాఖలు కలిసికట్టుగా చర్యలు తీసుకోండి. పరిస్థితి మన చేతుల నుంచి జారిపోతే ఎవరూ ఏం చేయలేరు. అధికారుల అఫిడవిట్లు అన్యమనస్కంగా కనిపిస్తున్నాయి. డెంగీని కంట్రోల్​ చేసే చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి..” అని స్పష్టం చేసింది. అంటు వ్యాధుల నివారణకు ఒక సంస్థ ఉందని, అదేం చేస్తోందని, ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. జనానికి బతికే హక్కును రాజ్యాంగం ఇచ్చిందని, వారి ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ విధి అని స్పష్టం చేసింది. సీఎస్, ఇతర అధికారులు హాజరుకావాలని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.

Latest Updates