ఇంటర్ ఫలితాల వివాదంపై హైకోర్టు ఆగ్రహం

తెలంగాణలో ఇంటర్‌ పరీక్ష ఫలితాల వివాదంపై బాలల హక్కుల సంఘం వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఫలితాలలో అవకతవకలు, గందరగోళంఫై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు  ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను రీ వాల్యూయేషన్ చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది. దీనికి ఎంత సమయం పడుతుందని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ని ప్రశ్నించింది. సుమారు 2 నెలలు పడుతుందన్న ఆయన వాదనపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫెయిలైన 3లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాల రీ వాల్యూయేషన్ కి అంత టైం ఎందుకని ప్రశ్నించింది.

ఈ విషయంలో సాధ్యాసాధ్యాలపై సోమవారం చెబుతామని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ఫలితాల్లో గందరగోళంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని తెలుపుతూ GOను ఆయన సమర్పించారు. ఏజెన్సీ పనితీరుపై మాత్రమే విచారణకు ఆదేశించారని అభిప్రాయపడిన హైకోర్టు.. మొత్తం వ్యవహారాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. మరోవైపు దీనిపై న్యాయవిచారణకు ఆదేశించాలంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది హైకోర్టును కోరగా.. న్యాయ విచారణతో విద్యార్థులకు ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించింది. దీనిపై సోమవారంలోపు అభిప్రాయాన్ని చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Latest Updates