పార్టీ మారిన MLAలు, MLCలకు హైకోర్టు నోటీసులు

రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నోటీసులిచ్చింది హైకోర్టు. అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ తో పాటు..  అసెంబ్లీ, మండలి కార్యదర్శిలకు, ఎన్నికల కమిషన్ కు కూడా హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. తర్వాతి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.

పార్టీ మారిన MLCలను అనర్హులుగా ప్రకటించాలని గతంలో హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు షబ్బీర్ అలీ. పార్టీ మారిన MLAలను అనర్హులుగా ప్రకటించాలని ఇటీవల ఉత్తమ్, భట్టి విక్రమార్క పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హై కోర్ట్.. నోటీసులు జారీ చేసింది.

హైకోర్ట్ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీల్లో ప్రభాకర్ రావు, దామోదర్ రెడ్డి, సంతోష్ కుమార్, ఆకుల లలిత ఉన్నారు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేల్లో.. సుధీర్ రెడ్డి, చినమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రేగా కాంతారావు, ఆత్రం సక్కు, హర్షవర్ధన్ రెడ్డి, వనమా వెంకటేశ్వర్ రావు, సురేందర్ ఉన్నారు.

కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు కాంగ్రెస్ నేతలు. స్పీకర్ బులిటెన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై విచారణ రేపు బుధవారానికి వాయిదా వేసింది హైకోర్ట్. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్, సీఎల్పీ విలీనం పిటీషన్లని కలిపి రేపు విచారణ చేస్తామని తెలిపింది హైకోర్ట్.

Latest Updates