కొత్త చట్టం తెచ్చి..పాత చట్టంతో ఎన్నికలా?

  • 109 రోజుల టైం అడిగి..24 గంటల్లోనే చేస్తమంటే ఎట్లా?        
  •          అసలు కొత్త చట్టంలో ఏముంది?
  •           పూర్తి వివరాలివ్వాలని ఆదేశం

నిజమే.. నాలుగు నెలల పనిని మూడు నెలల్లో చేస్తే ఏమీ కాదు. కానీ.. నెల రోజుల్లోపే చేస్తేనే అనుమానం వస్తుంది. వార్డుల విభజనకు 32 రోజులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ ఓటర్ల గుర్తింపు కోసం 28 రోజులు, వార్డుల ఖరారుకు 7 రోజులు, చైర్మన్‌‌ రిజర్వేషన్ల కోసం 7 రోజులు.. ఇలా 109 రోజుల టైం అడిగి ఇప్పుడు అవన్నీ 24 గంటల్లో చేసేస్తామంటే ఎట్లా? ఎనిమిది రోజుల్లోనే ఎలా చేశారు? అభ్యంతరాలను ఏవిధంగా పరిష్కరించారు? ఎంత సమయం తీసుకున్నారు?

మున్సిపల్​ ఎన్నికల నిర్వహణ కోసం 109 రోజుల టైం కావాలని కోరిన సర్కార్‌‌.. ఎనిమిది రోజుల్లోనే ఆ తంతు ఎలా పూర్తి చేసిందని, ఆగమేఘాల మీద ఎందుకు చేయాల్సివచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. ‘‘మున్సిపల్‌‌ చట్టం కొత్తది తీసుకొచ్చినప్పుడు పాత చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ఎలా చెబుతారు? అసలు కొత్త చట్టంలో ఏముంది? పాత చట్టానికి కొత్త చట్టానికి తేడా ఏమిటి? వీటన్నింటిపై వివరణ ఇవ్వండి” అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డివిజన్​ బెంచ్‌‌ ఆదేశించింది. మున్సిపల్​ ఎన్నికల ప్రక్రియ తప్పులతడకగా జరిగిందంటూ ఆదిలాబాద్‌‌ జిల్లాకు చెందిన అంజ్‌‌కుమార్‌‌ రెడ్డి వేసిన పిల్‌‌ను బుధవారం చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్ఎస్‌‌ చౌహాన్, జడ్జి జస్టిస్‌‌ షమీమ్‌‌ అక్తర్‌‌తో కూడిన డివిజన్​ బెంచ్​ విచారించింది. నాలుగు నెలల సమయం కోరి.. ఇప్పుడు వారం రోజుల్లోనే ఎట్లా చేశారో అర్థంకావడం లేదని, దీనిపై సర్కార్‌‌ స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. అన్ని రోజులు కావాలన్నామేగానీ ఆ గడువుకు ముందే చేయలేమని ఎక్కడా చెప్పలేదని అడిషనల్‌‌ అడ్వకేట్‌‌ జనరల్‌‌ జె.రామచందర్‌‌రావు తెలిపారు. మున్సిపల్‌‌ యాక్ట్‌‌ కొత్తగా రూపొందించామని, అయినా పాత చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. దీనిపై బెంచ్‌‌ కల్పించుకొని.. ‘‘నిజమే.. నాలుగు నెలల పనిని మూడు నెలల్లో చేస్తే ఏమీ కాదు. కానీ.. నెల రోజుల్లోపే చేస్తేనే అనుమానం వస్తుంది” అని పేర్కొంది. పెద్ద పంచాయతీలను మున్సిపాలిటీలుగా చేయడం, పలు గ్రామాలను పక్కనే ఉన్న మున్సిపాలిటీల్లో విలీనం చేయడం వంటి చర్యల కారణంగా మొదట్లో ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైందని, ఇదంతా జూన్‌‌ 21న మొదలుపెట్టారని, ఈలోగానే స్టేట్‌‌ ఎలక్షన్‌‌ కమిషన్‌‌ హైకోర్టు మెట్లు ఎక్కిందని అడిషనల్‌‌ ఏజీ తెలిపారు. ఈ క్రమంలో జీవో 31 (1995లో ఇచ్చింది) రద్దు చేసి దాని స్థానంలో కొత్తగా జీవో 78 ఇచ్చామని, దీని ప్రకారం సత్వరమే జరిగేలా రూల్స్‌‌ రూపొందించామన్నారు. 123 మున్సిపాలిటీల్లో వార్డుల విభజన డ్రాఫ్ట్‌‌ జూలై 2న పబ్లిష్‌‌ చేశామని, 1373 అభ్యంతరాలు వస్తే అందులో 665 పరిష్కరించామని, మిగిలినవాటిని తోసిపుచ్చామన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ, పార్టీ నేతలతో సమావేశాలు జరిగాయని తెలిపారు. వార్డుల వారీ ఓటర్ల లిస్ట్‌‌ను జులై 10న మొదలు పెట్టి 16న పూర్తి చేశామన్నారు. దీనిపై బెంచ్ కల్పించుకుంటూ.. ‘‘వార్డుల విభజనకు 32 రోజులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ ఓటర్ల గుర్తింపు కోసం 28 రోజులు, వార్డుల ఖరారుకు 7 రోజులు, చైర్మన్‌‌ రిజర్వేషన్ల కోసం 7 రోజులు.. ఇలా ఏకంగా అప్పట్లో 109 రోజులు అడిగి ఇప్పుడు అవన్నీ 24 గంటల్లో చేసేస్తామంటే ఎట్లా? 8 రోజుల్లోనే ఎలా చేశారు? అభ్యంతరాలను ఏవిధంగా పరిష్కరించారు? ఎంత సమయం తీసుకున్నారు?” అన్ని ప్రశ్నలు సంధించింది. పిటిషనర్‌‌ లాయర్‌‌ కల్పించుకుని, కొత్త చట్టం వచ్చాక పాత చట్టం మేరకు ఎన్నికలు జరుపుతామని ప్రభుత్వం చెప్పడం విచిత్రంగా ఉందని, ఈ పద్ధతి చెల్లదన్నారు. ఎన్నికలు, మున్సిపల్​ చట్టంపై వివరాల్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బెంచ్​ ఆదేశించింది. విచారణ 16కు వాయిదా వేసింది.

Latest Updates