ఆక్రమణలను అడ్డుకోవాలని GHMC కి హైకోర్టు ఆదేశాలు

‘ ఆక్రమణలలో నరకానికి నకలుగా మారిన పాట్నా, ముంబై సిటీల్లా హైదరాబాద్ మారిపోక ముందే కండ్లు తెరవాలి’ అని జీహెచ్ఎంసీపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సిటీలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ జాగాల ఆక్రమణలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఆక్రమణల పిల్స్‌ అన్నింటినీ విచారిస్తామని చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని, మార్చి 24న జరిగే విచారణకు కోర్టుకొచ్చి వివరణ ఇవ్వాలని మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమికషనర్‌ కు ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా గడ్డిఅన్నారంలో అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేసినా.. జీహెచ్ఎంసీ పట్టించుకోలేదంటూ శివాజీ, ఇతరులు వేసిన పిల్స్ పై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది. ఐదేండ్లకోసారి అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్‌ చేయడమేమిటని జీహెచ్ఎంసీని ప్రశ్నించింది. ‘ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ఆక్రమణలు చేయడం, ఆపై జీహెచ్ఎంసీ రెగ్యులరైజ్‌ చేయడం. ఇదేంటో.. ఏ చట్టం కింద చేస్తారో అర్థం కావడం లేదు. సర్కారీ జాగా కబ్జా అయితే  అధికారులు కళ్లప్పగించి చూస్తుంటారు. జీతాలు మాత్రం తీసుకుంటారు. ఇలాగే సిటీని వదిలేస్తే నరకమైపోతుంది’ అని ఆందోళన వ్యక్తం చేసింది. ఆక్రమణల్ని అడ్డుకోవాలని చెప్పింది.

Latest Updates