గడువుకు ముందే ఎలా ఖాళీ చేయిస్తారు?. హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: ఆంధ్ర పాలకులు అణిచివేతకు గురిచేశారని చెప్పి.. తెలంగాణను సాధించుకున్న తర్వాత కూడా రాష్ట్ర పాలకులు అదే ధోరణిని అవలంబిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో వారిలాగే వ్యవహరిస్తే ఎలాగని నిలదీసింది. హైకోర్టు ఇచ్చిన గడువు శుక్రవారం వరకు ఉన్నా రైతుల్ని ముందే ఏప్రిల్ 30న రాత్రి 600 మంది పోలీసులతో వచ్చి బలవంతంగా ఖాళీ చేయించారని పిటీషనర్లు కొండపోచమ్మ రిజర్వాయర్‌‌ నిర్వాసితులు చెప్పడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను బ్రిటీష్‌‌ రాణి ఏమీ నియమించలేదని, గుర్తుంచుకోవాలని హెచ్చరించింది.  ‘కళ్లముందే అమ్మానాన్నలు, అయినవాళ్లను ఈడ్చుకుపోతుంటే పిల్లలు ఎంతగా భయపడతారో, వారిలో ఎలాంటి భావనలు ఏర్పడతాయో ఒక్కసారి ఆలోచించండి.  ఇలాంటి ఘటనలే నక్సలిజం వైపు అడుగులు వేయించే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా ముందుగానే ఇళ్ల నుంచి నిర్వాసితులను ఎందుకు ఖాళీ చేయించాల్సి వచ్చింది. కొండపోచమ్మ నిర్వాసితుల ఘటనపై జిల్లా జడ్జి నుంచి నివేదిక తెప్పించుకుంటాం ’ అని హైకోర్టు తేల్చి చెప్పింది.  బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసి మే 6 లోగా తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా జడ్జిని ఆదేశిస్తూ శుక్రవారం చీఫ్ జస్టిస్  ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ ఎ.అభిషేక్‌‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల, బైలంపూర్​ గ్రామానికి చెందిన శ్యాంసుందర్‌‌రెడ్డి సహా 23 మంది ముంపు బాధిత రైతులు దాఖలు చేసిన రిట్లను హైకోర్టు శుక్రవారం మరోసారి విచారించింది. బాధితులను బలవంతంగా పునరావాస కేంద్రాలకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

నీటి విడుదలకు పర్మిషన్​

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌‌ జనరల్‌‌ బీఎస్‌‌  ప్రసాద్‌‌ వాదనలు వినిపిస్తూ.. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యిందని, ఈ నెల 4న సీఎం కేసీఆర్‌‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు వీలుగా నీటి విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ముంపు బాధితులకు ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌ ప్యాకేజీ 97 శాతం అమలు చేశామని చెప్పారు. 18 ఏళ్లు నిండిన వారికి పరిహారం కోసం ప్రత్యేకంగా రూ.5.04 లక్షలు, 250 చదరపు గజాల స్థలం కేటాయిస్తున్నట్లు చెప్పారు. దీనిపై పిటిషనర్‌‌ న్యాయవాది అభ్యంతరం చెప్పారు. నీటి విడుదలకు అనుమతి ఇవ్వరాదని కోరారు. చెరువు ఎఫ్​టీఎల్​ప్రాంతంలో కాకుండా వేరే చోట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, గజ్వేల్‌‌లో డబుల్‌‌ బెడ్‌‌ రూం ఇళ్లు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. నీటిని విడుదల చేయరాదన్న వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. విచారణను మే 7కి వాయిదా వేసింది.

ఇండ్లు కూల్చేసి.. ఖాళీ చేయించారు

వెయ్యిమంది పోలీసులు, 200 మంది అధికారులు, 500 మంది కూలీలు.. పదుల సంఖ్యలో అంబులెన్సులు..  యాబై    డీసీఎంలు .. పదుల సంఖ్యలో జేసీబీలు, ప్రొక్లెయిన్లతో  ఒక్కసారిగా కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాలైన మామిడ్యాల, బైలంపూర్లపై పడ్డారు.   జామర్లు పెట్టి సెల్ ఫోన్  సిగ్నల్ బ్లాక్ చేయడమే కాకుండా.. నిర్వాసితుల నుంచి సెల్  ఫోన్లు లాక్కున్నారు. ఇండ్లలో దొరికిన సామగ్రిని దొరికినట్టు బయటకు తరలించి డీసీఎంలలో వేశారు. అడ్డుకోబోయిన వారిని ఎక్కడికక్కడే నిలువరించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి మొదలైన ఈ కూల్చివేతలు.. తరలింపు కార్యక్రమం శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. మామిడ్యాల, బైలంపూర్‌ ‌గ్రామాల నుంచి పరిహారం కోసం 53మంది  కోర్టుకు వెళ్లారు. మే 1 వరకు ఖాళీ చేయవచ్చని కోర్టు వారికి సూచించింది. గడువు సమీపించడంతో అధికారులు బలవంతంగా నిర్వాసితులను ఇండ్ల నుంచి ఖాళీ చేయించారు. మామిడ్యాలలో 40, బైలంపూర్​లో 13 ఇండ్ల తో పాటు ఇప్పటికే ఖాళీ చేసిన వాటిని సైతం కూల్చివేయడంతో ప్రస్తుతం అక్కడ మట్టిదిబ్బలే మిగిలాయి.

సాయంత్రం నుంచే..

ముంపు గ్రామాలకు గురువారం సాయంత్రం నుంచే పెద్ద సంఖ్యలో పోలీసులు, అధికారుల రాక మొదలయ్యింది. గజ్వేల్ ఏసీపీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు వెయ్యి మంది వరకు పోలీసు అధికారులు, సిబ్బంది తరలివచ్చారు. గజ్వేల్ ఆర్డీవో విజయేందర్​రెడ్డి నేతృత్వంలో వందల సంఖ్యలో అధికారులు, వారికి సాయంగా 500 మంది సహాయకులు అక్కడకు చేరుకున్నారు. ఇలా మామిడ్యాల, బైలంపూర్ గ్రామాలకు సుమారు రెండు వేల మంది వరకు పోలీసులు, అధికారులు, సహాయకులు, 10 అంబులెన్సులు, డీసీఎం వాహనాలు,  ప్రొక్లెయిన్లతో వచ్చారు. చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లిలో అన్నపూర్ణ రిజర్వాయర్‌‌ ‌‌నిర్వాసితులను తరలించినట్టుగానే పక్కా ప్లానింగ్‌‌‌‌తో అధికారులు వ్యవహరించారు. అర్ధరాత్రి ఒక్కో ఇంటికి సుమారు 50 మంది వరకు పోలీసులు, అధికారులు, సిబ్బంది వెళ్లారు. అప్పటికే కరెంటు సరఫరా నిలిపేయడంతో ఎటుచూసినా చీకటి  అలుముకుంది. ఇదే అదనుగా ఇండ్లలో వున్న సామగ్రిని బయటకు తీసి అప్పటికే సిద్ధంగా ఉంచిన వాహనాల్లో  వేశారు. పశువులు ఉంటే వాటిని కూడా వాహనాలలోకి ఎక్కించేశారు. మహిళలు అడ్డుకోవటానికి యత్నిస్తే వారిని పక్కకు లాగేశారు. ఎవరికైనా ఫోన్లు చేస్తారేమోనని జామర్లు పెట్టి సిగ్నల్ జామ్ చేయడమే కాకుండా అందరి నుంచి సెల్ ఫోన్లు  లాగేసుకున్నారు. ఇండ్లు ఖాళీ చేసిన వెంటనే అప్పటికే సిద్ధంగా ఉన్న జేసీబీలు,  ప్రొక్లెయిన్లతో  అప్పటికప్పుడే ఇండ్లను, ఇంటి ముందు చెట్లను అన్నింటినీ కూల్చివేశారు. తెల్లారే సరికల్లా ఆపరేషన్​ పూర్తి చేసి నిర్వాసితులను తునికి బొల్లారంలోని ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ కాలనీలో వారికి కేటాయించిన ఇండ్లలో చేర్చారు. కాలనీ నుంచి ఎవరు బయటకు రాకుండా, బయట నుంచి లోపలికి వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు.  ఇండ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించడంతో నిర్వాసితులు వారికి కేటాయించిన ఇండ్లలో బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు.

Latest Updates