ప్రైవేటు స్కూల్స్ ఫీజులు దోచుకుంటుంటే సర్కార్‌ ఏం చేస్తోంది?

ఆన్‌లైన్‌ క్లాసులకు పర్మిషన్ లేనప్పుడు ప్రైవేటోళ్లు ఎట్ల చెప్తున్నరు?: హైకోర్టు
రాష్ట్రంలో అకడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్టవుతుందని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: ‘‘ఒక పక్క అకడమిక్‌ ఇయర్‌ షురూ కాలేదని, ఆన్‌లైన్‌ క్లాసులకు పర్మిషన్లేదని ప్రభుత్వం చెప్తున్నది. మరో పక్క ప్రైవేట్‌ స్కూల్స్‌‌ ఆన్‌లైన్‌ క్లాస్‌లు స్టార్ట్ చేసి, ఫీజుల దోపిడీకి దిగుతున్నాయి. వీటిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యం. అసలు ప్రభుత్వ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు’’ అని రాష్ట్ర సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అకడమిక్‌ ఇయర్‌ బిగిన్‌ కానప్పుడు ప్రైవేట్‌ స్కూల్స్‌‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ ఎలా ప్రారంభిస్తాయని ప్రశ్నించింది. ఆన్‌లైన్‌ క్లాస్ లతో స్టూడెంట్స్ పై ఎట్లాంటి ప్రభావం ఉందో, ప్రైవేట్‌ స్కూల్స్ లోని ఫీజుల వసూళ్లపై లోతుగా విచారణ చేపట్టాల్సి ఉంటుందని ప్రకటించింది. హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌‌అసోసియేషన్‌ వేసిన పిల్‌పై గురువారం చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌‌రెడ్డితో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపింది.

సీబీఎస్‌ఈ మార్చిలోనే ఆన్‌లైన్‌ క్లాస్‌లు బిగిన్‌ చేసినట్లు చెబుతోందని, మరి రాష్ట్ర ప్రభుత్వంనుంచి అకడమిక్ ఇయర్ మాటేమిటని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో ఎప్పటి నుంచి అకడమిక్‌ ఇయర్‌ స్టార్ట్ అవుతుందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆన్‌లైన్‌ క్లాస్‌లకు అనుమతి విషయంలో ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే ఇప్పటి వరకూ ప్రైవేట్‌ స్కూల్స్‌‌ వసూళ్లు చేసిన ఫీజుల్ని వెనక్కి ఇచ్చేయాలని తాము ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. బుధవారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, తేదీల్ని త్వరలోనే వెల్లడిస్తామని ప్రభుత్వ ప్రత్యేక లాయర్‌ సంజీవ్‌‌కుమార్‌ చెప్పారు. అకడమిక్ ఇయర్ప్ ప్రారంభంపై ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయాన్ని వెల్లడిస్తుందని ఆయన అన్నారు.

పేరెంట్స్‌‌ను ప్రతివాదులుగా చేయాలని పిటిషనర్‌ లాయర్‌ కోరాగా.. తాము పేరెంట్స్, స్టూడెంట్స్‌‌ తరఫునే ఉన్నామని హైకోర్టు చెప్పింది. పేరెంట్స్‌‌ను కేసులో ఇంప్లీడ్‌కు అనుమతి ఇస్తే వందలాది మంది వచ్చేస్తారని, కాబట్టి ఇంప్లీడ్‌కు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఫీజులు వసూళ్లు చేయొద్దని సర్కార్‌ ఇచ్చిన జీవో 46ను ప్రైవేట్‌ స్కూల్స్‌‌ పాటించడం లేదని లాయర్‌ చెప్పగానే, వీటికి చెందిన ఎవిడెన్స్‌‌ ఇవ్వాలని హైకోర్టు కోరింది. విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.

For More News..

ఆన్‌లైన్  క్లాసుల కోసం స్టూడెంట్లకు నెలకు రూ.1,000 సాయం

Latest Updates