పాఠాలు చెప్పే ప్రొఫెసర్ ను అరెస్ట్ చేస్తరా?

  • కాశిం అరెస్టు విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు మండిపాటు
  • ఐదేళ్లుగా ఓయూలో పాఠాలు చెప్తుంటే కనబడట్లేదంటరా?
  • ఇప్పటికిప్పుడు అరెస్ట్‌‌ చేయాల్సిన అవసరమేంటి?
  • చీఫ్ జస్టిస్ ఇంట్లో అత్యవసర విచారణ

హైదరాబాద్, వెలుగు: ‘‘ఐదేళ్ల నాటి కేసు ఫైలు ఇప్పుడు దుమ్ముదులిపి తీరుబడిగా నిందితుడిని అరెస్ట్‌‌ చేస్తారా? సదరు ప్రొఫెసర్ నిత్యం హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్లకు పాఠాలు చెబుతుంటే.. కనబడట్లేదంటారా? ఇలాగే రాజస్థాన్‌‌లో జరిగితే సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలిచ్చాం. ఇక్కడ కూడా అలానే సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులు ఇవ్వాలా?” అని రాష్ట్ర పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓయూ అసోసియేట్‌‌ ప్రొఫెసర్‌‌ సీహెచ్‌‌ కాశింను అరెస్ట్‌‌ చేయడాన్ని సవాల్‌‌ చేస్తూ రాష్ట్ర సివిల్‌‌ లిబర్టీస్‌‌ కమిటీ చైర్మన్‌‌ ప్రొఫెసర్‌‌ గడ్డం లక్ష్మణ్‌‌ దాఖలు చేసిన హెబియస్‌‌ కార్పస్‌‌ పిటిషన్‌‌ను శనివారం సాయంత్రం చీఫ్ జస్టిస్ ఇంట్లో హైకోర్టు అత్యవసరంగా విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ ఆర్ఎస్‌‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌‌ అభిషేక్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ ఈ మేరకు ప్రశ్నల వర్షం కురిపించింది. హెబియస్‌‌ కార్పస్‌‌ పిటిషన్‌‌ హైకోర్టులో దాఖలైన తర్వాత పోలీసులు మేల్కొని నిందితుడిని కోర్టులో హాజరుపర్చడం పరిపాటిగా మారుతోందని మండిపడింది. ఇలాంటి కేసుల్లో నిజానిజాలు తెలియాలంటే సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇస్తే సరిపోతుందని హెచ్చరించింది.

అంత అర్జెంట్ ఏముంది?

2016లో కేసు పెడితే.. ఇప్పటికిప్పుడు అరెస్ట్‌‌ చేయాల్సిన అవసరం ఏముందని పోలీసులను హైకోర్టు నిలదీసింది. రోజూ వర్సిటీకి వెళ్లి స్టూడెంట్స్‌‌కు పాఠాలు చెబుతుంటే కనబడటం లేదని ఇంతకాలం ఎట్లా చెప్పారని ప్రశ్నించింది. ప్రభుత్వ లాయర్లు స్పందిస్తూ.. హైకోర్టు ఆదేశాలిస్తే కాశింను హాజరుపర్చాలని పోలీసులకు చెబుతామన్నారు. దీంతో హైకోర్టు.. ఆదివారం కాశింను తమ ఎదుట హాజరుపర్చాలని పోలీసుల్ని ఆదేశించింది. విచారణ ఆదివారానికి వాయిదా పడింది.

 

Latest Updates