అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణ‌లో త‌క్కువ టెస్టులు: హైకోర్టు

సూర్యాపేటలో క‌రోనా‌ టెస్ట్‌లు చేయకపోవడంపై ప్రభుత్వం పై మండిపడింది హై కోర్టు.హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న సూర్యాపేటలో టెస్టింగ్ చేయకుండా కోవిడ్ ఫ్రీ జోన్ గా ఎలా ప్రకటిస్తార‌ని ప్ర‌శ్నించింది కోర్డు. ఇలా చేయ‌డం వల్ల‌ వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగి, ప్ర‌జ‌లు భయాందోళనల‌కు గురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. సూర్యాపేట‌లో టెస్ట్‌లు చేయ‌డం లేద‌న్న‌ హైకోర్టులో వేసిన ఫిటీషన్ పై సోమవారం చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

సూర్యాపేట తో పాటు రాష్ట్రంలో ఏప్రిల్ 24 నుండి ఇప్పటివరకు ఎన్ని టెస్టులు చేశారని వివ‌ర‌ణ అడిగింది కోర్టు. వలస కూలీలు రాష్ట్రంలో కి వస్తున్న నేపథ్యంలో కేసులు పెరిగే అవకాశం ఉన్నద‌ని, కాబ‌ట్టి ప్రైవేట్ ల్యాబులకు అనుమతించి, కేరళ మాదిరిగా మొబైల్ టెస్టింగ్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల‌ని కోర్టు ఆదేశించింది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో తక్కువ స్థాయిలో చేశారని మండిప‌డ్డ ధ‌ర్మాస‌నం.. ఈ నెల 26 వరకు రాష్ట్రంలో ఎన్ని టెస్టులు చేశారో కోర్టుకు వివ‌రాలను అందించాలని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 26 కు వాయిదా వేసింది.

Latest Updates