జూన్ 30న కేబినెట్ మీటింగ్ జరిగిందా?

దాంట్లో సెక్రటేరియట్ కూల్చివేతపై ఫైనల్ డెసిషన్ తీసుకున్నరా?
మీడియాలో ఆ వార్త రాలేదే?..
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
సెక్రటేరియట్‌‌ కూల్చివేతపై 15 వరకు స్టే పొడిగింపు

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియట్ కూల్చివేతపై స్టేను హైకోర్టు ఈ నెల 15 వరకు పొడిగించింది. కూల్చివేతకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ ఫైనల్ డెసిషన్ తీసుకుంటే దానికి సంబంధించిన కాపీని తమకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ‘‘సెక్రటేరియట్‌‌ బిల్డింగ్స్‌‌ కూల్చేయడానికి కేబినెట్‌‌ తీర్మానం చేసిందా లేదా..? చేసుంటే దాని కాపీని సీల్డ్‌‌ కవర్‌‌లో ఇవ్వాలి. కేబినెట్‌‌ నిర్ణయం పాలసీ మ్యాటర్‌‌ కిందికి వస్తుందనే వాదన సరికాదు. ఇదే హైకోర్టు.. రాష్ట్ర కేబినెట్‌‌ తీర్మానాన్ని సవాల్‌‌ చేసిన పిల్‌‌ను గతంలో విచారణ చేసిన విషయం ప్రభుత్వం మరిచిపోతే ఎట్ల? జూన్‌‌ 30న కేబినెట్‌‌ మీటింగ్‌‌ అయిందా..? అయితే ఆ విషయం గురించి పత్రికలు, టీవీల్లో న్యూస్‌‌ ఐటెమ్‌‌ కూడా రాలేదే? సెక్రటేరియట్‌‌ బిల్డింగ్స్‌‌ కూల్చాలని కేబినెట్‌‌ ఫైనల్‌‌ డెసిషన్‌‌ తీసుకుంటే ఆ విషయం మీడియాలో మాట వరుసకైనా ఎందుకు రాలేదు? ప్రభుత్వమైనా స్టేట్‌‌మెంట్‌‌ రిలీజ్‌‌ చేయలేదంటే ఏమనుకోవాలి.. ?’’ అని హైకోర్టు నిలదీసింది. సెక్రటేరియట్‌‌ బిల్డింగ్స్‌‌ కూల్చేయడానికి కేబినెట్‌‌ ఫైనల్‌‌ డెసిషన్‌‌ తీసుకుందా అని ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌‌ జనరల్‌‌ బీఎస్‌‌ ప్రసాద్‌‌ను ప్రశ్నించింది. ఇది సర్క్యులేషన్‌‌లో ఉందని, ప్రివిలైజ్డ్‌‌ డాక్యుమెంట్‌‌ అని ఏజీ జవాబు చెప్పడంతో.. డివిజన్‌‌ బెంచ్‌‌ పైవిధంగా ప్రభుత్వంపై ప్రశ్నలు కురిపించింది. పర్యావరణ, కాలుష్య నియంత్రణ చట్టం రూల్స్ప్రకారం ఏ అనుమతులు లేకుండానే సెక్రటేరియట్‌‌ బిల్డింగ్స్‌‌ కూల్చేస్తున్నారని సవాల్‌‌ చేస్తూ టీజేఎస్ నేత, ప్రొఫెసర్‌‌ పీఎల్‌‌ విశ్వేశ్వర్‌‌రావు, తెలంగాణ ఇంటి పార్టీ నేత డాక్టర్‌‌ చెరుకు సుధాకర్‌‌ దాఖలు చేసిన పిల్‌‌ను చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డితో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ మరోసారి సోమవారం విచారణ జరిపింది.

కేబినెట్ నిర్ణయం మాకు కూడా చెప్పరా?
ప్రజలెవరికీ కేబినెట్‌‌ నిర్ణయం గురించి చెప్పకపోయినా.. కనీసం హైకోర్టుకైనా సీల్డ్‌‌ కవర్‌‌లో ఆ కాపీని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దురదృష్టం ఏమిటంటే కేబినెట్‌‌ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలకు ఎవరికీ తెలియదని, కనీసం హైకోర్టు జడ్జీలకైనా తెలియజేసేలా సీల్డ్‌‌ కవర్‌‌లో అందజేయకపోతే ఎట్లని సీరియస్ కామెంట్ చేసింది. సాయంత్రానికే సీల్డ్‌‌ కవర్‌‌లో ఇస్తామని, విచారణను మంగళవారానికి వాయిదా వేయాలని ఏజీ కోరితే అందుకు హైకోర్టు నిరాకరించింది. కూల్చివేత పనులు ఆగిపోయాయని, విచారణను మంగళవారానికే వాయిదా వేయాలని పలుసార్లు ఏజీ కోరగా కల్పించుకున్న హైకోర్టు.. ప్రభుత్వ దాఖలు చేసిన కౌంటర్‌‌పై పిటిషనర్‌‌ రిప్లై కౌంటర్‌‌ దాఖలుకు ఒక్క రోజైనా గడువు ఇవ్వాలి కదా అని ప్రశ్నించింది. అందుకే విచారణను ఈ నెల 15కి వాయిదా వేస్తున్నామని, అప్పటి వరకూ గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులకు అనుగుణంగా సెక్రటేరియట్‌‌ బిల్డింగ్స్‌‌ కూల్చివేత పనుల్ని నిలిపివేయాల్సిందేనని తేల్చి చెప్పింది. తొలుత పిటిషనర్‌‌ తరఫు లాయర్‌‌ చిక్కుడు ప్రభాకర్‌‌ వాదిస్తూ.. కూల్చివేత పనుల ప్రారంభానికి చట్ట ప్రకారం పొల్యూషన్, ఎన్విరాన్‌‌మెంట్స్‌‌ యాక్ట్‌‌ కింద అనుమతి తీసుకున్నదీ లేనిదీ కౌంటర్‌‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు. వీటిపై స్పందించిన ఏజీ.. ఇప్పుడు ఆ దశ దాటిందని, దీనిపై కౌంటర్‌‌ దాఖలు అవసరం లేదని చెప్పారు.

కేబినెట్‌‌ తీర్మానం చేసింది: సీఎస్‌‌
సెక్రటేరియట్‌‌ బిల్డింగ్స్‌‌ కూల్చి కొత్త వాటిని కట్టాలని రాష్ట్ర కేబినెట్‌‌ జూన్‌‌ 30న తీర్మానం చేసిందని సీఎస్ సోమేశ్ కుమార్‌‌ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌‌ పిటిషన్‌‌లో పేర్కొన్నారు. గతంలో చేసిన తీర్మానానికి అనుగుణంగా ఆ తీర్మానం చేసినట్లు తెలిపారు. బిల్డింగ్స్‌‌ కూల్చేయాలని జులై 4న ఆర్‌‌ అండ్‌‌ బీ అనుమతి ఇచ్చిందని, వ్యర్థాల నిర్వాహణ ప్రణాళికపై ఇంజినీర్‌‌ ఇన్‌‌ చీఫ్‌‌ ఇచ్చిన రిపోర్టు మేరకు జీహెచ్‌‌ఎంసీ కమిషనర్‌‌ కూడా పర్మిషన్‌‌ ఇచ్చారని వివరించారు.

For More News..

కరోనా లెక్కల్లో తిరకాసు

Latest Updates