బర్త్ సర్టిఫికెట్లకు పెరిగిన డిమాండ్.. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ లేనివాళ్లకెలా?

రాష్ట్రవ్యాప్తంగా భారీగా వస్తున్న అప్లికేషన్లు

గతంతో పోలిస్తే రెట్టింపు దరఖాస్తులు

రెండు నెలలుగా ఇదే పరిస్థితి

హైదరాబాద్​లో భారీగా డిమాండ్

ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీలోనే 1,560 అప్లికేషన్లు

జనాభా లెక్కల ప్రక్రియ నేపథ్యంలోనే ఎక్కువ మంది దరఖాస్తు

హైదరాబాద్‌‌, వెలుగు: జీహెచ్ఎంసీలోని ఖైరతాబాద్ సర్కిల్​లో గతేడాది ఫిబ్రవరిలో 304 మంది బర్త్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఏకంగా 1,560కి పెరిగింది.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్​లో ప్రతి నెల సగటున 600 మంది బర్త్ సర్టిఫికెట్లు కోసం దరఖాస్తు చేసుకుంటారు. రెండు నెలలుగా ఈ సంఖ్య 900 చొప్పున పెరిగింది.

ఆ రెండు ప్రాంతాల్లో మాత్రమే కాదు… రాష్ట్రవ్యాప్తంగా ‌‌అన్నిచోట్ల బర్త్ సర్టిఫికెట్ కోసం అప్లికేషన్లు వెల్లువెత్తుతున్నాయి. పల్లె, పట్నం, నగరం తేడా లేకుండా దరఖాస్తులు పెరిగిపోతున్నాయి. దీంతో అర్బర్​ఏరియాల్లోని మీసేవ సెంటర్లకు జనం తాకిడి పెరిగింది. చిన్న పిల్లలేకాదు.. పెద్ద వారు కూడా ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.

రోజుకు 1,700 మంది పుడుతున్నరు

హెల్త్ డిపార్ట్ మెంట్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో రోజూ సగటున 1,700 మంది పుడుతున్నారు. ప్రతినెల సుమారు 50 వేల కాన్పులు జరుగుతున్నాయి. ఏడాదికి యావరేజ్​గా 6.50 లక్షల మంది జన్మిస్తున్నారు. వీరిలో 97 శాతం మంది ఆస్పత్రుల్లోనే పుడుతున్నారు. సాధారణంగా కాన్పు అయిన వారం రోజుల్లోపు శిశువు జెండర్​తోపాటు తల్లిదండ్రుల పేర్లను ఆస్పత్రులు ఆయా మున్సిపల్ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు, గ్రామపంచాయతీలకు పంపిస్తాయి. సంబంధిత స్థానిక సంస్థలు వెంటనే ఆ వివరాలను ఆన్​లైన్​లో రికార్డు చేస్తాయి. బర్త్ సర్టిఫికెట్ కావాలనుకునే వారు మీసేవ సెంటర్లలో అప్లై చేసుకుంటారు. వాటిని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలు అప్రూవ్ చేస్తాయి. తర్వాత అదే మీసేవ సెంటర్​లో సర్టిఫికెట్ జారీ చేస్తారు. 2000 సంవత్సరం నుంచి పుట్టిన వారికి ఒకటీరెండు రోజుల్లోనే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. దరఖాస్తులు పెరగడంతో ఇప్పడు వారం పడుతోంది.

ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు లేకుంటే..

దరఖాస్తుదారుడు విద్యావంతుడైతే.. అందుబాటులో ఉన్న ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లను ప్రమాణికంగా తీసుకుని డేట్ ఆఫ్ బర్త్ ను రికార్డు చేస్తారు. ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు లేని వారు బర్త్ సర్టిఫికెట్లు తీసుకునేందుకు పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇలాంటి వారు ఫలానా తేదీన, ఫలానా ఊరిలో పుట్టానని పేర్కొంటూ సెల్ఫ్ డిక్లరేషన్​తో ఆర్డీవోలో అప్లయ్ చేయాలి. పరిశీలన తర్వాత దరఖాస్తులోని వివరాల ఆధారంగా ఆర్డీవో సదరు వ్యక్తికి నాన్ అవైలబులిటీ సర్టిఫికెట్ ఇస్తారు. లేదా దరఖాస్తును రిజెక్ట్ చేయవచ్చు. ఈ నాన్​ అవైలబులిటీ సర్టిఫికెట్ తో మీసేవలో అప్లయి చేస్తే బర్త్ సర్టిఫికెట్ ఇస్తారు. ‘‘బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారిలో 1970 కంటే ముందు పుట్టిన వారు ఉంటున్నారు. వీరి విషయంలో ఏం చేయాలో తెలియడంలేదు. క్షేత్రస్థాయిలో విచారించి తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని హైదరాబాద్​లోని ఓ ఆర్డీవో తెలిపారు.

అన్నిచోట్ల ఇదే పరిస్థితి..

హైదరాబాద్ నగరంలో ఈ అప్లికేషన్లు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే గ్రేటర్ పరిసరాల్లోని కార్పొరేషన్లలో, మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రామగుండంలలో బర్త్ సర్టిఫికెట్ల కోసం అప్లికేషన్లు పెరుగుతున్నాయి. ‘‘సాధారణంగా పుట్టిన వారిలో సగం మంది మాత్రమే బర్త్ సర్టిఫికెట్లు తీసుకుంటారు. మిగిలిన వాళ్లు పెద్దగా పట్టించుకోరు. ఇప్పడు మాత్రం దరఖాస్తుదారుల సంఖ్య మరో 20 శాతం వరకు పెరిగింది’’ జిల్లా మెడికల్​ఆఫీసర్​ ఒకరు తెలిపారు. ఏప్రిల్​లో జనాభా లెక్కల ప్రక్రియ మొదలవుతుండటం, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్​పీఆర్​) అప్డేషన్​కారణాలతోనే బర్త్​ సర్టిఫికెట్లకు డిమాండ్ పెరిగిందని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. పెరుగుతున్న దరఖాస్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వివరించారు.

ఏప్రిల్ నుంచి జనాభా లెక్కలు

2021 జనాభా లెక్కల ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్, మేలో తొలిదశను ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియలో ఇండ్ల సంఖ్యను లెక్కిస్తారు. ఎన్​పీఆర్​ను అప్​డేట్ చేస్తారు. జనాభా లెక్కల ఫీల్డ్ స్టాఫ్ ఒక్కొక్కరు 150 ఇండ్ల వివరాలను సేకరిస్తారు. ఇంటి ఓనర్, మొబైల్ నంబర్, మరుగుదొడ్ల సంఖ్య, టీవీ, ఇంటర్నెట్, సొంత వాహనాలు, తాగునీటి సదుపాయం వివరాలను సేకరిస్తారు. ఎస్సీ, ఎస్టీ వివరాలతోపాటు ఏ మతం వారు ఎంత మంది ఉన్నారనేది నమోదు చేస్తారు. తొలిదశలో సేకరించిన వివరాలను వచ్చే ఏడాది రివ్యూ చేస్తారు. ఎన్పీఆర్​ఆప్​డేట్ ప్రక్రియకు బర్త్ సర్టిఫికెట్ అవసరమనే ఉద్దేశంతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటున్నారు.

For More News..

పట్నం బాట పట్టిన పల్లేవాసులు

తెలంగాణ నుంచి రాజ్యసభకు వారిద్దరేనా?

ఏపీ పంపిస్తామన్నా.. తెలంగాణ తీసుకెళ్లట్లేదు..

ఇయర్ ఫోన్స్ కొంటే.. కారు గెలిచారని ఫోన్

రేవంత్ పోరాటంతో కాంగ్రెస్‌కు సంబంధం లేదు

Latest Updates