మహా నిమజ్జనం..నిఘా నీడలో భాగ్యనగరం

గణేష్  ఉత్సవాల్లో అత్యంత కీలకమైన నిమజ్జన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. గణేష్ శోభాయాత్ర. ఆ తర్వాత జరిగే నిమజ్జనం కోసం…. భారీ బందోబస్త్ ఏర్పాట్లు చేశారు పోలీసులు. గ్రేటర్ హైద్రాబాద్ లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జరిగే గణనాధుల నిమజ్జనానికి వేలాది మంది పోలీసులతో సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ప్రధాన శోభాయాత్ర జరగనున్న సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 52 ప్లాటూన్ల కేంద్ర బలగాలు… 5 కంపెనీల CRPF బలగాలతో కలిపి మొత్తం 21 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. ఇక ఓల్డ్ సిటీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.  బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర…. పాతబస్తీలోని సున్నితమైన ప్రాంతాల నుంచి కొనసాగనుంది. దీంతో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 21 కిలోమీటర్ల మేర జరిగే శోభాయాత్రను సీసీ కెమెరాలతో రికార్డు చేయనున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని అనుమానితులు, రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్రబలగాలతో గస్తీ ముమ్మరం చేశారు. ఇప్పటికే 312 మందిని బైండోవర్ చేశారు. ఇందులో పాతబస్తీలో గుర్తించిన 18 మంది కమ్యూనల్ అఫెండర్లపై నిఘా పెట్టారు. నగరం మొత్తం 250 ప్రాంతాల్లో వాచ్ టవర్స్ ఏర్పాటు చేసి శోభాయాత్ర ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

సున్నిత ప్రాంతాలతో పాటు శోభాయాత్ర జరిగే ప్రధాన మార్గాల్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్స్ తో తనిఖీలు చేస్తున్నారు. చార్మినార్, మక్కా మజీద్ సహా పాతబస్తీలోని అన్ని ప్రార్ధనా మందిరాల దగ్గర SI… స్థాయి అధికారిని నియమించారు. కేశవగిరి నుంచి హుస్సేస్ సాగర్ వరకు… 560 సీసీ కెమెరాలతో పాటు 260 హెచ్.డీ హ్యాండ్ కెమెరాలతో శోభాయాత్రను వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో 100 కు పైగా హై డెఫెనేషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.  శోభాయాత్ర సాగే రూట్లో ఇప్పటికే ఫిక్స్ చేసిన సీసీ కెమెరాలతో ట్రాఫిక్ అప్డేట్స్ ను గూగుల్ మ్యాప్ సహకారంతో అందించనున్నారు. 5 జోన్ల పరిధిలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా బషీర్ బాగ్ లోని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఉన్నతాధికారులు పరిశీలిస్తుంటారు. ఫుటేజ్ ను TSCOP యాప్ కి కనెక్ట్ చేసి డీసీపీ స్థాయి అధికారి నుంచి ఆయా ఏరియాల్లో ఉన్న పోలీసులను అలెర్ట్ చేస్తారు.

శోభాయాత్రలో ఏదైనా వెహికిల్ చెడిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడినా…. గొడవలు జరిగినా క్షణాల్లో స్పందించేలా సీసీ కెమెరాలను 24 గంటలు ఆన్ లోనే ఉంచారు. చార్మినార్, మొజంజాహి మార్కెట్,బషీర్ బాగ్ తో పాటు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ లల్లో కెమెరాలను డీజీపీ ఆఫీసులోని ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ కి కనెక్ట్ చేశారు. దీంతో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో శోభాయాత్రలో ఎవరైనా పాత నేరస్తులు అనుమానాస్పద వ్యక్తుల మూవ్ మెంట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోనున్నారు.

శోభాయాత్రలో మఫ్టీ పోలీసులు నిఘా పెట్టారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్  మార్గ్ లలో మహిళలను వేధించే ఆకతాయిలపై షీ టీమ్స్ ఫోకస్ పెట్టాయి. నిమజ్జనంలో పాల్గొనే  మహిళలు,యువతులతో పాటు చూసేందుకు వచ్చిన వారికి సెక్యూరిటీ కల్పించనున్నాయి. సిటీ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం పనిచేస్తున్న100 షీటీమ్స్ తో మఫ్టీలో నిఘా నిర్వహించనున్నారు. ఇందులో ఒక్కో టీమ్ లో ఎస్సై స్థాయి అధికారితో పాటు ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ మరో ఇద్దరు కానిస్టేబుల్స్ ఉంటారు. వీరంతా విడివిడిగా మఫ్టీలో ఆకతాయిలను పట్టుకునేలా ఏర్పాట్లు చేశారు.

Latest Updates