ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులు ఈగోలకు వెళ్లొద్దు : హైకోర్టు

ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ఏం చర్యలు తీసుకున్నారు

సమ్మెపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

రేపటిలోపు పరిష్కారానికి సంబంధించిన డ్రాఫ్ట్ అందివ్వాలని కోర్టు ఆదేశం

ఆర్టీసీ ఉద్యోగులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచన

చర్చల్లో పాల్గొని సమ్మె విరమించాలని ఆర్టీసీ ఉద్యోగులకు సూచన

హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు

హైదరాబాద్ : ప్రభుత్వం RTC ఉద్యోగులు, కార్మికులను చర్చలకు పిలవాలని.. RTC ఉద్యోగులు సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. సమ్మె తర్వాత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని ప్రశ్నించింది. కార్మికులకు వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.

ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పలు పిటిషన్లను ఒకేసారి హైకోర్టు విచారణ చేస్తోంది. ఈ సందర్భంగా ఆర్టీసీని విలీనం చేయలేమని.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ప్రభుత్వం సిద్దంగా లేదని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ కోర్టుకు తెలిపారు. కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని కోర్టుకు చెప్పారు. ఐతే… దీనిపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది.

“ప్రభుత్వం గానీ… కార్మి, ఉద్యోగ సంఘాలు గానీ ఈగోలకు వెళ్లకండి.. ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన వ్యవస్థ కాబట్టి.. ప్రభుత్వానికి బాధ్యత లేదా” అంటూ ప్రభుత్వం తరఫు అడ్వకేట్ ను ప్రశ్నించింది.

“ఆర్టీసీకి పర్మనెంట్ ఎండీ  ఇప్పటివరకు లేరు.. అందుకే సమస్య పరిష్కరించలేకపోతున్నాం” అని అడ్వకేట్ కోర్టుకు చెప్పారు. దీంతో కోర్టు సీరియస్ అయింది.

“ఎండీ లేరని.. ఫైల్స్ లేవని, అధికారులు లేరని చెప్పడం సమస్య పరిష్కారం కాదు. సమస్య పరిష్కరించడమే ప్రభుత్వం బాధ్యత. దాన్ని మరింత జటిలం చేయకూడదు. అలా చేస్తే అది చేతగాని చర్యే అవుతుంది. సమ్మె సమస్యకు ఎటువంటి పరిష్కారం చూపిస్తారనే డ్రాఫ్ట్ ను రేపటిలోపు కోర్టుకు సమర్పించండి” అని కోర్టు ప్రభుత్వం తరఫు న్యాయవాదికి సూచించింది.

Latest Updates