దోమలతో హైదరాబాద్​కు సుస్తి

    మూసీ ప్రక్షాళనపై సర్కారు  దృష్టి పెట్టాలి: దత్తాత్రేయ

    మురుగు పారే రోడ్లతో  ఆరోగ్యం ఎట్లా ఉంటది: కిషన్​రెడ్డి

    అస్కీలో ‘హెల్తీ హైదరాబాద్ రౌండ్ టేబుల్’ సమావేశం

హైదరాబాద్, వెలుగు: మారుతున్న వాతావరణ పరిస్థితులు, పారిశుద్ధ్య లోపం, పెరిగిపోయిన దోమలతో హైదరాబాద్​ మహా నగరం రోగాల బారిన పడుతోందని హిమచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళనపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆదివారం హైదరాబాద్​లోని ఖైరతాబాద్​లో ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ ఆధ్వర్యంలో అస్కీలో ‘హెల్తీ హైదరాబాద్– వెల్తీ తెలంగాణ’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో దత్తాత్రేయతోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు పర్యావరణవేత్తలు, వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు ప్రాధాన్యత ఇవ్వాలని, దానివల్ల దోమల బెడద చాలావరకు తగ్గుతుందని చెప్పారు. పారిశుధ్య లోపం కారణంగా రోగాల ముప్పు పెరుగుతోందని చెప్పారు. హైదరాబాద్ ను ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దేందుకు పౌర సమాజం, వైద్యులు, పాలకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ లోని బస్తీలకు వెళితే ఎన్నో సమస్యలు కనిపిస్తున్నాయని, నిత్యం మురుగు నీరు రోడ్లపై పారుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇలాగైతే ఆరోగ్య నగరం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

 

ఇంటిగ్రేటెడ్ విధానం అవసరం

రాష్ట్ర ప్రభుత్వం సమీకృత వైద్య విధానాన్ని అమలు చేయాలని కొందరు డాక్టర్లు, పర్యావరణవేత్తలు ఈ సమావేశంలో సూచించారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా, వాడని సామగ్రి, ఉపకరణాలను తొలగించేలా జనంలో అవగాహన కల్పించాలని చెప్పారు. మారుతున్న జీవన శైలితో మానసిక రుగ్మతలు ఎక్కువైపోయాయన్నారు. హైదరాబాద్ లో వాతావరణ కాలుష్యం పెరిగిపోతోందని, గుండె వ్యాధులు, డయాబెటిస్​ సమస్య పెరిగిపోతున్నాయని తెలిపారు. ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. దక్షిణాదిలో ఉన్న మిగతా నగరాల కంటే హైదరాబాద్​లో ఎయిర్​ క్వాలిటీ అధ్వానంగా ఉందని పొల్యూష్యన్ కంట్రోల్ బోర్డు నివేదిక హెచ్చరించిందని.. ఇదిట్లే ఉంటే పరిస్థితి ఢిల్లీలా మారుతుందన్నారు.

Latest Updates