మారువేషంలో పోలీసుల నుండి తప్పించుకున్నాను

ఎమర్జెన్సీ కాలం నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న బండారు ద‌త్తాత్రేయ‌

1975, జూన్‌25 అర్ధరాత్రి దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆనాటి చీకటి రోజులను గుర్తుచేసుకున్నారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. తాను ఆ స‌మ‌యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) ప్రచారక్ గా, సామాజిక కార్యకర్త గా పనిచేస్తున్నట్లు‌ చెప్పారు. లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌నారాయణ నాయకత్వంలోని లోక్‌సంఘర్ష సమతి, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభాగ్‌ ప్రచారక్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నామ‌ని చెప్పారు. అప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) పై నిషేధం విధించడం జరిగిందని, తాను మారువేషం లో “ధర్మేందర్” అనే పేరుతొ కార్యకలాపాలను కొనసాగించానన్నారు. తనను కలవాలంటే రెండవ వ్యక్తి వద్దకు వచ్చి “మామాజీ” అంటే ఆ వ్యక్తి తన దగ్గరకు తెచ్చే వాడని పేర్కొన్నారు.

ఒక సమావేశం కోసం తాను హైదరాబాద్ మీదుగా భిక్నూర్ వెళ్లి , అక్కడి నుంచి సమీపంలోని రామేశ్వర్ పల్లి దేవాలయం లో తమ బృందం కార్యకర్తల సమావేశానికి హాజరయ్యాన‌ని చెప్పారు. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండడంతో భక్తుని లాగా ఆ సమావేశానికి తాను పంచ కట్టుకొని కూర్చున్నానన్నారు. దేవాలయ దర్శనానికి వచ్చినట్లు వ్యవహరించానని, ఇంటలిజెన్స్ అధికారి కూడా పంచ కట్టుకొని భక్తునిలాగానే వచ్చి వంట వారిని ఇక్కడ ఏమి సమావేశం జరుగుతుందని వాకబు చేశారన్నారు.

అందరూ కూర్చున్నాక నేను కొన్ని విషయాలు చెబుతున్నప్పుడు తనకు అనుమానం వచ్చిందని అనంతరం వ్యాన్లల్లో పోలీసులు దేవాలయానికి చేరుకున్నట్లు ఓ కార్యకర్త తెలియజేయడంతో తనతో పాటు మరికొందరు దేవాలయం వెనుకకు చేరుకొని మళ్ళీ వేషాలు మార్చుకొని, దేవాయలం వెనుకభాగాన ఉన్న ప్రహరీ గోడను దూకామ‌ని చెప్పారు. దూకినప్పుడు తన కాలు బెణి కిందని, తన కాలు వాపుకు గురైనప్పటికీ పంట పొలాల నుండి నడుచుకుంటూ మెదక్ చేరుకొని అక్కడినుండి బస్సు ద్వారా హైదరాబాద్ కు చేరుకున్నట్లు బండారు దత్తాత్రేయ తెలిపారు.

పోలీసులు మాత్రం మిగితా వారిని విచారించి , 5 గురిని పోలీసు స్టేషన్ కి తరలించి తన గురించి వాకబు చేసి వదిలివేయడం జరిగిందన్నారు. పోలీసులు వచ్చింది తన కోసం గనుక మిగితా వారిని విచారించి వదిలేశారని తెలిపారు. ఈ విధంగా మారువేషంలో మొదటిసారి పోలీసులనుండి తప్పించుకున్నట్లు తెలిపారు. కానీ పోలీసులకు మాత్రం ఇంత బందోబస్తు మధ్య తాను ఎలా తప్పించుకున్నాననేది వారికి అంతుచిక్కలేదని చెప్పారు. అప్పట్లో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పోలీసులకు తాను మోస్ట్ వాంటెడ్ వ్యక్తినని పేర్కొన్నారు.

అనంతరం బెల్లంపల్లి లో తనను పోలీసులు “మీసా” చట్టం క్రింద అరెస్ట్ చేసి హైదరాబాద్ చంచల్ గూడ సెంట్రల్ జైలు కు తరలించి ఒక‌ సంవత్సరం పాటు నిర్బంధించారని బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆలె నరేంద్ర , నాయిని నరసింహారెడ్డి తో బాటు ఆ జైలులో వివిధ రాజకీయ పార్టీలైన సి పి ఐ, సి పి ఎం, సి పి ఐ (ఎం ఎల్), అతివాద కమ్యూనిస్టు పార్టీలకు చెందిన వరవరరావు, చెరబండరాజు, జమైత్ ది ఇస్లామీయ అనుబంధంగా ఉన్న అజిజ్ పాష లాంటి నాయకులతోబాటు వివిధ రంగాలకు చెందిన మేధావులు, కవులు, కళాకారులతో వారి అభిప్రాయలు, రాజకీయ సిద్ధాంతాలను తాను తెలుసుకున్నానని, ఈ విధంగా రాజకీయాలపై మరింత అవగాహన కలిగిందని దత్తాత్రేయ “ఎమర్జెన్సీ” చీకటి రోజులని గుర్తుచేసుకున్నారు.

Latest Updates