‘మాది‘ విలేజ్.. మతసామరస్యానికి ప్రతీక

బీహార్‌‌లోని ‘మాది’.. ఆ ఊరికి ఓ స్పెషాలిటీ ఉంది.  ఆ ఊరు మతసామరస్యానికి ప్రతీక. ముస్లింలు లేని ఆ ఊరిలో హిందువులే మసీదును శుభ్రం చేసి నిత్యం ప్రార్థనలు జరిగేలా చూస్తున్నారు. మాధి గ్రామంలో ఒకప్పుడు హిందువులు, ముస్లింలు కలిసి నివసించేవారు. ఏళ్ల కిందటే గుడి, మసీదు కట్టుకున్నారు. కానీ ఉపాధి బాటలో చాలా మంది పట్టణాలకు వలస వెళ్లారు. ప్రస్తుతం ఊరిలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేదు. 200 ఏళ్లనాటి చరిత్ర ఉన్న మసీదును అలాగే వదిలేయడం ఇష్టం లేక ఊరి ప్రజలే రోజూ శుభ్రం చేస్తున్నారు. నమాజ్‌‌ సమయాల్లో ఆజాన్‌‌ రికార్డింగ్‌‌ను, ప్రార్థనను ప్లే చేస్తున్నారు. ‘మాకు ఆజాన్‌‌ గురించి తెలియదు. ఓ పెన్‌‌ డ్రైవ్‌‌ ద్వారా ఆజాన్‌‌ రికార్డింగ్‌‌ను రోజూ ప్లే చేస్తారు’ అని హన్స్‌‌ కుమార్‌‌ చెప్పారు. ‘మసీదును చూసుకోడానికి ప్రస్తుతం ఎవరూ లేరు. అందుకే హిందువులం ముందుకొచ్చాం’ అని మసీదును చుసుకుంటున్న గౌతమ్‌‌ అన్నారు. మసీదును ఎవరు, ఎప్పుడు కట్టారో తెలియదని, శుభ కార్యక్రమాలు జరిగితే ఊరి వాళ్లు తప్పకుండా మసీదుకు వచ్చి వెళ్తారని చెప్పారు. ‘రోజూ పొద్దున, సాయంత్రం మసీదును శుభ్రం చేస్తారు. సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడి వచ్చి ప్రార్థన చేస్తుంటారు’ అని గ్రామ పూజారి జానకీ పండిట్‌ చెప్పారు.

 

Latest Updates