జెట్ ఎయిర్ వేస్ కొనుగోలుపై హిందూజా కఠిన షరతులు

hinduja-group-confirms-evaluating-options-for-jet-airways-stake

వెలుగు, బిజినెస్ డెస్క్ :జెట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. ఓ వైపు ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌ను కొనేవారే కరువవుతుండగా.. మరోవైపు ముందుకొచ్చే ఇన్వెస్టర్లు కూడా కండిషన్ల మీద కండిషన్లు పెడుతూ ఉన్నారు. తాజాగా జెట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌ను కొనేందుకు ఆసక్తి చూపిన హిందూజా గ్రూప్‌‌‌‌, ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌లో ఎలాంటి పెట్టుబడులు పెట్టాలన్నా తమ కఠిన షరతులను ఒప్పుకోవాల్సిందేనని చెబుతోంది. ఈ షరతులను జెట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్ బ్యాంకర్లు ఒప్పుకునేలా కనిపించడం లేదు. దీంతో ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ భవిష్యత్తు మరోసారి ప్రశ్నార్థకంగా మారనుంది. జెట్‌‌‌‌కున్న రుణాల్లో బ్యాంకర్లు 80 శాతం తగ్గించాలని హిందూజా గ్రూప్ కోరుతోందని ఈ విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తులు చెప్పారు.

జెట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌ బ్యాంకర్లకు సుమారు రూ.10 వేల కోట్ల మేర బకాయి పడింది. అంతేకాక జెట్‌‌‌‌ లో మైనార్టీ వాటాలను పొందేందుకు మాత్రమే హిందూజా గ్రూప్ ఆసక్తి చూపుతోంది. మెజార్టీ పార్టనర్‌‌‌‌‌‌‌‌గా ఉండాలనే ఉద్దేశ్యంలో హిందూజా గ్రూప్ లేదని సంబంధిత వర్గాలు చెప్పాయి. హిందూజా గ్రూప్  ఈ విషయాలపై బ్యాంక్‌‌‌‌లు, ఎతిహాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్ పీజేఎస్‌‌‌‌సీతో చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, వీటికి ఆమోదం పడటం కష్టమేనని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ విషయంపై హిందూజా గ్రూప్‌‌‌‌కు, లెండర్ల కన్సార్షియం ఎస్‌‌‌‌బీఐకి ఈమెయిల్స్‌‌‌‌ పంపగా.. ఇప్పటి వరకు స్పందించలేదు.

ఈ నెల ప్రారంభంలోనే జెట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్ బిడ్డింగ్ ప్రాసెస్ ముగిసింది. సీరియస్ బిడ్డర్లు ఎవరూ  బిడ్లు దాఖలు చేయలేదు. పార్టనర్ ఎతిహాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్ మాత్రమే జెట్‌‌‌‌లో ఉన్న 24 శాతం ఈక్విటీ వాటాలను అలానే ఉంచుకుంటున్నానని తెలుపుతూ బిడ్ దాఖలు చేసింది. దీంతో మెజార్టీ ఇన్వెస్టర్ కోసం వెతకడం మళ్లీ ఎస్‌‌‌‌బీఐ  ప్రారంభించింది. హిందూజా గ్రూప్‌‌‌‌కు ప్రస్తుతం ఇండియాలో ఆటోమొబైల్స్ నుంచి ఫైనాన్సియల్ సర్వీసెస్ వరకు వ్యాపారాలున్నాయి. హిందూజా గ్రూప్‌‌‌‌తో జరుగుతోన్న చర్చలతో ఎస్‌‌‌‌బీఐ అంత ఉత్సాహంగా లేదని, అది పెట్టే కండిషన్లకు అంగీకరించేలా కనిపించడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ.10 వేల కోట్ల రుణంలో 80 శాతం హెయిర్‌‌‌‌‌‌‌‌కట్ చేయాలనడం బ్యాంక్‌‌‌‌లపై గణనీయమైన ప్రభావం చూపుతుందని ఈ విషయం తెలిసిన ఒకరు చెప్పారు. జెట్‌‌‌‌కు ఇచ్చిన రుణాల్లో ఎక్కువగా ఎస్‌‌‌‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌‌‌‌లవే ఉన్నాయి. ఈ బ్యాంక్‌‌‌‌లు చెరో రూ.2 వేల కోట్ల రుణమిచ్చాయి. ఒకవేళ హిందూజా గ్రూప్ మైనార్టీ వాటాలనే కొంటే, మరో ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌ను వెతకడం బ్యాంక్‌‌‌‌లకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారనుంది. జెట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌పై  హిందూజా గ్రూప్ చూపించే ఆసక్తి విషయంలో బ్యాంక్‌‌‌‌లకు వచ్చే వారం కల్లా క్లియర్ ఐడియా వస్తుందని తెలుస్తోంది.

హిందూజా గ్రూప్‌‌‌‌తో చర్చలు విఫలమైతే…

ఒకవేళ హిందూజా గ్రూప్‌‌‌‌తో జరుగుతోన్న చర్చలు విఫలమైతే, బ్యాంక్‌‌‌‌లు జెట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌ను ఇక తప్పనిసరి పరిస్థితుల్లో దివాలా కోడ్ కింద  లిక్విడేషన్ ప్రాసెస్ కోసం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌‌‌‌ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుందని ఈ విషయం తెలిసిన ఒకరు చెప్పారు. జెట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌ పునరుద్ధరణకు మరో ముగ్గురు నుంచి కూడా ఆసక్తి వచ్చింది. వారు లండన్‌‌‌‌కు చెందిన వ్యాపారవేత్త  జాన్సన్ అన్‌‌‌‌స్వోర్త్‌‌‌‌, ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ దిగ్గజం అడీగ్రూప్, జెట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్ ఎంప్లాయీ అసోసియేషన్‌‌‌‌. వీరి బిడ్స్‌‌‌‌ను లెండర్లు ప్రస్తుతం అంత సీరియస్‌‌‌‌గా పరిగణలోకి తీసుకోవడం లేదని తెలిసింది. ఏప్రిల్ 17న జెట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్ కార్యకలాపాలు మూతపడిన సంగతి తెలిసిందే. తదుపరి నోటీసు వచ్చే వరకు జెట్‌‌‌‌కు చెందిన అన్ని విమాన సర్వీసులు రద్దు చేశామని ప్రకటించింది. జెట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్ స్లాట్స్‌‌‌‌ను కూడా ప్రభుత్వం తాత్కాలికంగా ఇతర ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌కు కేటాయించింది.

Latest Updates