మన చరిత్ర మళ్లీ రాయాల్నా!

మనం చదువుకున్న మన దేశ చరిత్ర కరెక్టేనా? మన పుస్తకాల్లో ఉన్న చరిత్ర పాఠాలు అన్ని విషయాలను పూర్తిగా చెప్పలేదా? రామాయణ, మహాభారతాలను పురాణాలుగా మాత్రమే ఎందుకు చూడాలి? వాటిలో చరిత్ర దాక్కుని లేదా? అది మనందరికీ తెలియనక్కరలేదా? మన గురించి, మనవాళ్ల గురించి, మన గొప్పతనం గురించి తెలుసుకునేది మరెప్పుడు? భారత జాతి చరిత్ర పూర్తిగా చదవగలిగే రోజెప్పుడు?

తారీఖులు, దస్తావేజులు ఇవి కావోయ్ చరిత్రకర్థం, ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు!’ అన్నారు శ్రీశ్రీ. ఇదే మాటని ఆరెస్సెస్​ వర్గాలుకూడా అంటున్నాయి. విజేతలు రాసిన చరిత్రలతో మరుగునపడిపోయిన వాస్తవాలను వెలికితీయాలని బీజేపీ ప్రెసిడెంట్ అమిత్​ షా ఈ తేనెతుట్టెను కదిలించే ప్రయత్నం చేశారు. పరీక్షలకు తట్టుకుని నిలబడగలిగే రుజువులతో కూడిన ఇండియన్​ హిస్టరీని తిరగ రాయాలన్నారు. ‘బ్రిటిషర్లు రాయించిన కరికులమ్​నే నిజం అనుకుంటున్నామని హిస్టారియన్లు అంటున్నారు.

చరిత్రలో అనేకానేక యుద్ధాల తర్వాత సామ్రాజ్యాలు ఏర్పాటుచేసుకున్నవాళ్లు తమ తమ వీరగాధల్ని ప్రచారంలోకి తెచ్చారు. ఆ బాధ్యత తీసుకున్నవాళ్లు తమను స్పాన్సర్​ చేసిన రాజులకోసం ఫిక్షన్​ చొప్పించి జనంలోకి వదిలారు. దీనినే ఎన్నో తరాలుగా టెక్ట్స్​ బుక్స్​ల్లో చదువుకుంటున్నామని సామాజికవేత్తలు, చరిత్రకారులు చెబుతున్నారు. విజేతలు రాసిన చరిత్రలతో మరుగునపడిపోయిన వాస్తవాలను వెలికి తీయాలని అడపాదడపా అంటున్నా… దాని జోలికి వెళ్లే సాహసాన్ని ఎవరూ చేయలేదు. అసలు ఇప్పటివరకు యాక్షన్​ ప్లాన్​ అనేదే లేదు. బీజేపీ ప్రెసిడెంట్​, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ఈ తేనెతుట్టెను కదిలించే ప్రయత్నం చేశారు. సత్య ప్రామాణికమైన రుజువులతో కూడిన ఇండియన్​ హిస్టరీని తిరగ రాయాలన్నారు.

తన అభిప్రాయానికి మద్దతుగా ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ‘వీర్​ సావర్కర్​ పట్టించుకోవడంవల్లనే 1857నాటి మొదటి స్వాతంత్ర్య పోరాటం వెలుగు చూసింది. సావర్కర్​ ఆ ఘటన ప్రాముఖ్యతను గుర్తించి ‘క్రాంతి (విప్లవం)’ అన్నారు. లేనట్లయితే దానిని బ్రిటిష్​వాళ్ల కోణంలో ‘తిరుగుబాటు’గా చూసేవాళ్లం. వాస్తవాలతో విభేదించాల్సిన పని లేదు. కానీ, వాటి వెనుకగల నిజం ఏమిటో ఇండియన్​ కోణంలో రాయాలి. ఎంతకాలం మనం బ్రిటిషర్లను తప్పు పడుతూ కాలం గడుపుతాం. మన హిస్టరీని మనమే రాసుకోవడం మన బాధ్యత’ అని అమిత్​ షా అన్నారు.

ఇది కేవలం కాంటెంపరరీ హిస్టరీకి సంబంధించిన అసంతృప్తి మాత్రమే కాదు. పురాణ కాలం నాటి కౌరవ పాండవులు, మధ్య యుగాల నాటి గుప్తులు, మౌర్యులు, మోడరన్​ ఇండియాకి చెందిన చోళులు, పల్లవులు వంటి రాజుల చరిత్రను సైతం సరిగ్గా అర్థం చేసుకునే అవకాశం లేదంటున్నారు హిస్టారియన్లు. పురాణ సాహిత్యాన్ని కేవలం భక్తి, ఆధ్యాత్మిక భావనలతోనే చదవడం, చూడడంవల్ల దానిలోని హిస్టారికల్​ ఎవిడెన్స్​ని గుర్తించలేకపోతున్నామని చెబుతున్నారు. ఇండియన్​ హిస్టరీకి ప్రధాన సోర్స్​ మన ప్రాచీన సాహిత్యమే. ప్రస్తుతం చెలామణీలో ఉన్న హిస్టరీ మొత్తం బయాస్డ్​ (ఏకపక్షం)​గా ఉంటుందని అంటున్నారు. దీనివల్ల కొన్ని కొన్ని విషయాలు బాగా ఎగ్జాగరేట్​ (గోరంత కొండంత) అయ్యాయని చెబుతూ… దీనికి ఉదాహరణగా షేర్​షా సూరిని ప్రస్తావిస్తుంటారు.

షేర్​షా సూరి మొదట్లో మొఘల్​ చక్రవర్తి బాబర్​ దగ్గర కమాండర్​గా పనిచేసి, ఆ తర్వాత 1538లో ససారం (బీహార్) కేపిటల్​గా ‘సూరి డైనాస్టీ’ని ఏర్పాటు చేసుకున్నాడు. అతను పాలించింది ఏడేళ్ల కాలమే. ఆ సమయంలో బాబర్​ కొడుకు హుమాయూన్​ నుంచి ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉండేది. అయితే, దేశంలో జరిగిన అనేక సంస్కరణలు, అభివృద్ధి పనులు షేర్​షా సూరి ఖాతాలో పడ్డాయి.

ఆ మధ్య అమిత్​ షా సూచించింది ఇదే. ఇండియన్​ హిస్టరీ మొత్తం ఏదో ఒక పక్కకు ఒరిగిపోయి బయాస్డ్​గా మారిందన్నది ఆయన అభిప్రాయం. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని రుజువులు, తారీఖులతో సహా లాజికల్​ రీజన్​తో రీరైట్​ చేయాలంటున్నారు. ప్రస్తుతం దేశంలో చెలామణీ అవుతున్న విద్యాబోధన బ్రిటిషర్లు పెట్టిన ఒరవడిలోనే సాగుతోంది.

బ్రిటిష్​ వాళ్లు చాలా పద్ధతిగా ఎంపిక చేసుకున్న (సెలెక్టివ్​ అమ్నేషియా) కరికులమ్​ని రుద్దినట్లుగా 2016లో జరిగిన ఒక సర్వే వెల్లడించింది. వలస పాలన (కాలనైజేషన్​) రోజుల్లో తమకు అనుకూలమైన అంశాలనే పాఠాలుగా చొప్పించారని ఈ సర్వే పేర్కొంది. నిజానికి బ్రిటిషర్ల ఏలుబడి మొత్తం తీవ్రమైన అణచివేత, రేసిజం, హింస, వేధింపులతోనే సాగిందన్నది వాస్తవం. ఈ విషయాల్ని వాళ్లు ఎక్కడా ప్రస్తావించకుండా తమపైకి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అమెరికాలోకూడా ఆఫ్రికన్​ అమెరికన్ల హిస్టరీని బయాస్డ్​గానే రాశారని, దానినే అక్కడి స్కూళ్లలో చదివిస్తారని చరిత్రకారులు అంటున్నారు.

దేశంలో గడచిన ఆరేళ్లుగా బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం నడుస్తున్నందున హిస్టరీని భారతీయ కోణంలో తిరగరాయాలన్న డిమాండ్​ బాగా బలం పుంజుకుంది. గ్రీకు, మొఘల్​, బ్రిటిష్​ పాలకుల విజయాల చాటున రాజా పృథ్వీరాజ్​, ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్​ వంటి స్వదేశీ రాజుల వాస్తవ చరిత్ర కనుమరుగైందని వాదిస్తోంది. టెక్ట్స్​ బుక్కుల్ని తయారు చేసే ఎన్​సీఈఆర్​టీ చాలా క్లాసులకు సంబంధించిన హిస్టరీ పుస్తకాల్లో తుగ్లక్​, మొఘల్​ వంశీయుల పాఠాలు రాయించినట్లు ఆరోపణలున్నాయి.

ఈ రకమైన సామాజిక ప్రమాదాన్ని నివారించాలంటే… ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ హిస్టారికల్​ రీసెర్చ్​ (ఐసీహెచ్​ఆర్),  ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ సోషల్​ సైన్సెస్​ రీసెర్చ్​ (ఐసీఎస్​ఎస్​ఆర్​) వంటివి ఎలాంటి బయాస్​ లేకుండా పరిశోధన చేయగల హిస్టారియన్లకు ఆర్థిక ప్రోత్సాహం కల్పించాలని ఏబీవీపీ ఆర్గనైజింగ్​ సెక్రటరీ సునీల్​ అంబేద్కర్​ సూచించారు. పక్షపాతంతో, వక్రీకరణలతో, కల్పనలతో రాసిన ఇండియన్​ హిస్టరీని రీ–ఎగ్జామిన్​ చేయించాలన్నారు. ఇండియా క్రీస్తు పూర్వపు రోజుల్లోనే నౌకలద్వారా ఓవర్​సీస్​ ట్రేడింగ్​ చేసిందని, ఎన్నో  సముద్ర యుద్ధాలలోకూడా పాల్గొందని గుర్తు చేస్తూ… మన హిస్టరీ పాఠాలలో కులం కట్టుబాట్లవల్ల ఇండియన్లు సముద్ర ప్రయాణం చేసేవారు కాదన్నట్లుగా ఉందని సునీల్​ అంబేద్కర్​ ఆక్షేపించారు. ‘అన్​బయాస్డ్​ పరిశోధనలద్వారా మన నేషనల్​ హీరోస్​ని చరిత్రకెక్కించాలి. మనకున్న చారిత్రక ప్రదేశాలు, ప్రాంతాలను మళ్లీ వెలుగులోకి తీసుకురావాలి’ అని సూచిస్తున్నారాయన. ఇప్పటికే మన పూర్వుల చరిత్రను తారుమారు చేసేశారని హిస్టారియన్లు అంటున్నారు. ఇదిలాగే కొనసాగితే భవిష్య తరాలకు తమపై తమకే కాన్ఫిడెన్స్​ లేని పరిస్థితులు ఎదురవుతాయని ఆందోళన చెందుతున్నారు.

ఉత్తరాపథమే జీటీ రోడ్డు!

షేర్​ షా సూరి తన ఏడేళ్ల పాలనలోనే బెంగాల్​లో ఒక మూలన ఉండే చిట్టగాంగ్​ నుంచి అఫ్ఘానిస్థాన్​లోని కాబూల్​ వరకు గ్రాండ్​ ట్రంక్​ రోడ్డు (జీటీ రోడ్డు)ని వేసినట్లుగా చరిత్రలో రాసుకున్నారు. దీని పొడవు దాదాపుగా 2,580 కిలోమీటర్లు. ఇది పూర్తిగా అవాస్తవమని ఎప్పటినుంచో విమర్శలున్నాయి. ఈ రోడ్డు ప్రస్తావన మహాభారతంలోకూడా ఉందంటున్నారు. అప్పట్లో దీన్ని ‘ఉత్తరాపథ్​’గా వ్యవహరించేవారని, అంగ దేశం (ప్రస్తుత బంగ్లాదేశ్​) నుంచి గాంధార (అఫ్ఘానిస్థాన్​లోని కాందహార్​) వరకు కాశీ, హస్తినాపురం (ఢిల్లీ), పురుష్​పుర్​ (పెషావర్), మద్ర (సియాల్​కోట్​), పాంచాల మీదుగా ఉండేదని మహాభారతంలో ఉన్నట్లు చెబుతున్నారు.

క్రీస్తు పూర్వం మూడో శతాబ్దానికి చెందిన చంద్రగుప్త మౌర్య దీనిని నార్త్​ వెస్ట్రన్​ (వాయవ్య) ఇండియా వరకు పొడిగించాడని మధ్యయుగంపై పరిశోధన చేసినవారు చెబుతున్నారు. షేర్​షా సూరి ఈ పాత ఉత్తరాపథ్​ని బంగ్లాదేశ్​లోని సోనార్​గావ్​ నుంచి తన రాజ్యం (బీహార్​)లోని రోహతస్​ వరకు రీఅలైన్​ చేశాడంటున్నారు. బ్రిటిష్​వాళ్లు ఈ మొత్తం మార్గాన్ని 1833–1860 మధ్య కాలంలో గ్రాండ్​ ట్రంక్​ రోడ్డుగా అభివృద్ధి చేసినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది.

Latest Updates