మళ్లీ విజృంభిస్తున్న టీబీ

  • 2017తో పోలిస్తే 16 శాతం పెరిగిన కేసులు
  • 21.5 లక్షల మందికి క్షయ.. యూపీ టాప్​
  • తెలంగాణలోనూ ఎక్కువవుతున్న కేసులు
  • ఒక్క ఒడిశాలో మాత్రమే తగ్గుదల

మహమ్మారి టీబీ మళ్లీ విజృంభిస్తోంది. క్షయ కేసులు ఏటేటా పెరుగుతున్నయ్​. ఒకప్పుడు కొంత తగ్గిన కేసులు మళ్లీ ఇప్పుడు ఎక్కువవుతున్నాయి. మందులకు బ్యాక్టీరియా లొంగక పోవడం కావొచ్చు, తగ్గిపోయిందనుకున్న జబ్బు తిరిగి రావడం కావొచ్చు.. కారణమేదైనా క్షయ మాత్రం మళ్లీ విజృంభిస్తోంది. బుధవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన టీబీ రిపోర్ట్​ చెబుతున్న విషయమిది. 2017తో పోలిస్తే 2018లో కేసులు 16 శాతం పెరిగాయని నివేదిక తెలిపింది. మొత్తం 21.5 లక్షల కేసులను రివైజ్డ్​ నేషనల్​ ట్యుబర్​క్యులోసిస్​ కంట్రోల్​ ప్రోగ్రామ్​ (ఆర్​ఎన్​టీసీపీ) గుర్తించింది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న టీబీ కేసుల్లో పావు వంతు ఇండియాలోనే ఉన్నాయి. ప్రపంచంలో ఏటా 27 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో 25 శాతం (5.4 లక్షలు) ప్రైవేట్​ రంగంలో నమోదయ్యాయి. అంటే, ప్రైవేట్​ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్న రోగుల లెక్క అది. 2017తో పోలిస్తే ఆ కేసులు 40 శాతం పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 90 శాతం మందికి, అంటే 19.1 లక్షల మందికి ట్రీట్​మెంట్​ చేస్తున్నారు. అందులో 89 శాతం మంది 15 నుంచి 69 ఏళ్ల వయసువారే ఉన్నారు. మన రాష్ట్రం విషయానికొస్తే 2017లో 44,644 కేసులుండగా, పోయిన ఏడాది 52,139 కేసులు నమోదయ్యాయి.

ఉత్తర​ప్రదేశ్​ టాప్​

దేశంలో ఎక్కువగా టీబీ కేసులు ఉత్తర్​ప్రదేశ్​లో నమోదవుతున్నాయి. 4.2 లక్షల కేసులతో (17%) ఆ రాష్ట్రం టాప్​లో ఉంది. లక్షలో 187 మంది ఆ రాష్ట్రంలో టీబీ మహమ్మారి బారిన పడ్డారు. 2017, 2018 మధ్య హర్యానాలోనూ కేసులు భారీగా పెరిగాయి. రాజస్థాన్​, ఢిల్లీల్లోనూ కేసులు ఎక్కువయ్యాయి. అయితే, ఒడిశాలో మాత్రం కేసులు తగ్గుముఖం పట్టాయి. 67 వేల నుంచి 50,244కు టీబీ కేసులు తగ్గాయి. కేసుల సంఖ్య దాదాపు 25 శాతం తగ్గింది. రాష్ట్రాల్లో ఒక్క ఒడిశాలో మాత్రమే టీబీ కేసులు తగ్గడం గమనార్హం. కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్షద్వీప్​, అండమాన్​ నికోబార్​ దీవుల్లోనూ అప్పటితో పోలిస్తే రోగం తగ్గుముఖం పట్టింది. కేంద్రపాలిత ప్రాంతాల లెక్కలను తీసుకుంటే ఢిల్లీ, చండీగఢ్​లలో టీబీ రోగులు ఎక్కువగా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో లక్ష జనాభాకు 417, 468 మందికి టీబీ ఉంది. అంత ఎక్కువగా ఉండడానికీ కారణముందని రిపోర్ట్​ తెలిపింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు అక్కడ ఉంటున్నారని, దాని వల్ల ఆ లెక్క ఎక్కువగా ఉందని చెప్పింది.

హెచ్​ఐవీ ఉన్నవారికి మరింత ముప్పు

టీబీ వల్ల చనిపోతున్న వాళ్లలో ఎక్కువగా హెచ్​ఐవీ బాధితులే ఉన్నారు. దాని వల్ల బ్యాక్టీరియా లొంగక ఇన్​ఫెక్షన్​ మరింత పెరుగుతోందని రిపోర్ట్​ పేర్కొంది. ఏటా టీబీ, హెచ్​ఐవీ రెండు ఇన్​ఫెక్షన్లున్నవారు 86 వేల మంది ఉంటున్నారని రిపోర్ట్​ చెప్పింది. ఆ గ్రూపులోని వాళ్లే ఎక్కువగా చనిపోతున్నారని, ఏటా టీబీ వల్ల చనిపోతున్న హెచ్​ఐవీ బాధితులు 11 వేల మంది ఉంటున్నారని తెలిపింది. ప్రపంచంలో హెచ్​ఐవీ కేసులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో ఇండియా మూడో స్థానంలో ఉందని రిపోర్ట్​ పేర్కొంది. హెచ్​ఐవీ వచ్చిన వాళ్లకు టీబీ వచ్చే ముప్పు 21 రెట్లు ఎక్కువని చెప్పింది. 25 శాతం హెచ్​ఐవీ బాధితుల మరణాలు టీబీ వల్లేనని తెలిపింది

Latest Updates