రెండేళ్ళ చిన్నారికి HIV రక్తం ఎక్కించారు

తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. రెండేళ్ళ చిన్నారికి HIV రక్తాన్ని ఎక్కించారు. ఇటీవల రాష్ట్రంలోని సాత్తూరుకు చెందిన ఓ గర్భిణీకి HIV రక్తం ఎక్కించిన  విషయాన్ని మర్చి పోక ముందే అలాంటి ఘటనే మరొకటి రాష్ట్రంలో జరిగింది. ఈ ఘటన కోయంబత్తూరులో జరిగింది. జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తం ఎక్కించిన రెండేళ్ళ చిన్నారికి HIV సోకినట్టు నిర్ధారణ కావడంతో స్థానికంగా కలకలం రేగింది.

కోవైకు చెందిన దంపతులకు 2017, ఫిబ్రవరి 6వ తేదీన తిరుచ్చి ఆస్పత్రిలో ఆడ, మగ కవలలు జన్మించారు. ఆ శిశువుల బరువు తక్కువగా ఉండటంతో 38 రోజుల ఇంక్యుబేటర్‌లో ఉంచి చికిత్స అందించారు. ఇందులో చిన్నారి 7వందల గ్రాములు మాత్రమే ఉంది.  అయితే 2018, జూలై 12వ తేదీన వారికి తీవ్రంగా దగ్గు, జలుబు రావడంతో తిరుప్పూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.

అక్కడ ఆ బాలిక ఆరోగ్యం విషమంగా ఉండటంతో కోయంబత్తూరు ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి రక్తం ఎక్కించాలని డాక్టర్లు సిఫార్సు చేశారు. దీంతో ఆ చిన్నారికి డాక్టర్లు రక్తం ఎక్కించారు. పైగా గుండెలో రంధ్రం ఉందని తేల్చారు. ఇంతలో ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకులోనైంది. దీంతో ఆ చిన్నారికి మళ్లీ రక్త పరీక్షలు చేయగా… చిన్నారికి  HIV సోకినట్టు డాక్టర్లు స్పష్టం చేశారు.

అదే విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు తెలిపారు డాక్టర్లు. తమకు HIV లేదనీ… తమ బిడ్డకు అది ఎలా సోకిందని ప్రశ్నించారు. దీనిపై కోవై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన  కోవై ఆస్పత్రి డీన్… ఆ చిన్నారికి రక్తం ఎక్కించింది తమ డాక్టర్లేనని..అయితే  అంతకుముందు ఆ చిన్నారికి ఎక్కడెక్కడ రక్తం ఎక్కించారో విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest Updates