ఎయిడ్స్‌ పేషెంట్‌ కరోనాను జయించాడు!

అహ్మదాబాద్: అతను హెచ్ఐవీ (ఎయిడ్స్‌) పాజిటివ్ పేషెంట్. తీవ్రమైన ఎనీమియా సమస్య కూడా ఉంది. ఆరోగ్యంగా ఉన్నోళ్లకు ఒక డెసీలీటరు రక్తంలో హీమోగ్లోబిన్ 13.5 నుంచి 17.5 గ్రాములు ఉంటుంది. కానీ అతనికి జస్ట్ 2.3 గ్రాముల హీమోగ్లోబినే ఉంది. అందుకే బ్లడ్ సెల్స్ కు ఇనుము అందడం తగ్గిపోయింది. ఇవి చాలవన్నట్లు ఇటీవల కరోనా మహమ్మారి కూడా పట్టుకుంది. ఇక అయిపోయింది.. అతను బతకడం అసాధ్యం అనుకున్నారందరూ. కానీ.. అతను కరోనాను జయించాడు! వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని సోమవారం సంతోషంగా తిరిగి సొంతూళ్లో అడుగుపెట్టాడు. మెడికల్ ఫీల్డ్ లో అరుదైన ఈ సంఘటన గుజరాత్‌లో జరిగింది. అహ్మదాబాద్‌లోని కుమార్ ఖాన్ గ్రామానికి చెందిన 27 ఏళ్ల ఓ ఎయిడ్స్ పేషెంట్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అహ్మదాబాద్ అసర్వాలోని గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఏప్రిల్ 15న అడ్మిట్ అయ్యాడు. ‘‘అతడి కండీషన్ గమనించిన డాక్టర్లు.. 20 రోజుల్లో మూడుసార్లు రక్తం ఎక్కించారు. ఎయిడ్స్ మందులు రెగ్యులర్‌గా ఇస్తూనే కరోనాకు ట్రీట్ మెంట్ చేశారు. క్రమంగా అతడి ఇమ్యూనిటీని పెంచగలిగారు. పేషెంట్ కూడా కాన్ఫిడెన్స్ తో ధైర్యంగా ఉండటంతో కరోనాపై పోరాటంలో అతడు గెలిచాడు” అని జిల్లా డెవలప్‌మెంట్ ఆఫీసర్ అరుణ్ మహేశ్ బాబు వెల్లడించారు. హాస్పిటల్ లో చేరినప్పుడు అతడు బతకడం కష్టమని అనుకున్నామని, కానీ మనోధైర్యమే అతడిని కాపాడిందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం మెడికల్ ఫెసిలిటీస్ బాగా మెరుగయ్యాయని, హెచ్ఐవీ పేషెంట్లూ కరోనా నుంచి బయటపడగలరని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ స్పెషలిస్ట్ డాక్టర్ అతుల్ పటేల్ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కేసులకు రెఫరెన్స్‌గా ఉండేందుకు గాను ఈ పేషెంట్ ఫైల్ ను సమగ్రంగా తయారు చేస్తున్నట్లు హాస్పిటల్ వర్గాలు చెప్పాయి. ఇక ఆ పేషెంట్ సొంతూరోళ్లు చప్పట్లు కొడుతూ, పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలుకుతున్న వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్ అయింది.

Latest Updates