మిలటరీపై హనీట్రాప్ లింక్..పాక్ తో సంబంధాలు

హైదరాబాద్​, వెలుగు: మన మిలటరీపై పాకిస్థాన్​ హనీట్రాప్​ విషయంలో కొత్త విషయం వెలుగు చూసింది. ఆ హనీట్రాప్​ వయా హైదరాబాద్​ నుంచే జరుగుతోందని తేలింది. పాకిస్థాన్​ నుంచి వచ్చే కాల్స్​ను లోకల్​ కాల్స్​గా మార్చి చూపిస్తున్నరు కొందరు వ్యక్తులు. దానికి వాయిస్​ ఓవర్​ ఇంటర్నెట్​ ప్రొటోకాల్​(వీవోఐపీ- విదేశాల నుంచి వచ్చే కాల్స్​ను లోకల్​ కాల్స్​గా మార్చే కాల్​ డైవర్ట్​ చేసేది) సెంటర్​ముసుగులోచేస్తున్నరు. చాంద్రాయణగుట్టలోని ఇస్మాయిల్​ నగర్​లో ఉన్న వీవోఐపీ సెంటర్​పై టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడి చేయడంతో ఇక్కడి నుంచే సైనికులను హనీ ట్రాప్​ చేస్తున్నారన్న సంగతి బయటకొచ్చింది. పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ సెంటర్​ ఓనర్​ పరారవడంతో అతడి భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవలి కాలంలో అమ్మాయిలతో మాట్లాడిస్తూ సైనికులను, ఆర్మీ అధికారులను హనీట్రాప్​ చేస్తున్న ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఫేస్​బుక్​లోనో, ట్విట్టర్​లోనో కామెంట్​తో మాట కలిపే మాయలేడీలు, చనువు పెంచుకుని నేరుగా ఫోన్​లో మాట్లాడేవరకు వెళ్లిపోతున్నారు. కాల్స్​, మెసేజ్​లు, వాట్సాప్​ చాటింగ్​లను అడ్డుపెట్టుకుని అత్యంత సీక్రెట్​గా ఉంచాల్సిన సమాచారాన్ని డిమాండ్​ చేస్తున్నారు. పాకిస్థాన్​ ఐఎస్​ఐ ఆ కాల్స్​ చేయిస్తోందన్న విషయం అప్పటిదాకా తెలియలేదు. ఇప్పుడు లోకల్​ కాల్స్​గా వస్తున్న ఆ ఫోన్లు హైదరాబాద్​ నుంచే వస్తున్నాయని తేలడంతో హనీట్రాప్​లోని కొత్త కోణం బయటపడింది. (మొదటి పేజీ తరువాయి)

మిలటరీలోని పై స్థాయి అధికారుల ఫోన్​ నంబర్లు అత్యంత రహస్యంగా ఉంటాయి. అలాంటిది ఇద్దరు అధికారులకు ఇటీవల తరచూ కొత్త వ్యక్తుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఎవరో తెలుసుకోవాలని తిరిగి వేరే నంబర్లతో ఆ ఫోన్లకు కాల్​ చేశారు. కానీ, అక్కడి నుంచి రెస్పాన్స్​ రాలేదు. దీంతో లోలోపలే దర్యాప్తు చేశారు. చివరికి ఆ ఫోన్లు వస్తున్నది హైదరాబాద్​ నుంచి అని తెలుసుకున్నారు. వాటి సంగతేంటో తేల్చాలని హైదరాబాద్​ పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమాచారంతో మిలటరీ ఇంటెలిజెన్స్​, సిటీ సౌత్​ జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్​ నంబర్లు, ఐపీ అడ్రస్​ ఆధారంగా చాంద్రాయణ గుట్ట పరిధిలోని ఇస్మాయిల్​ నగర్​ నుంచి ఫోన్లు వచ్చినట్టు గుర్తించారు. అయితే, అక్కడికి వెళ్లి దర్యాప్తు చేస్తే, ఆ కాల్స్​ వచ్చింది ఇక్కడి నుంచి కాదు, పాకిస్థాన్​ నుంచి అని తేలింది. అక్కడి నుంచి వచ్చిన ఫోన్​ కాల్స్​ను డైవర్ట్​ చేసి లోకల్​ కాల్స్​గా మార్చారని తేల్చారు. అందుకోసం వీవోఐపీ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించారు. రహస్యంగా ఉండే మిలటరీ అధికారుల వ్యక్తిగత నంబర్లకు ఫోన్లు రావడంతో, టెర్రరిస్టుల కుట్ర కోణంలో పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి కాల్​డైవర్టింగ్​ కేసుల్లో నిందితులుగా ఉన్న ఇమ్రాన్​ ఖాన్​, మహ్మద్​ అక్బర్​ అనే వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. ఆ వీవోఐపీ సెంటర్​ నుంచి భారీగా ఎలక్ట్రానిక్​ పరికరాలు, సిమ్​ కార్డులు, సిమ్​ బాక్సులతో పాటు ల్యాప్​టాప్​ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

పాతబస్తీలో ఎక్కువ

ఇలాంటి వీవోఐపీ సెంటర్లు అక్కడ ఒక్కచోటే కాదు, పాతబస్తీలో చాలా చోట్ల ఉన్నాయి. కాల్​ డైవర్షన్​ ఘటనలూ జరిగాయి. ఈ ఏడాది మే 20న ఫలక్​నుమా పోలీసులు ఇద్దరిని అరెస్ట్​ చేశారు. జహనుమాకు చెందిన మహ్మద్​ అంజద్​ ఖాన్​ (42), యూసుఫ్​ హసన్​ (30)లను అదుపులోకి తీసుకున్నారు. ఆరేళ్లుగా జహనుమాలో వీవోఐపీ సెంటర్​ను నడుపుతున్న అంజద్​ ఖాన్​, అడ్డాను కాలాపత్తర్​కు మార్చాడు. జహనుమాలో ఫ్లాట్​, కాలాపత్తర్​లో పెంట్​హౌస్​ తీసుకుని సెంటర్​ను నడుపుతున్నాడు. స్థానికంగా ఉండే రిటైల్​ వ్యాపారి అయిన యూసుఫ్​ హసన్​ నుంచి 144 సిమ్​కార్డులను కొనుగోలు చేశాడు. ఇంటర్నేషనల్​ కాల్స్​ను లోకల్​ కాల్స్​గా మార్చేందుకు అవసరమైన టెక్నాలజీని, 8 సిమ్​కార్డు బాక్సులను చైనా నుంచి కొన్నాడు. బ్రిటన్​, అమెరికా, సౌదీ నుంచి వచ్చే కాల్స్​ను లోకల్​ కాల్స్​గా మార్చి సొమ్ము చేసుకునేవాడు. అక్కడి నుంచి ఐఎస్​డీ (ఇంటర్నేషనల్​ సబ్​స్క్రైబర్​ డయలింగ్​) కాల్స్​ ఎక్కువగా వెళ్తుండడంతో టెలికాం సెక్యూరిటీ వింగ్​ నిఘా పెట్టింది. ఇక్కడి నుంచి కాల్​ డైవర్షన్​ ఎక్కువగా జరుగుతున్నాయని, లోకల్​ కాల్స్​గా మారుస్తున్నారని గుర్తించిన అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంజద్​ ఖాన్​ వీవోఐపీ సెంటర్​పై దాడులు చేసి ఇద్దరిని అరెస్ట్​ చేశారు.

Latest Updates