హాంకాంగ్‌‌ ఓపెన్‌‌ టోర్నమెంట్‌‌లో సింధుకు చుక్కెదురు

  • క్వార్టర్స్‌ చేరిన కిడాంబి
  • కశ్యప్‌, ప్రణయ్‌, సాత్విక్‌ ఔట్‌

హాంకాంగ్‌‌: వరల్డ్‌‌ చాంపియన్‌‌ పీవీ సింధుకు మరోసారి చుక్కెదురైంది. హాంకాంగ్‌‌ ఓపెన్‌‌ టోర్నమెంట్‌‌లో తెలుగు షట్లర్‌‌ సెకండ్‌‌ రౌండ్‌‌లోనే నిష్క్రమించింది. పారుపల్లి కశ్యప్‌‌, హెచ్‌‌ఎస్‌‌ ప్రణయ్‌‌, సౌరభ్‌‌ వర్మ, మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌లో సాత్విక్‌‌ సాయిరాజ్‌‌–అశ్విని పొన్నప్ప జంట కూడా ఇంటిదారి పట్టగా.. స్టార్‌‌ ప్లేయర్‌‌ కిడాంబి శ్రీకాంత్‌‌ ఒక్కడే ముందంజ వేశాడు. ఏడు నెలల తర్వాత ఓ టోర్నీలో క్వార్టర్‌‌ఫైనల్‌‌ చేరిన మాజీ నంబర్‌‌ వన్‌‌ శ్రీకాంత్‌‌ ఇండియా నుంచి రేసులో నిలిచాడు.

చైనా, కొరియా, డెన్మార్క్‌‌ ఓపెన్లలో ఆరంభ రౌండ్లలోనే వెనుదిరిగిన సింధు ఈ సారి కూడా నిరాశ పరిచింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లో ఆరో ర్యాంకర్‌‌ సింధు 18–21, 21–11, 16–21తో 18వ ర్యాంకర్‌‌ బుసానన్‌‌ (థాయ్‌‌లాండ్‌‌) చేతిలో 69 నిమిషాల పాటు పోరాడి ఓడిపోయింది. బుసానన్‌‌తో ఆడిన 11 మ్యాచ్‌‌ల్లో తెలుగు షట్లర్‌‌కు ఇదే తొలి పరాజయం కావడం గమనార్హం.

అంతకుముందు  పురుషుల సింగిల్స్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లో శ్రీకాంత్‌‌ 21–11, 15–21, 21–19తో ఇండియాకే చెందిన యువ ప్లేయర్‌‌ సౌరభ్‌‌ వర్మపై పోరాడి గెలిచాడు. టాప్‌‌ సీడ్‌‌ కెంటా మొమోటా టోర్నీ నుంచి వైదొలగడంతో  ఫస్ట్‌‌ రౌండ్‌‌లో వాకోవర్‌‌తో నేరుగా సెకండ్‌‌ రౌండ్‌‌లో అడుగుపెట్టిన కిడాంబి తొలి గేమ్‌‌ ఈజీగానే గెలిచాడు. కానీ, అనూహ్యంగా పుంజుకున్న సౌరభ్‌‌ తర్వాతి గేమ్‌‌లో నెగ్గి మ్యాచ్‌‌లో నిలిచాడు. మూడో గేమ్‌‌లోనూ పోటాపోటీగా ఆడి తన సీనియర్‌‌కు షాకిచ్చేలా కనిపించాడు. కానీ, కీలక దశలో మెరుగ్గా ఆడిన శ్రీకాంత్‌‌ మ్యాచ్‌‌ గెలిచాడు. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌‌లో ఐదో సీడ్‌‌ చెన్‌‌ లాంగ్‌‌ (చైనా)తో సవాల్‌‌కు రెడీ అయ్యాడు.  అయితే, కామన్వెల్త్‌‌ మాజీ చాంపియన్‌‌ కశ్యప్‌‌, హెచ్‌‌ఎస్‌‌ ప్రణయ్‌‌ ప్రిక్వార్టర్స్‌‌ దాటలేకపోయారు. కశ్యప్‌‌ 21–12, 21–23, 10–21తో  ప్రపంచ రెండో ర్యాంకర్‌‌ చౌ టైన్‌‌ చెన్‌‌ (తైపీ) చేతిలో మూడు గేమ్‌‌ పాటు పోరాడి ఓడిపోయాడు. ఆరో సీడ్‌‌ జొనాథన్‌‌ క్రిస్టీ (ఇండోనేసియా) 21–12, 21–19తో  ప్రణయ్‌‌ను వరుస గేమ్స్‌‌లో చిత్తు చేశాడు. మిక్స్‌‌డ్‌‌లో సాత్విక్‌‌ సాయిరాజ్‌‌–అశ్విని జోడీ 19–21, 12–21తో జపాన్‌‌కు చెందిన నాలుగో సీడ్‌‌ అరిసా హిగషినో–యుతా వటానబే  చేతిలో ఓడిపోయింది.

Latest Updates