ఇక విక్రమ్ పై ఆశల్లేనట్లేనా: చంద్రుడిపై చీకటి

ఆశలన్నీ సెలీన్​పైనే.. చంద్రయాన్​3కి మరోపేరు

జపాన్​ జాక్సాతో కలిసి 2025లో ప్రయోగం

ల్యాండర్​, రోవర్​లలో చీకట్లను తట్టుకునే ఆర్​హెచ్​యూ టెక్నాలజీ

విక్రమ్​పై నల్లటి నీడలు కమ్మేసే టైం వచ్చేసింది. చందమామను చీకటి ఆవహించేసింది. గురువారంతో సూర్యుడు వెళ్లిపోయాడు. టెంపరేచర్లు జీరోను దాటి మైనస్​లోకి వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే చంద్రయాన్​ 2 ల్యాండర్​ను లైన్​లోకి తెచ్చేందుకు ఇస్రో శతవిధాలా ప్రయత్నించింది. అయినా అవేవీ ఫలించలేదు. ఇప్పుడు ప్రయత్నించినా ఫలిస్తుందన్న ఆశా లేదు. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టు జరిగి విక్రమ్​ కరెక్ట్​గా ల్యాండ్​ అయినా ఇప్పటితో అది పనిచేసే టైం అయిపోయేదే. కారణమేందో తెలిసిందే. 14 రోజులకే విక్రమ్​ను, రోవర్​ ప్రజ్ఞాన్​ను డిజైన్​ చేశారు. సక్సెస్​ఫుల్​గా జరిగిన అపోలో మిషన్లూ చందమామ చీకటిని తట్టుకుని నిలబడ లేకపోయాయి. చైనా పంపిన చాంగీ మిషన్​ది మాత్రం కొంచెం గట్టిగా నిలబడింది. దానికి కారణం అందులో వాడిన రేడియో యాక్టివ్​ హీటర్​ యూనిట్లే. వాటి వల్లే చంద్రుడిపై చీకటి వచ్చినా అది ఇన్ని రోజులు ఉండగలుగుతోంది. దానికన్నా ముందు 1970లో సోవియట్​ పంపిన లూనోఖోడ్స్​ చందమామపై చీకటిని తట్టుకుని నిలబడింది.

విక్రమ్​ పరిస్థితేంటి?

విక్రమ్​ సాఫ్ట్​ ల్యాండింగ్​ కాకపోయినా చంద్రయాన్​2 ప్రయోగం 100 శాతం సక్సెసేనని ఇస్రో చైర్మన్​ కే శివన్​ చాలా సందర్భాల్లో చెప్పారు. దానికి కారణం ఆర్బిటర్​. అవును, అసలైన ప్రయోగాలు అదే చేస్తుందని ఇటీవలి ఓ ఇంటర్వ్యూలోనూ శివన్​ చెప్పారు. ఏడున్నరేళ్లపాటు సేవలందిస్తుందన్నారు. దాన్ని పక్కనపెడితే, చంద్రుడిపై చీకటి వచ్చేసిన నేపథ్యంలో విక్రమ్​పై ఆశలు వదిలేసుకోవాల్సిందే. మరి, ఇస్రో, కోట్లాది మంది ఇండియన్ల ఆశలు దేనిపై పెట్టుకోవాలి? అదే సెలీన్​– ఆర్​! అవును, చంద్రయాన్​3కి మరోపేరే సెలీన్​– ఆర్​. జపాన్​ స్పేస్​ ఏజెన్సీ జాక్సా సహకారంతో ఇస్రో ఈ ప్రయోగం చేయబోతోంది. 2025లో చంద్రుడి ధ్రువాల వద్దకు పంపి, శాంపిళ్లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ ప్రయోగానికి సంబంధించి 2008లోనే ప్రకటన వచ్చినా, దానికి సంబంధించిన చర్చలు ఈమధ్యే జరిగాయి. ఈ ప్రయోగంలో ల్యాండర్​, రోవర్లు చందమామ చీకట్లలోనూ పనిచేసేలా చైనా వాడినట్టే ఆర్​హెచ్​యూలను వాడనున్నారు.

సమస్యలు.. పరిష్కారాలు

నిజానికి ఆర్​హెచ్​యూలను ల్యాండర్​, రోవర్లలో వాడడం అంత తేలికేం కాదు. ఇప్పటిదాకా వాటిని వాడిన అనుభవమూ లేదు. ఆర్​హెచ్​యూలకు కరెంట్​ వనరు న్యూక్లియర్​ పవరే. వాటి నుంచి వచ్చే అణుధార్మికత, స్పేస్​క్రాఫ్ట్​ ఎలక్ట్రానిక్​లపై ప్రభావం చూపే ప్రమాదముంటుంది. దానికి పరిష్కారాలు లేవా అంటే, ఉన్నాయనే అంటున్నారు కొందరు. గత ఏడాది ‘సర్వైవ్​ అండ్​ ఆపరేట్​ త్రూ ద లూనార్​ నైట్​’పై వర్క్​షాప్​ నిర్వహించారు. అందులో ఇస్రో సహా పలు స్పేస్​ ఏజెన్సీలు పాల్గొన్నాయి. అందులో కొన్ని పరిష్కారాలు చూపించాయి. ఇస్రో కూడా ఓ ప్రత్యామ్నాయ పద్ధతిని అందులో డెమాన్​స్ట్రేట్​ చేసింది. సిములేషన్​ సెటప్​ వేసి ‘లిథియం అయాన్​ బ్యాటరీ’లతో ల్యాండర్​, రోవర్లను పనిచేయించే పద్ధతిని చూపించింది. అది కాకుండా చందమామ నేలలో ఉండే వేడిని వాడుకునే థర్మల్​ వాడీలనూ సైంటిస్టులు ప్రతిపాదించారు. అయితే, అది కేవలం తేలికపాటి రోవర్లకు మాత్రమే సరిపోతుందని సైంటిస్టులు చెబుతున్నారు. పెద్ద వాటికి పనిచేయదంటున్నారు.

ఆర్బిటర్​ మంచిగుంది

విక్రమ్​పై ఆశలు సన్నగిల్లిపోతున్న టైంలో చంద్రయాన్​2పై ఇస్రో తాజా ప్రకటన చేసింది. ప్రస్తుతం కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్​ బాగా పనిచేస్తోందని తెలిపింది. అందులోని అన్ని పేలోడ్లు ఆరోగ్యంగా ఉన్నాయని,  పేలోడ్ల ట్రయల్స్​ సక్సెస్​ అయ్యాయని చెప్పింది. చేయాల్సిన అన్ని సైన్స్​ ఎక్స్​పరిమెంట్లను ఆర్బిటర్​ చేస్తుందని వెల్లడించింది. ల్యాండర్​ విక్రమ్​తో కమ్యూనికేషన్​ కట్​ అవడానికి గల కారణాలను ఇస్రో నిపుణులు, విద్యావేత్తలు కలిగిన జాతీయ స్థాయి కమిటీ విశ్లేషిస్తోందని చెప్పింది.

విక్రమ్​ ఫొటోలు తీసిన నాసా ఆర్బిటర్​

నాసా ఆర్బిటర్​ లూనార్​ రికనైసెన్స్​ ఆర్బిటర్​ (ఎల్​ఆర్​వో) విక్రమ్​ ఫొటోలు తీసిందని, వాటిని నాసా పరిశీలిస్తోందని ఎల్​ఆర్​వో డిప్యూటీ ప్రాజెక్ట్​ సైంటిస్ట్​ జాన్​ కెల్లర్​ చెప్పారు. నాసా ప్రకటనను ఆయన ధ్రువీకరించారు. ‘‘ఎల్​ఆర్​వోసీ టీం విక్రమ్​ ల్యాండింగ్​ సైట్​ ఫొటోలను పరిశీలిస్తుంది. అంతకుముందు వాటితో పోల్చి విక్రమ్​ కనిపిస్తోందో లేదో తేలుస్తుంది. విక్రమ్​ నీడలనూ పసిగడుతుంది” అని చెప్పారు. ఆర్బిటర్​ అక్కడి నుంచి వెళ్లినప్పుడు అప్పుడప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నాయని చెప్పారు. దాని వల్ల చాలా ప్రాంతం చీకట్లో ఉందన్నారు. త్వరలోనే ఆ ఫొటోలను విడుదల చేసే అవకాశముందని చెబుతున్నారు.

Latest Updates