కరువులో ఉలవలు బెస్ట్

సాగుకు ఆగస్టు అనుకూలం 

85-90 రోజుల్లో పంట దిగుబడి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలో వానాకాలం పంట సాగు ఆలస్యమైంది. దీంతో వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు వేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సెంట్రల్​ రీసెర్చ్​ ఇన్‌‌‌‌స్టిట్యూట్​ ఫర్​ డ్రైలాండ్​ అగ్రికల్చర్​(క్రిడా) శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తక్కువ నీటి వినియోగంతో వాతావరణాన్ని తట్టుకుని మెట్ట ప్రాంతాల్లో  అన్ని రకాల నేలల్లో పండించే అనువైన పంటగా ఉలవలను గుర్తించినట్లు చెబుతున్నారు. దీన్ని ఆగస్టు నుంచి సాగు చేసుకునే అవకాశం కూడా ఉంది. కరువు పరిస్థితుల్లో గ్రామీణ చిన్న, సన్నకారు రైతుల ఆహార భద్రతకు అనుకూలంగా ఉంటుంది. కర్ణాటక, ఏపీ, ఒడిషా, తమిళనాడు, ఎంపీ, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌‌‌‌, ఉత్తరాంచల్‌‌‌‌, హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌లలో ఉలవులు పండిస్తారు.

తక్కువ రోజుల్లో దిగుబడి

ఈ పంట కేవలం 85 నుంచి 90 రోజుల్లోనే చేతికి వస్తుంది. సాంప్రదాయ సాగులో హెక్టారుకు 4 నుంచి 5 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. క్రిడా రూపొందించిన  ఉలవల రకాలు హెక్టార్‌‌‌‌కు దిగుబడి 10 నుంచి 12 క్వింటాళ్లు వస్తుంది. వర్షాధార పంటగా పేరున్న ఉలువలు, నీటి వసతి లేక పోయినా రాత్రుల్లో కురిసే మంచు తేమతో  కూడా పండే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఔషధ గుణాలు మెండు

ఉలవల్లో 28 శాతం ప్రొటీన్లు ఉంటాయి. అనేక వ్యాధి నిరోధక ఔషధ గుణాలు ఉన్నాయి. మూత్ర పిండాలు, పిత్తాశయం సంబంధ వ్యాధుల నివారణకు ఉపయోగ పడతాయి. రాత్రులు నీటిలో నానబెట్టి ఉదయం తాగితే మూత్ర పిండాల్లో రాళ్లు కరిగిపోతాయని  నిపుణులు చెబుతున్నారు. గాలిలోని నైట్రోజన్‌‌‌‌ను ఉలువ మొక్క గ్రహించి, వేళ్లలో నైట్రోజన్‌‌‌‌ను నిక్షిప్తం చేసుకుంటుంది.  దిగుబడి వచ్చాక హార్వెస్ట్‌‌‌‌ చేసి ఉలవ మొక్కలను తిరిగి నేలలో కలిపి  పచ్చిరొట్టగా దున్నిస్తే భూమిలో నెట్రోజన్‌‌‌‌ శాతం పెరిగి భూమి సారవంతమవుతుందని  వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 

Latest Updates