బిల్లు కట్టలేదని కరోనా వారియర్‌‌ను నిర్బంధించిన ఆస్పత్రి సిబ్బంది

హైదరాబాద్: బిల్లు చెల్లించలేదని ఓ పేషెంట్‌ను ఆస్పత్రి సిబ్బంది నిర్బంధించిన ఘటన హైదరాబాద్‌లోని చాదర్‌‌ఘాట్‌లో జరిగగింది. బిల్లు కట్టలేదని పేషెంట్‌ను చాదర్‌‌ఘాట్‌లోని తుంబే ఆస్పత్రి సిబ్బంది నిర్బంధించారు. బాధితురాలు సెల్ఫీ వీడియో తీయడంతో ఆస్పత్రి నిర్వాకం బయటపడింది. వివరాల ప్రకారం.. ఫీవర్ ఆస్పత్రి డీఎంవో డా.సుల్తానా అనారోగ్యంతో తుంబే హాస్పిటల్‌లో చేరారు. ఆమెకు ఒక్క రోజు ట్రీట్‌మెంట్‌కు గాను రూ.1.15 లక్షలు చెల్లించాలని బిల్లు వేశారు. దీనిపై ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నిస్తే సుల్తానాను వారు నిర్బంధించారు.

బిల్లు చెల్లిస్తేనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తామని భయపెట్టారు. దీంతో బాధితురాలు తన ఆవేదనను తెలియజేస్తూ సెల్ఫీ వీడియోను తీసింది. ఈ వీడియోను ఎంబీటీ ప్రెసిడెంట్ అమ్జదుల్లా ఖాన్ ట్వీట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ట్వీట్‌లో ‘కరోనా వారియర్‌‌ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల సంగతేంటని’ ప్రశ్నిస్తూ మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్‌‌తోపాటు డీజీపీని అమ్జదుల్లా ట్యాగ్ చేశారు.

Latest Updates