రూ.180 బిల్లు చెల్లించలేదని కస్టమర్ ను కొట్టి చంపిన యజమాని

భడోహి: ఉత్తర ప్రదేశ్‌లోని భడోహి జిల్లాలో దారుణం జరిగింది. హోటల్ బిల్లు చెల్లించే వివాదంలో హోటల్ యజమాని, వెయిటర్లు కలసి  ఓ కస్టమర్ ను కొట్టి చంపారు. ఈ సంఘటన బుధవారం మహారాజ్‌గంజ్ సమీపంలోని సర్దార్ ధాభాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  సూరజ్ సింగ్ (25), విశాల్ దుబే అనే ఇద్దరు వ్యక్తులు ధాభాలో లంచ్ చేసేందుకు వచ్చారు. భోజనం అయిన తర్వాత హోటల్ బిల్లు రూ.180 చెల్లించే విషయంలో ధాభా యజమాని గుర్మీల్ సింగ్ తో గొడవపడ్డారు. వారి ప్రవర్తనపై కోప్పడ్డ గుర్మీల్ తన వెయిటర్ల చేత కర్రలు, రాడ్లతో దాడి చేయించాడు. ఈ ఘర్షణలో దుబే వారి నుంచి తప్పించుకోగా,  సూరజ్ సింగ్ పట్టుబడి ఆ హోటల్ సిబ్బంది చేతిలో ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనలో హోటల్ యజమాని గుర్మీల్ సింగ్ మరియు అతని కుమారుడు సురేంద్ర సింగ్ అరెస్టయ్యారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) రామ్ బదన్ సింగ్ తెలిపారు.

Latest Updates