అర్ధరాత్రి ఇండ్లు కూల్చేసిన్రు

సిద్దిపేట, వెలుగు: పోలీసుల పహారాలో గ్రామాన్ని చుట్టుముట్టి మహిళలు, పిల్లలనే కనికరం చూపకుండా అర్ధరాత్రి వారిని బయటకు గెంటేసి 30 ఇండ్లను కూల్చివేసిన ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లిలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా సరిహద్దులో 3.5 టీఎంసీల సామర్ధ్యంతో అన్నపూర్ణ‌ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. రిజర్వాయర్ నిర్మా ణంతో చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లి గ్రామం ముంపునకు గురవుతోంది. నిర్వాసితుల కోసం సిద్దిపేట పట్టణ శివార్ల‌లో కాలనీ నిర్మించారు. అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో నిర్వాసితులు ముంపు గ్రామంలోనే ఉంటున్నారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ ప్రారంభానికి రెడీ అవుతుండటంతో అన్నపూర్ణ రిజర్వాయర్ ను పూర్తిస్థాయిలో నింపాలని అధికారులు సంకల్పించారు.

కొచ్చగుట్టపల్లిని ఖాళీ చేయాల్సిందిగా నిర్వాసితులతో కొద్ది రోజులుగా అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. అధికారుల హామీతో 64కుటుంబాలు కొద్ది రోజులు క్రితమే గ్రామాన్ని వీడి వెళ్పోయాయి. మిగిలిన 44 కుటుంబాల్లో 14 కుటుంబాలు స్థానికంగా ఉండటం లేదు. మిగిలిన 30 కుటుంబాలకు చెందినవారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపి సరైన పరిహారం అందించేవరకు గ్రామం నుంచి వారిని తరలించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా అధికారులు వారితో చర్చించగా 24 కుటుంబాలు పరిహారం తీసుకోవడానికి మౌఖికంగా అంగీకారం తెలుపగా మిగిలిన ఆరు కుటుంబాల వారు కోర్టు తీర్పు వచ్చేవరకు తాము గ్రామాన్ని వీడేది లేదని స్పష్టం చేశారు. ఒకవైపు రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేస్తుండగా నిర్వాసితులు గ్రామాన్ని వీడకపోవడంతో అధికారులు ప్రత్యక్ష చర్యలకు దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆదివారం అర్ధ‌రాత్రి 30 ఇండ్లను కూల్చి వేశారు.

అంతా నిద్రపోతున్న సమయంలో..

దాదాపు 200 మంది పోలీసులు, 10 డీసీఎం వాహనాలు, ఎనిమిది జేసీబీలు, 50 మంది కూలీలతో అధికారులు అరరాత్రి గ్రామంలోకి ప్రవేశించారు. గ్రామంలో విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. ఇండ్ల తలుపులను జేసీబీలతో ఊడబెరికి ఇంట్లో నిద్రిస్తున్నవారిని బయటకు తీసుకువచ్చారు. వెంట తీసుకొచ్చిన కూలీలతో ఇంట్లోని కొంత సామగ్రి, ఇంట్లో నిద్రిస్తున్నవారిని వాహనాల్లోకి ఎక్కించి సిద్దిపేట పట్టణ శివారులోని పునరావాస కాలనీకి తరలించారు. నిర్వాసితులందరిని గంట వ్యవధిలో గ్రామంలోంచి తరలించిన అధికారులు వెంటనే జేసీబీలతో ఇండ్లను కూల్చివేశారు. కేవలం నాలుగు గంటల్లో మొత్తం 30 ఇండ్లను కూల్చి వేసిన అధికారులు తెల్లవారుజామున వెళ్లి పోయారు. అనంతరం రిజర్వాయర్ లోకి నీటిని పంపించడంతో కూల్చిన ఇండ్లలో నాలుగు మునిగిపోయాయి. ఇండ్లను కూల్చివేస్తుండగా ఎవరూ అడ్డుకోకుండా పోలీసులను మోహరించడమే కాకుండా గ్రామస్తుల నుంచి సెల్ ఫోన్లు లాక్కుని ఫోటోలు, వీడియోలు తీయకుండా చూశారు. సోమవారం నిర్వాసితులు గ్రామంలోకి
చేరుకుని కూల్చివేసిన ఇండ్లలోంచి తమ సామగ్రిని వెతుక్కుని తీసుకెళ్లారు.

Latest Updates