హైదరాబాద్ ఇండ్లు మస్తు కాస్ట్లీ: 11 శాతం పెరిగిన కిరాయిలు

సిటీలో 9 శాతం పెరిగిన ధరలు
కొత్త ఇళ్ల ప్రాజెక్టుల లాంచస్‌‌కు అతిపెద్ద మార్కెట్
రెం టులు హడలెత్తిస్తున్నాయ్!
నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ వెల్లడి

హైదరాబాద్‌‌లో ఇళ్లు మరింత కాస్ట్‌‌లీ అయ్యాయి. దేశంలో ధరలు పెరిగిన ఏకైక సిటీ మనదేననని నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ వెల్లడించింది. సిటీలో సగటున ఇళ్ల ధరలు 9 శాతం పెరిగినట్టు పేర్కొంది. సప్లయి తక్కువగా ఉండటంతో ఇళ్ల ధరలకు రెక్కలు వచ్చినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది నగరాలు ఢిల్లీ ఎన్‌‌సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్‌‌ల్లో 2019 తొలి ఆరు నెలల కాలంలో రెసిడెన్షియల్, ఆఫీసు డిమాండ్, సప్లయి, ధరలు ఎలా ఉన్నాయనే దానిపై విశ్లేషణ జరిపిన నైట్ ఫ్రాంక్ ‘ఇండియా రియల్ ఎస్టేట్’ అనే రిపోర్ట్‌‌ను విడుదల చేసింది. ఈ రిపోర్ట్‌‌లో హైదరాబాద్‌‌లో కొత్త ఇళ్ల లాంచింగ్స్ 47 శాతం పెరిగి, 5,430 యూనిట్లుగా రికార్డైనట్టు తెలిపింది. ఈ కొత్త లాంచింగ్స్ కూడా ఎక్కువగా రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల ధరల శ్రేణిలోనే ఉన్నట్టు వెల్లడించింది.దీంతో మన హైదరాబాద్‌‌ కొత్త లాంచస్‌‌కు అతిపెద్ద మార్కెట్‌‌గా ఉంటున్నట్టు చెప్పింది.  అయితే సేల్స్ మాత్రం కేవలం 0.3 శాతం మాత్రమే పెరిగినట్టు చెప్పింది. దీంతో మొత్తంగా 2019 తొలి ఆరునెలల్లో 8,334 యూనిట్లు అమ్ముడుపోయినట్టు వెల్లడించింది. అమ్ముడుపోని ఇన్వెంటరీ గతేడాది కంటే ఈ ఏడాది 67 శాతం తగ్గినట్టు చెప్పింది.  నగరంలో 150 నుంచి 200 ప్రాజెక్ట్‌‌లు ఎన్విరాన్‌‌మెంట్ క్లియరెన్స్ కోసం వేచిచూస్తున్నట్టు రిపోర్టు అంచనావేసింది.

పూర్తైన కొత్త ఆఫీసు కట్టడాలు 129 శాతం జంప్…
రెరా అమల్లోకి వచ్చిన తర్వాత నగరంలో కొత్త ఇళ్ల లాంచస్‌‌ పుంజుకున్నాయని తెలిపింది.  మెట్రోరైల్, ఎస్‌‌ఆర్‌‌‌‌డీపీ వంటివి కూడా హైదరాబాద్‌‌లో రెసిడెన్షియల్స్‌‌కు, ఆఫీసు స్పేస్‌‌లకు ఊపు తెచ్చాయని వివరించింది. సిటీలో పూర్తైన కొత్త ఆఫీసు కట్టడాలు ఇయర్ ఆన్ ఇయర్‌‌‌‌కు 129 శాతం పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది.  మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్‌‌రాం గూడ వంటి మైక్రో మార్కెట్లలో వేకెన్సీలు(ఆఫీసు స్పేస్ ఖాళీలు) 2 శాతం నుంచి 3 శాతం తక్కువగా ఉన్నట్టు చెప్పింది.  సిటీలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో 41 శాతం ఐటీ, ఐటీఈఎస్ రంగాల నుంచే వస్తున్నట్టు వివరించింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్ సెక్టార్ నుంచి 4 శాతం, మానుఫాక్చరింగ్ నుంచి 17 శాతం, ఇతర సర్వీసుల నుంచి 39 శాతం రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరుగుతున్నట్టు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది.

మొత్తంగా 4 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు….
ఇక దేశవ్యాప్తంగా 8 మేజర్ సిటీల్లో చూసుకుంటే హౌసింగ్ సేల్స్ కేవలం 4 శాతం మాత్రమే పెరిగి, 1.29 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. కొత్త ఇళ్ల సప్లయి 21 శాతం పెరిగి 1.11 లక్షల యూనిట్లుగా ఉన్నట్టు నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఆఫీస్ స్పేస్ సప్లయి, లావాదేవీల విలువ ఆల్‌‌ టైమ్ హైకు చేరుకున్నట్టు వెల్లడించింది. ఆఫీస్ సప్లయి 31 శాతం పెరుగగా.. లావాదేవీలు 26 శాతం జంప్ చేశాయి. రెసిడెన్షియల్ మార్కెట్‌‌ డిమాండ్‌‌, సప్లయికు ఎన్‌‌బీఎఫ్‌‌సీ సంక్షోభం, జీఎస్టీ, ధరలు, అఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్, రెరా వంటివి కీలకంగా ఉన్నట్టు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది.

11 శాతం పెరిగిన కిరాయిలు..
నగరంలో ఆఫీసు స్పేస్ మార్కెట్‌‌లో కిరాయిలు బాగా పెరుగుతున్నాయని చెప్పింది. 2019 తొలి ఆరు నెలలు ముగిసే నాటికి హైదరాబాద్ ఆఫీసు మార్కెట్ అద్దెలు సగటున నెలకు ఒక్కో చదరపు అడుగుకు రూ.59గా ఉన్నట్టు తెలిపింది. అంతేకాదు, గతేడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు వెల్లడించింది. మైక్రో మార్కెట్స్‌‌ అన్నింటిలోనూ అద్దెలు పెరిగినట్టు వెల్లడించింది. ఎస్‌‌బీడీలోని కొత్తగూడలో అత్యధికంగా ఒక్కో చదరపు అడుగుకు నెలకు రూ.80 పలుకుతున్నట్టు చెప్పింది.

మాదాపూర్, గచ్చిబౌలి, కోకాపేట్, నానక్‌‌రాం గూడ, శేరిలింగపల్లిలలో కూడా  ఒక్కో చదరపు అడుగు నెలకు రూ.75 పలుకుతున్నట్టు తెలిపింది. గ్లోబల్ టెక్నాలజీ సంస్థల నుంచి డిమాండ్ ఎక్కువగా వస్తుండటంతో నగరంలో ఆఫీసు స్పేస్‌‌ మార్కెట్‌‌ బాగా పెరుగుతుందని నైట్ ఫ్రాంక్ హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ శ్యామ్‌‌సన్ ఆర్థర్‌‌ చెప్పారు. సుపీరియర్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్, టాలెంట్ ఎక్కువగా ఉండటం, వ్యాపారాలకు అనుకూలమైన ప్రభుత్వం, అఫర్డబుల్  లైఫ్‌‌స్టయిల్ వంటివి టెక్ దిగ్గజాలు, స్టార్టప్‌‌లకు  హైదరాబాద్‌‌ను ఆకర్షణీయంగా మార్చుతున్నాయని తెలిపారు. ఈ మార్కెట్‌‌లో ఆఫీసు లావాదేవీలు స్థిరంగా పెరగడమే కాకుండా.. డెవలపర్లు ప్రాజెక్ట్‌‌లను కూడా త్వరగా పూర్తి చేస్తున్నారన్నారు.