
- ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ విశ్లేషణ
- ఎన్సీఆర్కు అత్యధికంగా 44 నెలల సమయం
న్యూఢిల్లీ :
టాప్ 7 సిటీల్లో అమ్ముడు పోకుండా మిగిలిపోయిన అపార్టుమెంట్లు, ఇళ్లు ఏదో రకంగా అమ్ముకునేల చేయడానికి సగటున 30 నెలల వరకు సమయం పడుతుందని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ రిపోర్ట్ చేసింది. హైదరాబాద్‌లో అమ్ముడుపోని ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి ప్రస్తుత మార్కెట్ పరిస్థితి బట్టి రియల్ ఎస్టేట్ డెవలపర్లకు 16 నెలల సమయం పడుతుందని తెలిపింది. అత్యంత తక్కువ సమయంలో అంటే 15 నెలల్లో బెంగళూరులోని హౌసింగ్ ప్రాజెక్ట్‌లను క్లియర్ చేయొచ్చని చెప్పింది. ఐటీ రాజధాని బెంగళూరులో అమ్ముడుపోని ఇన్వెంటరీ తక్కువగానే ఉన్నట్టు పేర్కొంది. ఢిల్లీ–నేషనల్ క్యాపిటల్ రీజన్ పరిధిలోని బిల్డర్లకు తమ వద్దనున్న ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి మాత్రం అత్యధికంగా 44 నెలల వరకు సమయం పడుతుందని అనరాక్ పేర్కొంది. చెన్నైలో అన్‌సోల్డ్ ఇన్వెంటరీని అమ్మడానికి 31 నెలలు, ఎంఎంఆర్‌లో 34 నెలలు, కోల్‌కతాలో 38 నెలలు సమయం పడుతుందని చెప్పింది. దేశంలో రెసిడెన్షియల్ మార్కెట్లు బాగా దెబ్బతిన్న వాటిలో ఎన్సీఆర్ ఒకటిగా ఉందని వివరించింది. 2018 క్యూ3లో ఈ సమయం సగటున 58 నెలలుగా ఉందని అనరాక్ తెలిపింది. అమ్ముడుపోని రెసిడెన్షియల్ ఇన్వెంటరీని క్లియర్ చేసే సమయం 2018 క్యూ3లో 37 నెలలుగా ఉంటే, అది కాస్త 2019 క్యూ3 నాటికి సగటున 30 నెలలకు తగ్గిపోయింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని బట్టి స్టాక్ క్లియర్ చేసే సమయాన్ని అనరాక్ విశ్లేషించింది. 18 నుంచి 24 నెలల మధ్యలో ఈ సమయం ఉండటం కాస్త ఆరోగ్యకరమైన పరిస్థితేనని అనరాక్ చెప్పింది. బిల్డర్లు అంతకుముందున్న స్టాక్‌ను క్లియర్
చేయడానికి లేజర్ ఫోకస్డ్ విధానాన్ని అవలంబిస్తున్నారు. మార్కెట్లోకి కొత్త సప్లయి కూడా తగ్గించారు. సెప్టెంబర్ క్వార్టర్ ముగిసే నాటికి ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజన్(ఎంఎంఆర్), చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణే ప్రాంతాల్లో అమ్ముడుపోని ఇన్వెంటరీ మొత్తంగా 6.56 లక్షల యూనిట్ల వరకు ఉంది. ఇయర్లీ బేసిస్‌లో ఈ ఇన్వెంటరీ 5 శాతం తగ్గిపోయింది. రెండేళ్లలో 12 శాతం పడిపోయింది.
సిటీలో అమ్ముడుపోని ఇళ్లు 23,890…
2017 మూడో క్వార్టర్లో అమ్ముడుపోని స్టాక్ మొత్తంగా 7.44 లక్షల యూనిట్లు, గతేడాది ఇదే క్వార్టర్లో 6.87 లక్షల యూనిట్లు ఉన్నాయి. ప్రస్తుతం అమ్ముడుపోని హౌసింగ్ స్టాక్ ఎక్కువగా ఎంఎంఆర్‌లో 2.21 లక్షల యూనిట్లుగా, ఎన్సీఆర్లో 1.78 లక్షల యూనిట్లుగా, పుణేలో 92,560 యూనిట్లుగా, బెంగళూరులో 63,540 యూనిట్లుగా, కోల్‌కతాలో 45,570 యూనిట్లుగా, చెన్నైలో 31,380 యూనిట్లుగా ఉంది. హైదరాబాద్‌లో టాప్ సిటీల్లో అన్నింటి కంటే చాలా తక్కువగా సుమారు 23,890 యూనిట్లు ఉన్నాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ వెల్లడించింది.
జేపీ ఇన్ఫ్రాటెక్ కోసం మళ్లీ బిడ్స్
సురక్ష, ఎన్బీసీసీలకు మాత్రమే ఆహ్వానం
న్యూఢిల్లీ : రుణ సంక్షోభంలో కూరుకుపోయిన జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను సొంతం చేసుకోవడానికి తాజాగా మళ్లీ బిడ్స్ దాఖలు చేయాలని ప్రభుత్వ రంగానికి చెందిన ఎన్బీసీసీ, సురక్ష రియాల్టీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం జేపీ ఇన్ఫ్రాటెక్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్‌లో ఉంది. ఎన్బీసీసీ, సురక్ష రియాల్టీలు ఈ వారంలో సమర్పించబోయే బిడ్స్‌పై చర్చించడానికి జేపీ ఇన్ఫ్రాటెక్ లెండర్లు ఈ నెల 18న సమావేశం కాబోతున్నారు. జేపీ ఇన్ఫ్రాటెక్ ఇన్సాల్వెన్సీ రిజొల్యూషన్ ప్రాసెస్‌ను 90 రోజుల్లో పూర్తి చేయాలని, ఎన్బీసీసీ, సురక్ష రియాల్టీల నుంచి మాత్రమే బిడ్స్‌ను ఆహ్వానించాలని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. ‘ఇవాల్టి నుంచి 90 రోజుల్లో ఇన్సాల్వెన్సీ రిజొల్యూషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయాలని ఇంటెరిం రిజొల్యూషన్ ప్రొఫిషనల్ను(ఐఆర్పీ) ఆదేశించాం. తొలి 45 రోజుల్లో కేవలం సురక్ష రియాల్టీ, ఎన్‌బీసీసీల నుంచే రివైజ్ చేసిన రిజొల్యూషన్ ప్లాన్‌ను ఐఆర్పీ ఆహ్వానిస్తారు. అంతకుముందు కూడా వీరు రిజొల్యూషన్ ప్లాన్‌ను కమిటీ ఆఫ్ క్రెడిటార్ల ముందు సమర్పించి, ఫైనల్ బిడ్డర్లుగా ఎంపికయ్యారు’ అని బెంచ్ చెప్పింది. 2017లో జేపీ ఇన్ఫ్రాటెక్ ఇన్సాల్వెన్సీలోకి వెళ్లింది. ఈ సంస్థను పునరుద్ధరించాల్సిందిగా ఐడీబీఐ నేతృత్వంలోని కన్సార్టియం వేసిన అప్లికేషన్ ను ఎన్సీఎల్టీ ఆమోదించింది. దీని అప్పు సుమారు రూ.9,800 కోట్లుగా ఉంది.