ఐదేళ్లలో చెరువు విస్తీర్ణం ఎలా తగ్గింది?-ఖాజాగూడ పెద్ద చెరువుపై హైకోర్టు కామెంట్

మ్యాపులు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆర్డర్

హైదరాబాద్, వెలుగు: ఖాజాగూడ పెద్ద చెరువు విస్తీర్ణం అయిదేళ్లలో ఎలా మారింది? 2014 నాటి మ్యాప్‌కు 2019 నాటి మ్యాప్‌కు తేడా ఎలా వచ్చింది? చెరువు విస్తీర్ణం ఎలా తగ్గిపోతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆ రెండు మ్యాప్‌లను తమ ముందుంచాలని అధికారులను ఆదేశించింది. ఈమేరకు చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ నోటీసులు జారీచేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ చెరువు ఆక్రమణలకు గురవుతోందంటూ సామాజిక కార్యకర్త  లుబ్నా సార్వస్వత్‌ దాఖలు చేసిన పిల్‌లో ప్రతివాదులైన రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలతోపాటు హెచ్‌ఎండీఏలు తమ వాదనలతో కౌంటర్‌ దాఖలు చేయాలని సోమవారం ఆదేశాలిచ్చింది. ఈ కేసులో కోర్టుకు సహాయకారిగా(అమికస్‌క్యూరీ) నియమితులైన లాయర్‌ ఎం.ప్రతాప్‌ కుమార్‌ ఇచ్చిన రిపోర్టులో 2014 ఫిబ్రవరి 25 తేదీ నాటి మ్యాప్‌ ప్రకారం చెరువు 38.04 ఎకరాలని, 2019 ఏడాదిలోని మ్యాప్‌ మేరకు 37 ఎకరాలని పేర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌ 18న హెచ్‌ఎండీ వెబ్‌సైట్‌లో పెట్టిన మ్యాప్‌ ప్రకారం చెరువు విస్తీర్ణం తగ్గిందన్నారు. దీంతో ఆ రెండు మ్యాప్‌లను సమర్పించాలని హెచ్‌ఎండీఏను ఆదేశించిన హైకోర్టు.. కేసు విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

Latest Updates