చెన్నైహోర్డింగ్ ప్రమాదంపై హైకోర్టు ఆగ్రహం

  • ఇల్లీగల్​ బ్యానర్లు, హోర్డింగ్​లపై చర్యలేవని నిలదీత
  • దేశంలో ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని వ్యాఖ్య

చెన్నై:  అక్రమ హోర్డింగ్​ ఏర్పాటుపై తమిళనాడు ప్రభుత్వంపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇల్లీగల్​గా ఏర్పాటు చేసిన బ్యానర్ల వల్ల ఇంకెన్ని ప్రాణాలు పోవాలంటూ మండిపడింది. అనధికార బ్యానర్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందా? లేదా? అని ప్రశ్నించింది. గురువారం చెన్నైలో ఓ హోర్డింగ్​23 ఏళ్ల యువతిపై కూలింది. ఆమె కింద పడటంతో ఆమెపై నుంచి ట్యాంకర్ దూసుకెళ్లింది. ఈ ఘటనపై సోషల్ యాక్టివిస్ట్ ‘ట్రాఫిక్’ రామస్వామి, లాయర్లు వి.లక్ష్మినారాయణన్, వి.కన్నడసన్ దాఖలు చేసిన పిటిషన్లను జడ్జీలు జస్టిస్ ఎం.సత్యనారాయణ్, జస్టిస్ ఎన్.శేషసాయిలతో కూడిన డివిజన్ బెంచ్​ విచారణ జరిపింది. ‘‘రోడ్లపై చిందించేందుకు ప్రభుత్వానికి ఇంకెన్ని లీటర్ల రక్తం కావాలి’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ దేశంలో మనుషుల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై మాకు నమ్మకం పోయింది” అని సీరియస్​అయింది. బ్యానర్లు కట్టకుండా సదరు రాజకీయ నాయకుడు పెళ్లి చేయలేడా? అని ప్రశ్నించింది. ఇలాంటి అక్రమ హోర్డింగుల విషయంలో కనీసం ఇప్పుడైనా పొలిటికల్ పార్టీల్లో మార్పు రావాలని కామెంట్ చేసింది. సంబంధిత ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న చెన్నై కార్పొరేషన్ అధికారులు, పోలీసులు కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. తర్వాత విచారణను వాయిదా వేసింది.

 

 

Latest Updates