‘భారతీయుడు’ సీక్వెల్‌లో ఎన్ని ప్రత్యేకతలో తెలుసా..

కమల్ హాసన్ నటనకు బై చెప్పి రాజకీయాలకే అంకితమైపోతారేమోనని భయపడ్డారు ఆయన అభిమానులు, సినీప్రియులు. కానీ ‘భారతీయుడు’ సీక్వెల్ మొదలయ్యేసరికి అందరికీ ఆనందం ముంచుకొచ్చింది. అయితే ఆ మూవీ అనుకున్నంత త్వరగా సెట్స్‌ మీదికి వెళ్లలేదు. వాయిదాల మీద వాయిదాలు పడింది. ఎట్టకేలకు షూటింగ్ అయితే మొదలైంది.  లేట్​ అయితే అయింది కానీ.. ఈ చిత్రాన్ని ఎవరూ ఊహించని స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సులు ఓ రేంజ్‌లో తీస్తున్నారట. బడ్జెట్‌లో అత్యధిక శాతం దానికే కేటాయించారని తెలుస్తోంది. లొకేషన్స్​, మ్యూజిక్​, డైలాగ్స్​ కూడా డిఫరెంట్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. హీరోయిన్‌ కాజల్ ఇందులో చాలా డిఫరెంట్ పాత్రలో కనిపిస్తుందట. కలరి యుద్ధంలో నైపుణ్యం ఉన్న అమ్మాయిగా కనిపించనుందని సమాచారం. రకుల్, ఐశ్వర్యారాజేష్‌ వంటి పాపులర్ ఆర్టిస్టులు నటించడం మరో ఆకర్షణ. అయితే అన్నిటి కంటే పెద్ద అట్రాక్షన్ విజయ్ సేతుపతి. అతడు విలన్‌గా నటిస్తున్నాడంటే ఆ పాత్ర ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కమల్, విక్రమ్‌ల తర్వాత వైవిధ్యతకు కేరాఫ్ అడ్రస్ అని అందరూ ప్రశంసించే సేతుపతిని కమల్‌తో పాటు తెరమీద చూడటం కనులకు విందే. ఇన్ని ప్రత్యేకతలతో శంకర్‌‌ సినిమాను ఎలా తెరకెక్కిస్తున్నాడో అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. అందుకే సోషల్ మీడియాలో కూడా ఈ మూవీ గురించి చర్చ బాగా జరుగుతోంది. ఓ సర్జరీ కారణంగా కమల్‌ రెస్ట్‌ తీసుకోవాల్సి రావడంతో షూటింగ్‌కి బ్రేక్​ పడింది. త్వరలో మరో షెడ్యూల్‌ మొదలు కానుంది. ప్రేక్షకుల ముందుకి రావడానికి మాత్రం చాలా టైముంది.

Latest Updates